– ఆయన వ్యాఖ్యలపై మండిపడ్డ పీసీసీ చీఫ్ మహేష్
- కాంగ్రెస్‌లోకి వస్తామంటే ఆలోచిస్తామని వెల్లడి
– బీఆర్‌ఎస్ నిధులపై కవిత వ్యాఖ్యల్లో నిజముంది
హైదరాబాద్,ప్రజాతంత్ర,జూలై10: మూడు నెలలు నీటిపారుదల మంత్రిగా అవకాశం ఇస్తే నీటి సమస్యను పరిష్కరించి చూపిస్తానంటూ బీఆర్‌ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. మీడియాతో శుక్రవారం మాట్లాడుతూ హరీష్ రావు నిజంగా కాంగ్రెస్‌లోకి వస్తానంటే పార్టీలో చర్చిస్తామన్నారు. పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో చర్చించి హరీష్ రావును చేర్చుకోవాలా? వద్దా? అని నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పదేండ్లు ఏం చేయని వారు మూడు నెలల సమయంలో ఏం చేస్తారని ప్రశ్నించారు. ఆయన జలవనరులశాఖ మంత్రిగా ఉన్నప్పుడు నిర్మించిన ప్రాజెక్టే కుంగింది.. దాని గురించి ఏం చెప్పాలి. పదేళ్లు మంత్రిగా ఉంటూ ఏం చేశారు?.. మళ్లీ మూడు నెలలు ఎందుకు? బీఆర్‌ఎస్ పార్టీ నిధులపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత చేసిన ఆరోపణల్లో నిజముంది. ఒక ప్రాంతీయ పార్టీకి రూ.1,400 కోట్లు ఎలా వచ్చాయి? హరీష్ రావు కాంగ్రెస్‌లోకి వస్తానంటే కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.‘ అని మహేశ్‌కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ అప్పులు, తప్పులను సరి చేస్తున్నామని మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత గొడవలపై మహేష్ స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయాలు సహజమన్నారు. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. తుంగతుర్తి సమస్య కూడా పరిష్కారం అవుతుందని చెప్పారు. ఇరు వర్గాల వాదనలు వింటామన్నారు. పార్టీలో అందరూ సమానమే అని తేల్చిచెప్పారు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బిజీగా ఉండడం వల్ల ఇద్దరు సీనియర్ నాయకులను సమస్య పరిష్కారం కోసం నియమించామని అన్నారు. సస్పెండ్ చేయడమే పరిష్కారం కాదన్నారు. వరంగల్‌లో మంత్రి కొండా సురేఖ- ఎమ్మెల్యే కడియం శ్రీహరి, తుంగతుర్తిలో నేతల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరిస్తామని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. దీనిపై ఇప్పటికే ఇద్దరు సీనియర్లను పరిశీలకులుగా నియమించామని చెప్పారు. వరంగల్ అంశాన్ని సచిన్ సావంత్‌కు, తుంగతుర్తి బాధ్యతను జగ్గారెడ్డికి అప్పగించాం. అందరితో చర్చించి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటాం. ప్రభుత్వాన్ని కూలగొడతామని అన్నప్పుడు.. పది మంది ఎమ్మెల్యేలు తమకు మద్దతు ఇచ్చారని చెప్పారు. నీళ్ల దోపిడీ జరిగినప్పుడు ఈటల మంత్రిగా ఉన్నారని మహేశ్ గుర్తుచేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





