– బాబు కుట్రకు మద్దతు పలుకుతున్న రేవంత్
– తెలంగాణ ద్రోహులు మళ్లీ నిద్ర లేచారు
– తెలంగాణ నోట్లో మట్టికొడుతున్న ‘చెయ్యి’!
– కావేరి ముసుగులో తెలంగాణ గొంతు కోస్తున్న బాబు
– దేవాదులలో పది మోటర్లు ఎందుకు నడపలేదు?
– మీ నిర్వాకం వల్ల వరంగల్ జిల్లా కరువు పాలైంది
– బీజేపీ నాయకులు ఏం చేస్తున్నరు?
– ఇంతమంది ఎంపీలున్న ఈ ద్రోహాన్ని అడ్డుకోలేదు
– నిప్పులు చెరిగిన హరీష్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 17: నవంబర్ 3న దిల్లీలో జరగనున్న ఎన్డబ్ల్యూడీఏ మీటింగ్ ఎజెండాలో గోదావరి కావేరి లింకును చేరుస్తూ రాష్ట్ర నీటి హక్కులకు మరణశాసనం రాస్తున్నారు. అడ్డుకోవాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కుట్రకు మద్దతు పలుకుతూ చారిత్రక ద్రోహానికి పాల్పడుతున్నడని బిఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఆగ్రహం వెలిబుచ్చారు. తెలంగాణ భవన్లో శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ గోదావరి కావేరి లింకును పోలవరం నుంచి చేపట్టాలని, ఎజెండాలో చేర్చాలని చంద్రబాబు ఈనెల 7న లేఖ రాయగానే ఎజెండాలో పొందుపరిచి నవంబర్ 3న మీటింగ్ పెట్టారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం కుక్కిన పేనుల్లా పడి ఉన్న తెలంగాణ ద్రోహులంతా ఇవాళ మళ్ళా నిద్రలేచారు. పోలవరం బనకచర్ల లింకు ప్రాజెక్టుతో గోదావరి జలాలను అక్రమంగా ఆంధ్రకు తరలించేందుకు విష కూటమిలా తయారయ్యారు. తెలంగాణలో రేవంత్ సర్కార్ ఏర్పడిన మరుక్షణం నుంచే చంద్రబాబు గోదావరీ జలాల దోపిడీ మొదలు పెట్టిండని ఆరోపించారు. కోవర్టు రేవంతు తెలంగాణ నీటి హక్కులు నిండా ముంచుతున్నడు. గోదావరి జలాలను కొల్లగొట్టేందుకు ఏపీ సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తూనే ఉన్నారు.రాష్ట్ర ప్రభుత్వ మొద్దు నిద్రలో ఉంటే ఆ ఎత్తులను బిఆర్ఎస్ చిత్తు చేస్తూ వస్తున్నది. గోదావరిలో 200 టీఎంసీలు తీసుకుపోయేందుకు తొలుత పోలవరం-బనకచర్లను తెరమీదికి తీసుకొచ్చారు. ఆ తర్వాత నల్లమలసాగర్గా పేరు మార్చారు. ఇప్పుడు కేంద్రంతో ఒప్పించి దానిని గోదావరి-కావేరి నదుల అనుసంధానం పేరిట బనకచర్లకు మార్గం సుగమం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. చంద్రబాబు ఇప్పుడు గోదావరి కావేరి ముసుగులో మూడో ప్రతిపాదనకు తీసుకువచ్చారు. నేరుగా పోలవరం నుంచి బొల్లపల్లి, నాగార్జున సాగర్ సోమశిల ద్వారా కావేరికి నీళ్లు తరలించే ప్లాన్ చేసిండు. గోదావరి బనకచర్ల, గోదావరి నల్లమల సాగర్ ఫెయిల్ కావడంతో మొత్తం తెలంగాణ నదీ జలాలను కబలించే కుట్ర ఇది. అడ్డుకోవాల్సిన రేవంత్ రెడ్డి పూర్తిగా దాసోహం అంటున్నడు. పోలవరం నుంచి కావేరికి నేరుగా కలిపి అనుసంధానంలో తెలంగాణ లేకుండా చేసారు. కేసీఆర్ హెచ్చరించినట్టు ‘కత్తి పరాయి వాడిదే కానీ..పొడిచే చెయ్యి’ మనోడిదే! ‘చెయ్యి’ తెలంగాణ నోట్లో మట్టికొడుతున్నది.
