– అమెరికా అధ్యక్షుడిపై కాల్పుల ఘటన
– భద్రతపై ఉలిక్కిపడేలా చేసిన వ్యక్తి
– నోట్ ద్వారా ప్లాన్ వెల్లడించిన నిందితుడు
వాషింగ్టన్, ఏప్రిల్ 27: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న శ్వేతసౌధం కరస్పాండెంట్స్ డిన్నర్‌లో కాల్పుల ఘటన నిందితుడు కోల్ టొమాస్ అలెన్ గురించి కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. అతడు ట్రంప్‌నకు వ్యతిరేకంగా దాడికి ముందే ఓ నోట్‌ను తయారు చేసి కుటుంబీకులకు పంపాడు. పిల్లలను లైంగికంగా వేధించే వ్యక్తి, రేపిస్ట్, ద్రోహి వంటి పదాలను ట్రంప్ గురించి అందులో వాడాడని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అలాంటి లక్షణాలున్న వ్యక్తిని ఏమాత్రం అంగీకరించను అని ఆ నోట్‌లో నిందితుడు రాసుకున్నాడు. అలాగే తాను ఎవరిని టార్గెట్ చేయాలనుకున్నాడో ఒక జాబితాను సిద్ధం చేసుకున్నాడు. తన జోలికి రానంతవరకు అతిథులు, ఇతర సిబ్బందిని, సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లపైనా కాల్పులు జరపనని పేర్కొన్నాడు. అలాగే హోటల్ భద్రత ఘోరంగా ఉందని, తాను భారీ రైఫిల్‌ను తెచ్చినా ఎవరూ గుర్తించేవారు కాదంటూ నిందితుడు వ్యాఖ్యానించాడు. ఈ ఘటన అనంతరం అధ్యక్షుడు మీడియాతో మాట్లాడుతూ నోట్‌లో ఉన్న ఆరోపణలను తోసిపుచ్చారు. నిందితుడు రాసుకున్నది మీ గురించే అని భావిస్తున్నారా అని ఓ విలేకరి ప్రశ్నకు ట్రంప్ స్పందించారు. అతడే దానిని రాసుకున్నాడు.. కానీ నేను రేపిస్ట్‌ను కాను.. ఏమాత్రం సంబంధం లేనివాటిని నాకు ముడిపెట్టారు.. నేను నిర్దోషిని అంటూ ప్రశ్నించిన రిపోర్టర్‌పై అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం నిందితుడి నోట్‌లోని అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ట్రంప్ యంత్రాంగంలోని అధికారులను లక్ష్యంగా చేసుకోవాలని అతడు ప్రయత్నించినట్లు వెల్లడవుతోందని అధికారులు పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.
