– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 4: ఎర్రగడ్డలో నివాసిత ప్రాంతం మధ్యలో శ్మశానం ఏర్పాటు చేయడం అవివేకపూరితమైన, అమానుష చర్య అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇలాంటి పనులు చేయడం ప్రజల భావోద్వేగాలను దెబ్బతీయడమే అవుతుందన్నారు. ఎర్రగడ్డ డివిజన్‌లోని కల్పతరువు రెసిడెన్సీ క్లబ్ హౌస్ మల్టీపర్పస్ హాల్‌లో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మిలిటరీ భూములని కూడా చూడకుండా అనుమతులు ఇవ్వడం తీవ్రమైన తప్పుగా పేర్కొన్నారు. ఎర్రగడ్డ సహా అనేక కాలనీలు, బస్తీల్లో డ్రైనేజీ వ్యవస్థ, రోడ్లు, మ్యాన్‌హోల్స్, వీధి దీపాలు వంటి ప్రాథమిక సదుపాయాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వర్షాలు పడితే వరదతో, మ్యాన్‌హోల్ మూతలు లేక దుర్వాసన వంటి సమస్యలు ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా మారాయని, మున్సిపల్ అధికారులు, కార్పొరేటర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. రాత్రి 9:30 తర్వాత డీజే వంటి కార్యక్రమాలు నిషేధం ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఆ నియమాలు అమలు కావడం లేదని తెలిపారు. పోలీసు శాఖ, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ అంశంపై జాగ్రత్తగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండూ పాలనలో అవకాశాలు పొందినా ప్రజా సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమయ్యామని విమర్శించారు. ఇప్పుడు ప్రజలు బీజేపీకి ఒక అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభ్యర్థి దీపక్ రెడ్డి సామాజిక, రాజకీయ, ప్రజా జీవితంలో విశాల అనుభవం కలిగిన వ్యక్తి అని, ఆయన ప్రజలతో మమేకమై ఉండే నాయకుడని, ప్రజలు పిలిస్తే వెంటనే స్పందించే స్వభావం కలిగిన అభ్యర్థి అని తెలిపారు. విద్యావంతులు, సంస్కారవంతులు రాజకీయాల్లోకి రావాలని, బాధ్యతతో పాలన చేసే వారు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మీ ఓటు బుల్లెట్ కంటే శక్తివంతమైనదంటూ అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఓటింగ్ శాతం పెంచి ప్రజాస్వామ్యాన్ని బలపరచాలని రామచందర్‌రావు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు మార్పు కోసం సమయం వచ్చిందంటూ జూబ్లీహిల్స్ నుంచి ఆ మార్పు ప్రారంభమవ్వాలన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