ఇది జాతి ద్రోహం
‘గురుదక్షిణ అని నువ్వు అనుకుంటున్నవు, కానీ ఇది అంతకు మించిన జాతి ద్రోహం. నువ్వు చేస్తున్న జల ద్రోహానికి భవిష్యత్ తరాలు కూడా నిన్ను క్షమించవు రేవంత్ రెడ్డి’ అన్నారు. బనకచర్ల విషయంలో మేం అనేకసార్లు హెచ్చరించినం.. చంద్రబాబుతో జాగ్రత్తగా ఉండాలని చెప్పినం. మా గురువు మా గురువు అంటూ గోదావరి జలాలను వదలిపెట్టిండు. ఇప్పుడు అసలుకే ఎసరు వచ్చింది. ఈ రేవంత్ రెడ్డి.. ఇన్నాళ్లూ మనకు నీళ్లు ఉన్నా.. నీటి హక్కులు ఉన్నా వినియోగించలే దు. ఇప్పుడు ఏకంగా నీటి హక్కులే లేకుండా చేస్తున్నడు. ఇప్పటికే రిజర్వాయర్లలో నీటి నిల్వ లేదు, పంటలకు నీళ్లు ఇవ్వలేని పరిస్థితి. ఎల్ నినో ఎఫెక్ట్ ఉంటుందని 9 నెలల నుంచి మొత్తుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమైన రేవంత్ రెడ్డి నేడు ఎల్ ని నో పేరు చెప్పి చేతులెత్తేసిండు.రైతులు, ప్రజలను మీ సావు మీరు సావండి అంటున్నడు. ఇంక‘ఏదైనా కొనగలం కానీ నీళ్లను కొనలేం అంటున్నడు’. మరి అంతటి ప్రాధాన్యం గల నీళ్ల విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నవు రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు. దేవాదులలో నీళ్లు వస్తున్నయి. పది మోటార్లు నడవాల్సిన చోట మూడే ఎందుకు నడుపుతున్నావు అని నిలదీసినం. తెలంగాణ భవన్ లో మాట్లాడినం, వరంగల్ జిల్లాలో మాట్లాడినం. ఈరోజు పైసలు పెట్టి ఏదైనా కొనొచ్చు, నీళ్లు కొనలేం అంటున్నడు. దేవాదులలో పదికి పది మోటార్లు ఎందుకు నడపలేదు? అది చేసుంటే ఈరోజు వరంగల్ లో కరువు వచ్చేది కాదు కదా అన్నారు. ఏపీలో కరువు లేదు. తెలంగాణ కంటే తక్కువ వర్షపాతం ఏపీలో నమోదైంది. కానీ అక్కడ క్రాప్ హాలిడే లేదు, ఇక్కడ మాత్రం పంటలు వేయొద్దు అంటున్నవు. దేవాదులలో 10 మోటార్లు నడిపితే చెరువులు, చెక్ డ్యాంలు, రిజర్వాయర్లు నిండేవి కరువు ఉండేది కాదు. శ్రీశైలంలో నీళ్లు నిల్వ ఉన్నా లిఫ్ట్ చేయలేదు. 5 మోటార్లు ఉన్న కల్వకుర్తిలో 3 మోటార్లు 7,8 గంటలు నడిపావు. నువ్వు వదిలిపెడితే చంద్రబాబు 700 కి.మీ దూరంలో ఉన్న కుప్పానికి నీళ్లు తీసుకువెళ్లాడు. ఏపీలో జలహారతి, తెలంగాణలో కన్నీళ్ల హారతి. పాలమూరుకు, తెలంగాణకు కాలం తెచ్చిన కరువు కాదు, రేవంత్ తెచ్చిన కరువు. కన్నెపల్లిలో మోటార్లు నడపాలని డిమాండ్ చేస్తే నడపలేదు. ఎన్డీఎస్ఏ పేరు చెప్పి కాలయాపన చేసినవు అని హరీష్రావు ఆరోపించారు. నీళ్లు లిఫ్ట్ చేయడం రాష్ట్ర నిర్ణయం మాకు సంబంధం లేదు అని హైకోర్టులో ఎన్డీఎస్ఏ అఫిడవిట్ వేసి చెంప చెళ్లుమనేలా చెప్పింది. సిడబ్లుపిఆర్ఎస్ తన నివేదికలో అన్నారం, సుందిళ్ల అద్బుతంగా ఉన్నాయని చెప్పాయి. కన్నెపల్లిలో నీళ్లు లిఫ్ట్ చేసే అవకాశం ఉన్నా, తెలంగాణకు, హైదరాబాద్ కు నీళ్లు ఇచ్చే అవకాశం ఉన్నా రాజకీయాలు చేస్తూ లేని కరువు తెచ్చినవు రేవంత్ రెడ్డి. దేవాదుల, కన్నెపల్లి, కల్వకుర్తిలో 24 గంటల పాటు ఎందుకు మోటార్లు ఆన్ చేసి నీళ్లు ఎత్తలేదు. పంపుల వద్దకు అఖిలపక్షం తీసుకుపోదాం పదా? నీ ఫెయిల్యూర్ చూపిస్తా? ఎన్ని గంటలు నడిపినవు? ఎన్ని ఎత్తినవు తెలుస్తుంది అన్నారు. కల్వకుర్తిలో 35 టీఎంసీలు ఎత్తే అవకాశం ఉంటే 13 టీఎంసీలు నడిపినవు. మిగిలిన నీళ్లు ఏపీకి దారాదత్తం చేసినవు. నేను రుజువు చేయడానికి రెడీగా ఉన్నా పోదాం పదా.
