మోదీ రైతు వ్యతిరేక విధానాలపై సమర భేరి

– నవంబర్ 15 నుంచి రైతు సంఘం జాతీయ మహాసభలు
– తెలంగాణ రైతాంగ పురిటిగడ్డ నల్లగొండలో ఏర్పాటు
– రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని వెల్లడి

ఖమ్మం, ప్రజాతంత్ర, అక్టోబర్ 21 తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట పురిటిగడ్డ అయిన ఉమ్మడి నల్లగొండ జిల్లా కేంద్రంలో అఖిల భారత రైతు సంఘం (ఏఐకేఎస్) 36వ జాతీయ మహా సభలను అత్యంత ఉద్యమ స్ఫూర్తితో నిర్వ హించబోతున్నామని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్ వెల్లడించారు. బుధవారం ఖమ్మంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో అధికారంలోకి రావడానికి ముందు నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన అనేక వాగ్దానాలను పూర్తిగా విస్మరించిందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను పక్కాగా అమలు చేస్తామని, ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఆ మాటలన్నింటినీ తుంగలో తొక్కిందని పోతినేని విమర్శించారు. దేశ వ్యవసాయ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేస్తూ కార్పొరేట్ శక్తులకు, బహుళజాతి కంపెనీలకు ధారాదత్తం చేసే కుట్రలకు కేంద్రం పాల్పడుతోందన్నారు. జాతీయ మహాసభల ద్వారా మోదీ రైతు వ్యతిరేక విధానా లపై సమరభేరి మోగిస్తామన్నారు.
నవంబర్ 15 నుంచి 18వ తేదీ వరకు నాలుగు రోజులపాటు జరగనున్న ఈ చరిత్రాత్మక మహాసభల వివరాలను ఆయన తెలియ‌జేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఖమ్మం జిల్లాలో 26వ మహాసభలు జరిగాయని, సరిగ్గా 37 సంవత్స రాల తర్వాత మళ్లీ 1979లో ఖమ్మంలోనే జరిగాయని గుర్తు చేశారు. ఇప్పుడు 37 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత స్వతంత్ర తెలంగాణ గడ్డపై ఈ జాతీయ మహాసభలు జరగడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుందని ఆయన పేర్కొన్నారు. నవంబర్ 15న మహాసభల ప్రారంభం సందర్భంగా 15 వేల మంది క్రమశిక్షణ కలిగిన రెడ్ షర్ట్ వలంటీర్లతో భారీ ప్రదర్శన, కవాతు నిర్వహిస్తున్నామని, అలాగే లక్షమందికి పైగా రైతులతో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ మహాసభలను జయప్రదం చేయడానికి ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగం, ప్రజానీకం పూర్తి స్థాయిలో సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సమావేశంలో రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు నున్నా నాగేశ్వరరావు, బండి రమేష్, వాసిరెడ్డి ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు మాదినేని రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి బొంతు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *