– స్పా సెంటర్‌లో భార్యను హత్య చేసిన భర్త
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 19 : గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కవాడిగూడలో కట్టుకున్న భార్యను భర్త అతి కిరాతకంగా చంపేశాడు. గొడవ పడి స్పా సెంటర్‌కు వచ్చిన భార్యపై భర్త కత్తితో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. బంగి దేబోరా, ఆమె భర్త బహదూర్‌పూర్ కిషన్‌బాగ్‌లో నివసిస్తున్నారు. కవాడిగూడలోని స్పా సెంటర్‌లో మృతురాలు బ్యూటీషియన్‌గా పనిచేస్తోంది. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం కూడా భర్తతో గొడవపడిన దేబోరా విధుల కోసం స్పా సెంటర్‌కు వెళ్లింది. ఆగ్రహానికి గురైన భర్త కవాడిగూడ రత్నదీప్ బిల్డింగ్‌లోని నాలుగో అంతస్తులో ఉన్న స్పా సెంటర్‌కు వెళ్లాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో భార్యపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. హత్య అనంతరం నిందితుడు అక్కడినుంచి పరారయ్యాడు. ఆపై అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఘటనా స్థలికి చేరుకుని పోలీసులు బంగి దేబోరా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

