“చాటుమాటు రాజకీయాలకు ఇప్పుడు తమిళ రాజకీయ క్షేత్రం అగ్రపీఠం లో నిలబడింది.అంతా క్లియర్ అయినట్లు కనిపించి, అంతలోనే మళ్ళీ అయోమయం,గందరగోళం. ఉన్న సంక్షోభం స్థితి ని అడ్డం పెట్టుకొని ఆడుతున్న అవకాశవాదం రాజకీయ క్రీడలు అపహాస్యం,అసహ్యం వేసేలా ఉంది.గత యాభై ఏళ్లుగా అధికారం అనుభవించి, బద్ద శత్రువుల్లా ఎన్నికల్లో తలపడిన ద్రవిడ పార్టీలైన డియంకే,ఏడియంకేలు అటు కేంద్రంలో బిజెపి ధృతరాష్ట్ర కౌగిలి లో పరోక్షంగా చిక్కి అందని అధికారం కోసం ఆడిన రాజకీయ నాటకం రక్తి కట్టిందనే చెప్పవచ్చును..”
ఎన్నికల ఫలితాలు వెల్లడైన గత వారం రోజులుగా తమిళ నాట ప్రభుత్వం ఏర్పాటులో జరుగుతున్న డ్రామాలు దిగజారిన రాజకీయ విలువలకు నిలువుటెత్తు అద్దంలా కనిపిస్తున్నాయి.ఆ మాటకొస్తే కేంద్రం తో సహా,ఏ రాష్ట్ర రాజకీయాలు అందుకు భిన్నంగా లేవు.. కాస్తో, కూస్తో సైద్ధాంతిక రాజకీయాలు ఉన్న తమిళనాట పరిస్థితి కూడా ఇప్పుడు అక్కడకే వచ్చింది. విలువలు,వలువలు జాన్తానై ఎవడి రాజకీయ స్వార్థం,లబ్ది వాళ్ళు వెతుక్కుంటున్నారు .తమిళ ప్రభుత్వం ఏర్పాటు లో చిక్కుముడి విప్పాలసిన గవర్నర్ కాస్తా మరిన్ని పీఠముడులు వేసి సమస్యను జటిలం చేస్తున్నారు. ఒకే ఒక్క అసెంబ్లీ స్థానం గెలిచిన బిజేపి గవర్నర్ అనబడే తోలుబొమ్మ ఆధారాలు పట్టుకొని సుతారంగా తన చేతివేళ్ళ మీద తిప్పుతూ ,ఆడిస్తూ తన రాజకీయ భవిష్యత్తు,అనుకూలతలు మార్గాలు నిర్మించుకుంటుంది .
ఇప్పుడు తమిళ రాజకీయాల్లో అవకాశవాదం మునుపెన్నడూ లేనంతగా ఆకాశమంత ఎత్తు ఎదిగి ఆశ్చర్యం కలిగిస్తుంది! ద్రావిడ రాజకీయ అవకాశవాదం తో విసిగి వేసారిన తమిళ ప్రజలు విజయ్ లాంటి కొత్త యువకుడికి జై కొట్టినా,తమను తిరస్కరించినా అధికార పీఠాలు చుట్టే అరవ రాజకీయ పక్షాల ఆత్మలు ప్రదక్షిణ చేస్తున్నాయి. అంతకు మించి కూలిపోతున్న తమ రాజకీయ వారసత్వ సాంప్రదాయ పాత కోటలు ప్రధానంగా ద్రావిడ పార్టీ లైన డీఎంకే,ఏడియంకే లకు మింగుడు పడడం లేదు. కాంగ్రెస్, వామపక్షాలు ఒకింత స్పష్టమైన సైద్ధాంతిక నిర్ణయం ప్రకటించినప్పటికీ విసికే,ఐయుయంయల్ లాంటి చిన్న ,చితక పార్టీల అస్థిరమైన మద్దతు ఇంకా ప్రభుత్వం ఏర్పాటు కు సాచివేతకు ,గవర్నర్ క్రీడకు అవకాశం ఇస్తుంది. రెండు స్థానాలు ఉన్న విసికే పార్టీ తమ మద్దతు కీలకం కావడంతో విజయ్ కున్న రాజకీయ అనుభవం లేమిని ఆసరాగా చేసుకుని సందట్లో సడేమియాలా ఒత్తిడి ఆట ఆడుతుంది.( ఈ వ్యాసం రాసే సమయానికి ) తొలుత విజయ్ ఖాలీ చేసే సీటు, మంత్రిపదవి డిమాండ్ చేసిన ఆపార్టీ,తాజాగా ఉపముఖ్యమంత్రి ఇవ్వాలనే డిమాండ్ ను ముందుకు తేవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.ఇక మరోసంస్థ ఐయు యంయల్ బిజెపి వ్యతిరేక రాజకీయాలు ఉండి కూడా విజయ్ కు మద్దతు ఇవ్వడంలో ఊగిసలాడుతుంది. ఈ ఊగిసలాటవెనుక ద్రవిడ రాజకీయ పక్షాలు అదృశ్య హస్తం ఉంటుంది.