మన్ను తిన్న పాము లెక్క ఉన్నవ్
గోదావరి జలాలను తరలించుకుపోయే లింకు విషయంలో చంద్రబాబు లేఖల మీద లేఖలు రాస్తున్నడు. దిల్లీలో మీటింగులు అటెండ్ అవుతున్నడు. నువ్వు మన్ను తిన్న పాము లెక్క కదులవు మెదులవు. ఈనెల 7న చంద్రబాబు పాటిల్ కు లేఖ రాసిండు. ఆ లేఖ గోదావరిలో తెలంగాణ హక్కులకు మరణశాసనం. లేఖ మూడో పాయింట్: ‘‘గోదావరి–కావేరి నదుల అనుసంధాన ప్రాజెక్టుకు నీటిని మళ్లించే వనరుగా ఇచ్చంపల్లి లేదా సమ్మక్క సాగర్ ను గతంలో ఎన్డబ్ల్యుడీఏ ప్రతిపాదించింది.. ఈ ప్రతిపాదన ప్రకారం నీటిని డైవర్ట్ చేస్తే, ఆంధ్రప్రదేశ్ కు తీవ్ర నష్టం. ఎలాంటి లాభం లేదు. పోలవరం, ఇతర ప్రాజెక్టుల నీటి వినియోగంపై తీవ్ర ప్రభావం చూపుతుంద’’ని లేఖలో రాసిండు.పదేళ్ల క్రితం జరిగిన నిర్ణయాన్ని ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు.ఆనాడు బిఆర్ఎస్ ప్రతిపాదిస్తే ఇది సాధ్యం అయ్యింది.ఏ రాష్ట్రానికి ఎంత నీళ్లు అనేది ఆరోజు జరిగిన మీటింగ్ లో నిర్ణయించారు.గోదావరి పరివాహక ప్రాంతాలకు ఆ మెమరాండం కూడా పంపడం జరిగింది.తెలంగాణ నుంచి తీసుకుపోవాలని అన్ని రాష్ట్రాలు ఒప్పుకున్నయి.ఇచ్చంపల్లి నుంచి తీసుకుపోయేందుకు..
2024 జూన్ 10న జరిగిన మీటింగ్ లో మధ్యప్రదేశ్, 2024 జూన్ 11న జరిగిన మీటింగ్ లో తమిళనాడు, 2026 సెప్టెంబర్ 3న
కర్ణాటక, పుదుచ్చెరిలు ఒప్పుకున్నాయి.కానీ చంద్రబాబు మాత్రం తెలంగాణకు ప్రయోజనం వద్దు అంటున్నడు.లేఖలో ఆరో పాయింట్: గోదావరి నుంచి తరలించిన నీటిని నేరుగా నాగార్జున సాగర్ రిజర్వాయర్ లోకి వదలడానికి బదులుగా, బొల్లపల్లి రిజర్వాయర్ ను వినియోగించాలని అంటడు. 150 టీఎంసీలు నింపుకుంట అంటడు.మరి తెలంగాణ హక్కులు ఏం కావాలి.సమక్క నుంచి నాగార్జున సాగర్ మీదుగా తీసుకువెళ్తే తెలంగాణకు నీళ్లు వస్తయి, కరువు వస్తే మనం వాడుకోవచ్చు. మనకు నీటి హక్కులు ఉంటయి.ఇచ్చంపల్లి నుంచి నాగార్జున సాగర్ మీదుగా నదుల అనుసంధానం జరగాలని కేంద్రం ఒప్పుకున్నది. సరిహద్దు రాష్ట్రాలు ఒప్పుకున్నయి.మేము ముందు నుంచి ఒకటే చెబుతున్నాం. ఇచ్చంపల్లి కావేరీ లింకు విషయంలో.