- బిసి నేతలల్లో ఒకరిని ఎంపిక చేసేందుకు కసరత్తు
- జాబితాలో ముందుకు చేరిన ధర్మపురి అర్వింద్ పేరు ?
న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 14: తెలంగాణలో కమల దళపతి ఎంపిక మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర పగ్గాలు ఎవరికి అప్పగించాలనే అంశంపై జాతీయ నాయకత్వం తర్జనభర్జన పడుతోంది. తెలంగాణలో బీసీ వాదం బలంగా వినిపిస్తోన్న నేపథ్యంలో అధ్యక్షుడి ఎంపిక సవాల్‌గా మారింది. అయితే బిసినే చేస్తారన్న వాదనా ఉంది. లేకుంటే ఎస్సీని కుర్చీలో కూర్చోబెడతారన్న వాదనా ఉంది. ఈ క్రమంలో ధర్మపురి అర్వింద్ పేరు తాజాగా చర్చల్లో ముందుకు వచ్చినట్లు సమాచారం. ఆయన అయితే బండి సంజయ్ లాగా దూకుడుగా వ్యవహరిస్తారని అంటున్నారు.
ఏప్రిల్‌లో జాతీయ అధ్యక్షుడి ప్రకటన ఉంటుందని భావిస్తున్నారు. అప్పటిలోగా దేశంలోని సగానికిపైగా రాష్టాల్రకు పార్టీ అధ్యక్షులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో తెలంగాణ అధ్యక్షుడి ఎన్నిక మార్చి నెలాఖరులోపు ఉంటుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి కేంద్రంలో కీలకమైన బొగ్గు, గనుల శాఖ మంత్రిగా ఉన్నారు. దీంతో పార్టీ రాష్ట్ర నాయకత్వ బాధ్యతలను మరొకరికి అప్పగించాలని భాజపా నాయకత్వం గతంలోనే నిర్ణయించింది.
భాజపా (BJP) రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అర్వింద్, రఘునందన్‌రావులతోపాటు మాజీ ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్‌రావు, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొంగిడి మనోహర్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు తదితరుల పేర్లు సైతం వినిపిస్తున్నాయి. మురళీధర్‌రావు పేరు కూడా తెరపైకి రావచ్చని కొందరు నేతలు చెబుతున్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల అధికారిగా కేంద్ర మంత్రి శోభా కరంద్లాజేను పార్టీ జాతీయ నాయకత్వం ఇప్పటికే నియమించింది. తెలంగాణ భాజపా పగ్గాలను పార్టీలో ముందు నుంచి ఉన్నవారికే ఇస్తారా? ఇతర పార్టీల నుంచి వచ్చి ముఖ్యనేతలుగా ఉన్న వారికి అవకాశం ఉంటుందా? అన్నది తేలాల్సి ఉంది. ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలను భాజపా కైవసం చేసుకోవడం ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ పెంచింది.