రెండేళ్లలో ప్రతి రైతుకూ మ్యాప్‌తో కూడిన ‘భూదార్‌’

– ‘భూభారతి’తో సరికొత్త భూ విప్లవం
– చింతకాని సభలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
– ముల్గుమాడ్ రైతులకు సీఎం, డిప్యూటీ సీఎంల చేతుల మీదుగా రికార్డుల పంపిణీ
– రెండేళ్లలో 71 వేల ఉద్యోగాల భర్తీ.. త్వరలో మరో 20 వేలకు నోటిఫికేషన్లు
– మహిళా సంఘాలకు సున్నా వడ్డీకే రూ.63 వేల కోట్లు
– ప్రతిపక్షాల అబద్ధాల ప్రచారాలపై మంత్రి ఫైర్

చింతకాని, ప్రజాతంత్ర, జూలై 10 : భూభారతి కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టాం.. రాబోయే రెండేళ్లలో రాష్ట్రంలో ఉన్న ప్రతి భూమినీ సర్వే చేసి సాగులో ఉన్న ప్రతి రైతుకు మ్యాప్‌తో కూడిన ‘భూదార్‌’ కార్డును అందజేస్తాం అని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. చింతకాని మండలం జగన్నాథపురం వద్ద శుక్రవారం నిర్వహించిన చరిత్రాత్మక రైౖతు ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్న ఈ వేదికపై మంత్రి పొంగులేటి భూ సంస్కరణలతోపాటు ప్రభుత్వ ప్రగతిని వివరించారు. ఇప్పటికే ప్రతి జిల్లాలో 70 గ్రామాల్లో భూభారతి పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. పైలట్ ప్రాజెక్టు కింద మధిర నియోజకవర్గంలోని ముల్గుమాడ్ రెవెన్యూ గ్రామంలో సర్వే పూర్తి చేసి సుమారు 476మంది రైతులకు మ్యాప్‌లతో కూడిన భూదార్ కార్డులను సిద్ధం చేశామన్నారు. ఈ వేదికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా రైతులకు ఈ కార్డులను పంపిణీ చేస్తున్నామని, రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా అందరికీ ఇదే పద్ధతిలో కార్డులు ఇస్తామని మంత్రి ప్రకటించారు.

నిరుద్యోగులకు వరం.. మహిళలకు అండ

ఈ రెండున్నర ఏళ్లలోనే సుమారు కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే దృఢ సంకల్పంతో మహిళా సంఘాలకు రూ.63 వేల కోట్లను సున్నా వడ్డీకే అందించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని మంత్రి చెప్పారు. నిరుద్యోగ యువతను ఆదుకునేందుకు మొదటి రెండేళ్లలోనే రికార్డు స్థాయిలో 71 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని, రాబోయే కొద్ది రోజుల్లోనే మరో 17 వేల నుంచి 20 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నామని ప్రకటించారు.

అవినీతి పిల్లర్లపై కాళేశ్వరం

ప్రస్తుత ప్రజా ప్రభుత్వం మాటలకే పరిమితం కాలేదని, చేతల్లో చూపిస్తోందని మంత్రి అన్నారు. గత పాలకులు తాము చేసిన తప్పులను, అబద్ధాలను ఈ ప్రభుత్వంపై రుద్దాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల ముందే చెప్పాం.. కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రతి పిల్లర్‌లోనూ అవినీతి కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని.. ఇవాళ అదే నిజమైంది అని అన్నారు. నీటిపారుదల శాఖపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నాయని, అబద్ధాల ప్రచారం మానుకోకపోతే ప్రజలు రాబోయే రోజుల్లోనూ తగిన బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు.

పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లే లక్ష్యం

అర్హులైన ప్రతి పేదవాడికీ ఇల్లు అందించడమే ప్రజా ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రభుత్వం ఇళ్ల స్థలాల పంపిణీకి సంబంధించి రెండో విడత పూర్తి చేసిందని, రాబోయే రోజుల్లో మిగిలిన దశలను కూడా శరవేగంగా పూర్తి చేసి లబ్దిదారులకు ఇళ్లు అందజేస్తామని హామీ ఇచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *