హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 25: దేశ వ్యవసాయ రంగం, ఆహార భద్రత, సుస్థిర అభివృద్ధి, గ్రామీణ జీవనోపాధి రంగాలలో అందించిన అత్యుత్తమ సేవలకు గుర్తింపుగా ‘ఎం.ఎస్. స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్’ (ఎంఎస్ఎస్ఆర్ఎఫ్) కు ‘డాక్టర్ వైఎస్. రాజశేఖర రెడ్డి అవార్డు – 2026’ కు ఎంపిక చేసినట్టు ‘డాక్టర్ వైఎస్ఆర్ అండ్ డాక్టర్ కేవీపీ ఫౌండేషన్ ట్రస్ట్’ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ అవార్డు కింద రూ. 25 లక్షల నగదు బహుమతిని అందజేయనున్నట్టు వెల్లడించింది. 2026 సెప్టెంబర్ 2న న్యూఢిల్లీలోని ‘కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా’లో నిర్వహించే కార్యక్రమంలో ఎంఎస్ఎస్ఆర్ఎఫ్ తరఫున ఆ సంస్థ ఛైర్‌పర్సన్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ ఈ అవార్డును స్వీకరిస్తారు. భారతరత్న, దివంగత డాక్టర్ ఎం.ఎస్. స్వామినాథన్మహోన్నత వారసత్వాన్ని ఎంఎస్ఎస్ఆర్ఎఫ్ కొనసాగిస్తోంది. ఆయన శాస్త్రీయ నాయకత్వం మన దేశ హరిత విప్లవంలో, దేశాన్ని ఆహార కొరత నుంచి ఆహార స్వయం సమృద్ధి దిశగా నడిపించడంలో చరిత్రాత్మక పాత్ర పోషించింది. దివంగత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ నాయకత్వంలో ఆమె రాజకీయ సంకల్పం, వ్యవసాయ రంగానికి అందించిన బలమైన మద్దతు, డాక్టర్ స్వామినాథన్ సైంటిఫిక్ విజన్, భారతీయ రైతుల కృషి కలిసి దేశ ఆహార భద్రతకు బలమైన పునాదులు వేశాయి.సుస్థిర వ్యవసాయం, ఆహార-పోషకాహార భద్రత, జీవవైవిధ్యం, గ్రామీణ జీవనోపాధి రంగాలలో విజ్ఞాన ఫలాలను రైతులకు, గ్రామీణ ప్రజలకు అందిస్తూ ఎంఎస్ఎస్ఆర్ఎఫ్ ఈ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర రెడ్డి ప్రజా సంక్షేమ ఆశయాలను, రైతుపక్షపాత ఆలోచనలను కొనసాగించేందుకు ‘డాక్టర్ వైఎస్ఆర్ అండ్ డాక్టర్ కేవీపీ ఫౌండేషన్’ స్థాపించబడింది. వైఎస్సార్ ప్రజా జీవితం నిరంతరం రైతులు, పేదలు, సామాన్య ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సాగింది. ఈ నేపథ్యంలో వ్యవసాయం, నీటిపారుదల, వైద్యం, విద్య వంటి రంగాలలో విశేష సేవలందించిన ప్రముఖ వ్యక్తులను, సంస్థలను సత్కరించడం, సమాజ పురోగతికి ఉపయోగపడే వ్యవసాయం తదితర కోర్సులలో ప్రతిభావంతులైన విద్యార్థులకు చేయూతనందించడం, సామాజిక సేవకు జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తులను ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యంగా ఈ ఫౌండేషన్ ముందుకు సాగుతున్నది. 2025లో ఈ ఫౌండేషన్ ప్రయాణం ప్రారంభమైంది. తొలి అవార్డును సుస్థిర, ప్రకృతి వ్యవసాయంలో విశేష కృషి చేసిన ‘సుభాష్ పాలేకర్ కృషి’ (ఎస్పీకే)కి ప్రధానం చేశారు. 2026లో ఫౌండేషన్ ‘ప్రొఫెసర్ జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రూ.21 లక్షలతో నిధిని (స్కాలర్షిప్ కార్పస్) ఏర్పాటు చేసింది. దీనిద్వారా ఏటా యూనివర్సిటీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థికి స్కాలర్‌షిప్ అందజేస్తారు. వీటితో పాటు సమాజ సంక్షేమానికి కట్టుబడి సేవ చేస్తున్న పలువురు వ్యక్తులకు, సామాజిక కార్యక్రమాలు చేపట్టే సంస్థలకు కూడా ఫౌండేషన్ మద్దతుగా నిలుస్తోంది. ట్రస్టీలుగా డాక్టర్ కేవీపీ రామచందర్ రావు(రాజ్యసభ మాజీ సభ్యుడు), డాక్టర్ జి.చిన్నారెడ్డి (వైస్ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా బోర్డు), డాక్టర్ ఎన్.రఘువీరారెడ్డి (సభ్యుడు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ – సీడబ్ల్యూసీ)లు వ్యవహరిస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




