– పల్లె పల్లెకు ప్రజాపాలన.. పల్లె పల్లెకు పొన్నం’
– గ్రామాల్లో పర్యటించిన మంత్రి పొన్నం
సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 25 : బీఆర్‌ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా అర్హులకు అందలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. సైదాపూర్ మండలంలోని పలు గ్రామాలలో ’పల్లె పల్లెకు ప్రజాపాలన.. పల్లె పల్లెకు పొన్నం’ కార్యక్రమంలో భాగంగా సర్వాయిపేట, పెరిక పల్లి, గొల్లగూడెం, ఆకునూరు, వెంకటేశ్వర్ల పల్లి గ్రామాలలో మంగళవారం పర్యటించారు. గ్రామాలలో నెలకొన్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే దిశగా ఈ కార్యక్రమం రూపొందించినట్లు తెలిపారు. ప్రజా పాలనలో రైతు సంక్షేమంతోపాటు, రాష్ట్రంలో అనేక వినూత్న పథకాలను అమలు చేస్తూ దేశంలోనే రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుంది అన్నారు. అర్హులకు ఇందిరమ్మ ఇండ్లతో పాటు, పేదలకు సన్న బియ్యం, రేషన్ కార్డుల పంపిణీ, రైతులకు రుణమాఫీ, రైతు భరోసా వంటి కార్యక్రమాలను చేపడుతూ కాంగ్రెస్ పార్టీ పేదల పక్షపాతంగా పనిచేస్తుందన్నారు.అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలుపై సమీక్షించి, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. అర్హులైన లబ్దిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. గ్రామంలో 8 ఇందిరమ్మ ఇళ్లు పూర్తవడం, రైతులకు రుణమాఫీ, రైతుభరోసా, రైతుబీమా, గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాల ద్వారా లబ్ది చేకూరడం జరిగింది. గ్రామంలో అంతర్గత సీసీ రోడ్లు, తాగునీరు, వాటర్ ప్లాంట్, పంచాయతీ భవనం తదితర సమస్యలను దశలవారీగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. జలసిరి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని, రైతులు ఆరుతడి పంటలు, ఆయిల్‌పామ్ సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. గొల్లగూడెం గ్రామాభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచులు స్వరూప, బాబిత, మౌనిక, స్వతంత్ర, చంద్రయ్య, మండల డివిజన్ జిల్లా స్థాయి అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