మా రాష్ట్రానికి 968టీఎంసీలకు మాకు అనుమతి ఇవ్వాలి, తీసుకుపోయే నీళ్లలో 50శాతం మాకు ఇవ్వాలి, మా నీళ్లు ఒక్క చుక్క ముట్టుకోకుండా ముందుకు వెళ్తే నదుల అనుసంధానంకు ఒప్పుకుంటామని స్పష్టంగా చెప్పినం.ఇప్పుడేం జరుగుతున్నది అసలు ఇచ్చంపల్లి వద్దు, పోలవరం మార్చాలి అంటున్నరు. నాగార్జున సాగర్ మీదుగా వద్దు బొల్లపల్లి తీసుకుపోతం అంటున్నరు.మనకు పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటి? 139 టీఎంసీలు పెండింగ్ లో ఉన్నయి. వార్దా, సమ్మక్క, మూడో టీఎంసీలు కాంగ్రెస్ చేతగాని తనం వల్ల వాపస్ చ్చింది.ఇచ్చంపల్లి నుంచి నాగార్జున సాగర్ మీదుగా పోతే 2,38,236 ఎకరాలకు నీళ్లు అందుతాయి.ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సాగు నీళ్లు వస్తయి. ఇది ఆనాటి కేంద్రం ఎంఓయూలో నే స్పష్టంగా ఉంది.ఇప్పుడు ప్రతిపాదన మార్చితే తెలంగాణ పరిశ్రమలకు నీళ్లు, తాగు నీరు, సాగు నీరు పరిస్థితి ఏమిటి?మొదట ఉండే రాష్ట్రం తెలంగాణ మన వాటా మనకు రాకుండా చేస్తున్నారు.చంద్రబాబు లేఖ రాసి పది రోజులు అవుతున్నా నీకు సోయి రాదు పెదవి విప్పవు.అసలు ఇంటర్ లింకింగ్ నుంచి సమ్మక్క సాగర్ ను ఎందుకు తీసేస్తున్నరు.గతంలో సమ్మక్క సాగర్ కు 45 టీఎంసీ అనుమతి ఇవ్వొద్దు, మా పోలవరంకు నష్టం అవుతుంది అని ఏపీ లేఖ రాసింది. వాళ్లు వెంటనే డీపీఆర్ వాపస్ పంపారు.లేఖలో గోదావరి కావేరీ లింకు విన్ విన్ సిట్యుయేషన్ అంటున్న చంద్రబాబు గారు..ఏ విధంగా విన్ విన్ సిట్యుయేషన్ అవుతుంది చంద్రబాబు చెబుతారా? రేవంత్ చెబుతారా? కేంద్రం చెబుతుందా ?తెలంగాణకు నష్టం చేసే ఈ ప్రతిపాదన ఎలా విన్ విన్ సిట్యుయేషన్ అవుతుందని ప్రశ్నించారు.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మొన్న ఏపీకి వచ్చిండు.చేయి చేయి కలుపుదాం దక్షిణాదికి మేలు చేసుకుందాం అని మాట్లాడుకున్నరు.అసలు ఏం జరుగుతుందో తెలుసా రేవంత్ రెడ్డి.కర్ణాటకను ఒప్పించేందుకు చంద్రబాబు ఆఫర్ ఇచ్చిండు.
మేము కింద గోదావరి నీళ్లు వాడుకుంటం, పైన ఆల్మట్టిలో 16 టీఎంసీలు ఆపుకో.కానీ పోలవరం లింకుకు ఒప్పుకో అంటున్నడు.
