భూబకాసురులు ప్రజలా? ప్రభుత్వమా?

ఖమ్మంలో ఒక సభలో మాట్లాడుతూ కేటీఆర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం కోటి ఎకరాల భూమిని తెలంగాణలో నిషేధ జాబితాలో పెట్టిందని చెప్పారు. ఇంత విస్తృతమైన భూమి చట్టప్రకారం సాక్షాత్తు ప్రభుత్వం నియమించిన రిజిస్ట్రేషన్ శాఖ ఆమోదంతో కొన్ని లక్షలమంది కొనుక్కొని వారి పేరున చేసుకున్నారు. చాలామంది దశాబ్దాలుగా వారి కోర్కెలన్నీ ఎంచుకొని వారి పిల్లల భవిష్యత్తు కోసం రక్తాన్ని చెమటగా మార్చి సంపాదించిన డబ్బుతోనే ఈ భూములు కొనుక్కున్నారు. ఒక్క పెన్నుపోటుతో ఇవన్నీ వారివి కావని అవి ప్రభుత్వానివని నిషేధ జాబితాలో చేర్చి కొన్ని లక్షల కుటుంబాల ఆశలను మంట్లో కలిపారు. సాక్షాత్తు హైకోర్టు జస్టిస్ భూములే ఆమెవి కావని ఫర్మాన జారీ చేసేసారు. ఎంతోమందికి తీర్పులు చెప్పినా ఆమె ఇప్పుడు కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితికి తీసుకువచ్చింది ఈ ప్రభుత్వం.

ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉందో ఉంటుందో ఊహించుకోవచ్చు. ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు ఎన్నికైన నియోజకవర్గాలలో కాంగ్రెస్ నాయకులను ఎన్నుకోనందుకు సామాన్య ప్రజల భూములన్నీ ,ప్లాట్ లన్ని నిషేధ జాబితాలో పెట్టి రిజిస్ట్రేషన్ చేయకుండా వారికి చుక్కలు చూపిస్తున్నారు. ఇలా భూములు ఎలాంటి నోటీసులు లేకుండా ప్రభుత్వ పరం చేసుకోవడం వల్ల బాధితులైన వాళ్ళు 5000 పైగా కోర్టులో ప్రభుత్వంపై కేసులు వేశారని హైకోర్టు చెప్పింది.‌ ఇంతమందిని ఘోష పెట్టి ప్రభుత్వం భూ సంస్కరణలు చేస్తున్నాము అని చెప్పుకోవడం సిగ్గుచేటు. హిట్లర్ ఆదర్శంగా సృష్టించిన హైడ్రా లెక్కలేనంతమంది బీదవాళ్ళ భూములు గుంజుకొని వాళ్లను నిరాశ్రయలను చేసింది.

ఎల్ఆర్ఎస్ కింద లక్షల మంది దగ్గర డబ్బులు పుచ్చుకొని రెగ్యులరైజేషన్ చేయడమే లేదు. రెండు వేల నుండి లక్షల వరకు బీదా మధ్యతరగతి కుటుంబాల వారి దగ్గర ఎల్ఆర్ఎస్ వసూలు చేసి సంవత్సరాలు దాటినా కూడా వారికి ఇంతవరకు రెగ్యులరైజేషన్ ప్రొసీడింగ్ ఇవ్వడం లేదు. కొందరకి ఎల్ఆర్ఎస్ నోటీసులు పంపించి వాటిని పరిష్కరించడం లేదు. ఇచ్చిన ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్స్ లో కింద పేర్కొనబడిన నిబంధనలు చూస్తే అసలు ఎల్ఆర్ఎస్ ఎందుకు పెట్టారో అర్థం కాదు. ఆ నిబంధనల ప్రకారం ఎల్ఆర్ఎస్ ఎప్పుడైనా మళ్లీ ప్రభుత్వం పునసమీక్షించవచ్చని అప్పుడు మళ్లీ తిరిగి భూములు స్వాధీనం చేసుకోవచ్చని కూడా ఉంది. మరి ఇంత దానికి ఎల్ఆర్ఎస్ ప్రహసనం ప్రజల జీవితాలతో ఆడుకోవడమే అవుతుంది.

