– అధికారులకు ముఖ్యమంత్రి అభినందన
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 23 : భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఆది కర్మయోగి అభియాన్ జాతీయ సదస్సులో తెలంగాణ గిరిజన సంక్షేమంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రంగా గుర్తింపు పొందింది. రాష్ట్రపతి చేతుల మీదుగా రాష్ట్ర ప్రతినిధులు జాతీయ అవార్డులు స్వీకరించారు. గిరిజన, సాంఘిక సంక్షేమ మంత్రి, సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్, గిరిజన సంక్షేమ శాఖ అదనపు సంచాలకుడు విట్టా సర్వేశ్వర్ రెడ్డి, గిరిజన సాంస్కృతిక పరిశోధన శిక్షణ సంస్థ సంచాలకుడు డాక్టర్ వి.సముజ్వల, సహాయ సంచాలకురాలు పద్మ పి.విలు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని గురువారం కలిసి తమకు వచ్చిన పురస్కారాలను చూపారు. భారత గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ చేపడుతున్న పథకాలను తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ సమర్థవంతంగా అమలుపరిచి గిరిజన సంక్షేమానికి ఇతోధికంగా కృషి చేసినట్లు వివరించారు. వివరాలు తెలుసుకొని ముఖ్యమంత్రి సంబంధిత అధికారులను అభినందించారు.
తెలంగాణ రాష్ట్ర విజయాలు
పీఎం జన్‌మన్ కార్యక్రమంలో తెలంగాణ దేశంలో టాప్ 3 రాష్ట్రాలలో ఒకటిగా నిలిచింది. ధర్తీ ఆబా జంజాతి గ్రామీణ ఉత్కర్ష్ అభియాన్ (డీఏ జేజీయూఏ)లో సమాజ భాగస్వామ్యంలో దేశంలో 6వ స్థానంలో నిలిచింది. ఆది కర్మయోగి అభియాన్‌లో ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలు, ఐటీడీఏలు భద్రాచలం, ఉట్నూర్ జాతీయస్థాయి అవార్డులు పొందాయి. ఉత్తమ శిక్షకులుగా పద్మ పివి, డాక్టర్ ఎ.కీర్తి, డాక్టర్ జి. నరేందర్ రెడ్డిలు గుర్తింపు పొందారు. ఈ గుర్తింపు గిరిజన సంక్షేమ శాఖ, ఐటీడీఏలు, క్షేత్రస్థాయి సిబ్బంది చేసిన కృషికి నిదర్శనం. సమగ్ర గిరిజన అభివృద్ధి, ప్రజా భాగస్వామ్యం, అంతర్ శాఖ సమన్వయంలో రాష్ట్రం ఆదర్శప్రాయంగా నిలుస్తోంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





