– నాలుగు నెలలపాటు కొనసాగనున్న కార్యక్రమం
– ముందుగా యాదాద్రీశుడిని దర్శించుకున్న కవిత
– ప్రతి జిల్లాలో రెండు రోజులు మకాం
– సమస్యల పరిష్కారంపై మేధావులతో చర్చలు
యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, అక్టోబర్ 23: జాగృతి జనం బాట కార్యక్రమాన్ని నిజామాబాద్ జిల్లాలోని తమ స్వగ్రామం నుంచి ఈనెల 25న ప్రారంభించి 33 జిల్లాలలో నాలుగు నెలలపాటు పర్యటించనున్నట్టు తెలంగాణ జాగృతి నాయకురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని ఆమె గురువారం దర్శించుకున్నారు. ముందుగా ప్రధానాలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలు అందజేశారు. అధికారులు స్వామివారి లడ్డు ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ యాదగిరిగుట్ట ఆలయ పరిధిలో ఏర్పాటు చేసిన ఓటింగ్‌లపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆలయ పరిధిలో నెలకొన్న అనేక సమస్యలను యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటనలో మైక్రో లెవెల్లో చర్చించనున్నట్లు తెలిపారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చేపడుతున్న జాగృతి జనం బాట కార్యక్రమం విజయవంతం కావాలని ముందుగా తిరుమల వెంకటేశ్వర స్వామి, అలాగే ఈరోజు యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి క్షేత్రాలను దర్శించుకుంటున్నట్టు తెలిపారు. ప్రతి జిల్లా కేంద్రంలో రెండు రోజులు ఉండి అక్కడి మేధావులు, విద్యావంతలు, యువకులు, మహిళలు, రైతులు. రైతు కూలీలు, విద్యార్థులను కలిసి ఆయా జిల్లాల్లో సమస్యలను తెలుసుకొని పరిష్కార మార్గాలపై చర్చిస్తామన్నారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు సుజిత్ రావు. ఆర్గనైజింగ్ సెక్రటరీ దుగుంట్ల నరేష్, రాష్ట్ర కమిటీ సభ్యులు కోల శ్రీనివాస్, రాచమల్ల బాలకృష్ణ, మారయ్య, రామ్‌కోటి ప్రజాపతి, గోపుసదానంద, యునైటెడ్ పూలే ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ బొల్ల శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