తాను పెట్టడు అడుక్కొనివ్వడు అన్న చందంగా హైదరాబాదులో కొన్ని వేలమంది దశాబ్దాలుగా రోడ్ల పక్కన చిన్న చిన్న డబ్బాలు పెట్టుకొని బిజినెస్ చేస్తూ కుటుంబాల్ని పోషించుకుంటూ ఉన్న వాళ్ళని రోడ్డు వెడల్పు అని చెట్లు నాటాలని కూడా హైడ్రా ఆధ్వర్యంలో వాటిని పీకి వేశారు. అంతమందికి ప్రత్యామ్నాయం చూపెట్టారా అంటే అది లేదు. మూసీ ప్రక్షాళన పేరిట కూడా ఎంతోమంది ఇండ్లు కూల్చి వేశారు. వారికి ఎక్కడో చాలా దూరంలో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారట. కానీ వారికి ఉపాధి ఉన్నచోట ప్రభుత్వ భూములు ఎన్నో ఉన్నాయి. వాటి విలువ ఎక్కువ. కానీ అక్కడ మాత్రం వీరికి ఇల్లు కట్టి ఇవ్వడం ప్రభుత్వానికి ఇష్టం లేదు. ఎందుకంటే అవి చాలా విలువైన భూములు. అవి ఎప్పుడో ఒకప్పుడు అస్మదీయులకు కట్టబెట్టడం లేక అమ్మి పంచుకోవడమో పంచి పెట్టడమో జరుగుతుంది.

హైదరాబాద్ లో ఎన్నో చెట్లతోని కూడుకొని ఉన్న రెండు పార్కుల మధ్య ఉన్న రోడ్డుపై చెట్ల కోసం 20 మంది చిన్న వ్యాపారస్తుల ఠేలాలు కూల్చి వారికి బతుకుతెరువు లేకుండా చేశారు.‌ ఇక భూభారతి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ప్రతిరోజు పేపర్లలో భూభారతి బాధితుల కథలు చర్విత చరణంగా వస్తూనే ఉన్నాయి.ఇంతమంది ప్రజల కష్టార్జితమైన భూములు గుంజుకుని, లెక్కలేనంతమంది స్వయం ఉపాధి వసతుల ధ్వంసం చేసి మేము రాష్ట్రాన్ని ట్రిలియన్ డాలర్ ఎకానమీ చేస్తామనడం హాస్యాస్పదం. ప్రజల ఆస్తుల గురించి కొన్ని ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ చేస్తే ఆ డాలర్స్ ఎవరికోసమో? ఏషియన్ గేమ్స్ గురించి బుల్డోజర్ తో వేలమంది బీద వాళ్ళ గుడిసెలు కూల్చిన సంజయ్ గాంధీ వారసులే కదా.

హైడ్రా 2435 ఎకరాలను ఆక్రమణల నుండి కాపాడము అని చెబుతున్నారు. అది హైదరాబాదులో. ఇప్పటికే భూములు కొంత అమ్మేశారు. మరి నిజంగా అంత భూమి కాపాడి ఉంటే , 100 కోట్ల సగటున విలువ చేసే ఆ భూమిలో 1000 ఎకరాలు అమ్మిన లక్ష కోట్లు వస్తాయి. అందులో ఒక 400 ఎకరాల్లో అదే డబ్బుతో వెయ్యి చదరపు అడుగులలో ఫ్లాట్స్ కట్టిస్తే ఆరు లక్షల ఇండ్లవుతాయి. రేవంత్ రెడ్డి గారు ఆరుట్లలో ప్రమాణాలు చేసినట్టుగా ఓ ఆర్ ఆర్ లోపట నిర్వాసితులందరికీ ఇండ్లు లేని వారికి ఆ ఇండ్లను కేటాయించవచ్చు. ఈ ప్రభుత్వం ఆ పని చేయగలదా ?. ఆక్రమణ నుండి విడిపించిన భూములు సగానికి పైన రాష్ట్ర ప్రజలు కష్టపడి కొనుక్కున్నవి. వాటిని అమ్మాలి అంటే ఎన్నో కోర్టు కేసులు పరిష్కరించబడాలి. ఇప్పటికే హైడ్రా అధికారులకు కోర్టులు మొట్టికాయలు ఎన్నోసార్లు వేసాయి. ఈ భూ సంబంధిత విధానాల వల్ల ప్రజలకు ముఖ్యంగా బీద మధ్యతరగతి ప్రజలకు అన్యాయం చేయడం తప్పితే ఏమీ ప్రయోజనం కనబడటం లేదు.

-డాక్టర్ ఎం హెచ్ ప్రసాద్ రావు మొబైల్ : 9963913078

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *