– ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదం
హైౖ²దరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 25 : డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టిమ్స్‌లో డాక్టర్లు, సిబ్బంది నియామకాల కోసం నిమ్స్ సర్వీస్ రూల్స్‌ను అనుసరించడంతోపాటు, నిమ్స్‌లో అమలులో ఉన్న టారిఫ్‌లను టిమ్స్‌లో కూడా అమలు చేయడానికి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. నిమ్స్ టారిఫ్‌ల అమలు ద్వారా హాస్పిటల్ ప్రారంభ దశ నుంచే ఒక సమగ్రమైన టారిఫ్ విధానం అందుబాటులోకి రావడంతోపాటు, రాష్ట్రంలోని రెండు ప్రముఖ వైద్య సంస్థల మధ్య చార్జీల విధానంలో ఏకరూపత, మెరుగైన ఆర్థిక ప్రణాళికకు అవకాశం కలుగుతుందని ఈసీ అభిప్రాయపడింది. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్) ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తొలి సమావేశం ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధ్యక్షతన మంగళవారం జరిగింది. టిమ్స్‌కు ప్రతి రోజూ సగటున 600మంది అవుట్ పేషెంట్లు వస్తున్నారని, వారికి అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నామని డైరెక్టర్ డాక్టర్ నరేంద్ర కుమార్ మంత్రికి వివరించారు. అలాగే డే కేర్ ప్రొసీజర్లను కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హాస్పిటల్‌లోని ఐసీయూలు, ఆపరేషన్ థియేటర్లు, డయాగ్నస్టిక్స్ పరికరాలతోపాటు ఇతర కీలక వైద్య పరికరాలను పూర్తిస్థాయిలో స్టెరిలైజ్ చేయిస్తున్నామని, ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే సర్జరీలు ప్రారంభిస్తామని డాక్టర్ నరేంద్ర కుమార్ వివరించారు. టిమ్స్‌కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలను ట్రస్ట్ అండ్ రిటెన్షన్ అకౌంట్ ద్వారా నిర్వహించే విధంగా అవసరమైన బ్యాంకింగ్ సేవలను సమన్వయం చేయడానికి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. టిమ్స్‌లో రోగులు, వైద్యులు, సిబ్బందికి అవసరమైన మౌలిక వసతులను మరింత మెరుగుపరిచే పలు ప్రతిపాదనలకు కూడా కౌన్సిల్ ఆమోదం తెలిపింది. స్టాఫ్, పేషెంట్లకు పార్కింగ్ ఇబ్బందులు లేకుండా మల్టీ లెవల్ కార్ పార్కింగ్, రోగుల సహాయకుల కోసం అదనపు టాయిలెట్ కాంప్లెక్స్ నిర్మించే ప్రతిపాదనలకు ఈసీ ఆమోదం తెలిపింది. నిమ్స్ తరహాలోనే టిమ్స్‌లోనూ పీజీ కాలేజీని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఇందుకు అనుగుణంగా పీజీ విద్యార్థుల కోసం హాస్టళ్లు నిర్మించే ప్రతిపాదనకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టిమ్స్‌ను అత్యాధునిక వైద్య సేవలు అందించే సంస్థగా తీర్చిదిద్దడంతో పాటు ప్రజలకు నాణ్యమైన సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడం, వైద్య విద్య-పరిశోధనలను ప్రోత్సహించడం లక్ష్యంగా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని మంత్రి దామోదర్ తెలిపారు. సమావేశంలో ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్తు, టీజీఎంఎస్ఐడీసీ ఎండీ డాక్టర్ గౌరవ్ ఉప్పల్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ వాణి, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవీందర్ నాయక్, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