అల్రెడీ పోలవరం డైవర్షన్ లో 21 టీఎంసీలు, ఇప్పుడు 16 టీఎంసీలు అంటే 37 టీఎంసీలు కృష్ణాలో ఆగితే పాలమూరు జిల్లాకు నష్టం.ఎల్ నినో నేపథ్యంలో నీళ్ల ప్రాధాన్యం అర్థమైన తర్వాత ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.ఎందుకు నోరు మెదపడం లేదు? తెలంగాణ శాశ్వతంరాష్ట్ర హక్కులను కాలరాసే హక్కు నీకు లేదు రేవంత్ రెడ్డి.జాతీయ ప్రయోజనాలు అంటే ఒక రాష్ట్రానికి మేలు జరగటం కాదు.ఇచ్చంపల్లి నుంచి లింకు ప్రాజెక్టు వెళ్తే అన్ని రాష్ట్రాలకు ఉపయోగం.కానీ కేంద్రం ఏం చేస్తున్నది. చంద్రబాబు ఏం చెబితే అదే చేస్తారా16 మంది ఎంపీలు ఉండి గడ్డి పీకుతున్నారా.ఈ ప్రతిపాదన కేంద్రం ఒప్పుకుంటే తెలంగాణ జాతికిశ్వాశ్వతంగా ద్రోహం చేసినట్లేరేవంత్ రెడ్డి ఎందుకు మౌనం? మీ మధ్య ఉన్న ఒప్పందం ఏమిటి.రేవంత్ గురు దక్షిణ చెల్లిస్తుంటే, బిజేపీ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు తెలంగాణ హక్కులను కాపాడే బాధ్యత లేదా? కేఎల్ రావు గొప్పవారు అని ఏపీ వాళ్లు కీర్తిస్తారు. ఆ కేఎల్ రావే గోదావరి కావేరి లింకు ఇచ్చంపల్లి మీదుగా తీసుకుపోవాలని చెప్పారు. వారు చెప్పినా వినరా? ఏపీ ప్రయోజనాలే దేశ ప్రయోజనాలు అవుతాయా?చంద్రబాబు ఎంపీలను చేతిలో పెట్టుకొని ఆడిస్తే కేంద్రం ఆడుతుందా? తెలంగాణ జాతికి మోసం చేస్తాం అంటే తెలంగాణ ప్రజలు ఊరుకోరు. ఊరుకునే గడ్డ కాదు, ఎలాంటి పోరాటానికైనా సిద్దం. ఈ ప్రతిపాదనలు వెంటనే ఉపసంహరించుకోవాలి డిమాండ్ చేస్తున్నాం.
సర్ ప్లస్ వాటర్ మీద ప్రాజెక్టు అనుమతించరు
సర్ ప్లస్ వాటర్ ఉందంటున్న చంద్రబాబు అసలు సర్ ప్లస్ వాటర్ ఎంతుంది, తెలంగాణ వాటా ఎంత అది తేలకుండా వాడుకుంటాం అంటే ఏమన్నట్లు? తెలంగాణ పరిస్థితి ఏమిటి? సర్ ప్లస్ వాటర్ మీద ప్రాజెక్టు అనుమతించరు. అసలు గోదావరి కావేరి నీళ్లు ఎక్కడివి అంటే.. చత్తీస్ గడ్ వినియోగించని 148 టీఎంసీలు. వీటిని గోదావరి కావేరీ లింకుకు వాడుతం అన్నరు.ఛత్తీస్గఢ్ వినియోగించుకోని 148 టీఎంసీలను మళ్లించాలనే లక్ష్యంతో ఎన్డబ్ల్యుడీఏ గోదావరి కావేరి లింకు ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది.ఈ మళ్లించే 148 టీఎంసీల జలాల్లో తెలంగాణకు 43, ఏపీకి 44, తమిళనాడుకు 42.5, పుదుచ్చేరికి 2.5, కర్ణాటకకి 16 టీఎంసీలను పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నీళ్లన్నీ నువ్వే తీసుకుపోతే తెలంగాణ ఏం కావాలి. నేషనల్ ప్రాజెక్టు అంటున్నరు. మాకు నష్టం చేసేది నేషనల్ ప్రాజెక్టు ఎలా అవుతుంది? కాళేశ్వరం, పాలమూరు నేషనల్ ప్రాజెక్టు అడిగితే మాకు ఇవ్వలేదు.తెలంగాణకు ఒక్క నేషనల్ ప్రాజెక్టు వద్దా? కాంగ్రెస్ ప్రభుత్వం మేల్కోవాలి. రేవంత్ నోరు విప్పాలి. నిజమైన కాంగ్రెస్ నాయకులారా.. తెలంగాణ గడ్డకు పచ్చ కాంగ్రెస్ చేస్తున్న ద్రోహాన్ని ఇప్పటికైనా అడ్డుకోండి.ఇకనైనా బాబుకు చేసే బానిసత్వం మానుకోవాలనీ, తెలంగాణ హక్కులను కాపాడాలని డిమాండ్ చేస్తున్నాం.లేదంటే కాంగ్రెస్ పార్టీని కూకటివేళ్ళతో పెకలిస్తాం, బిజేపీకి బుద్ది చెబుతాం అని హెచ్చరిస్తున్నాం. సమావేశంలో మాజీ మంత్రులు గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