చాటుమాటు రాజకీయాలకు ఇప్పుడు తమిళ రాజకీయ క్షేత్రం అగ్రపీఠం లో నిలబడింది.అంతా క్లియర్ అయినట్లు కనిపించి, అంతలోనే మళ్ళీ అయోమయం,గందరగోళం. ఉన్న సంక్షోభం స్థితి ని అడ్డం పెట్టుకొని ఆడుతున్న అవకాశవాదం రాజకీయ క్రీడలు అపహాస్యం,అసహ్యం వేసేలా ఉంది.గత యాభై ఏళ్లుగా అధికారం అనుభవించి, బద్ద శత్రువుల్లా ఎన్నికల్లో తలపడిన ద్రవిడ పార్టీలైన డియంకే,ఏడియంకేలు అటు కేంద్రంలో బిజెపి ధృతరాష్ట్ర కౌగిలి లో పరోక్షంగా చిక్కి అందని అధికారం కోసం ఆడిన రాజకీయ నాటకం రక్తి కట్టిందనే చెప్పవచ్చును.. మీడియా,సోషల్ మీడియా సైతం జర్నలిజం విలువలు దాటి అసలు సమస్యను పక్కదారి పట్టించేలా ఎవరి తెరవెనుక రాజకీయ దండకాలు వారు చదువుతున్నారు. .ఒకవైపు అధికార సంక్షోభం ప్రధాన సమస్య గా ఉంటే విజయ్ ఖాలీ చేసిన స్థానంలో త్రిష పోటీ గురించి,ఆమె ఉపముఖ్యమంత్రి స్థానం గురించి మాట్లాడుతున్నారు. మరికొందరు గవర్నర్ పాత్రను వదిలేసి డియంకే,ఏడియంకే అవకాశవాదం కలయికను రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరుగవచ్చును అనే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.మరికొందరు విజయ్ ఆస్తులు గురించి,అనర్హత గురించి స్టోరీలు మొదలెట్టారు. మరికొందరు అసలు మరచి కొసరు ఆయన వ్యక్తిగత ఫైనాన్షియల్ స్టేటస్ గురించి మాట్లాడుతున్నారు. మీడియా వక్రబుద్ది ప్రదర్శన తో పాటు,ఎవడి డబ్బా వాడు వాయించే మీడియా విదూషక పాత్ర చూస్తే ఒకింత ఆశ్చర్యం కలుగుతుంది.
తమిళ రాజకీయాల్లో అర్థ శతాబ్ద కాలం అధికారం వెలుగ బెట్టిన డీఎంకే,ఏడియంకే లపై ముఖం మెత్తి మాత్రమే తమిళ ప్రజలు కేవలం 14 మాసాల క్రితం పార్టీ పెట్టిన సినీ నటుడు విజయ్ ను సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అందలం ఎక్కించారు.డజన్ల కొలది పార్టీలతో,అధికారాలతో అంటకాగిన సాంప్రదాయిక ద్రావిడ పార్టీలను ప్రజలు స్పష్టంగా తిరస్కరించారు. అయినా మా ఆట చూడమని ఈ రెండు పార్టీలు ఇంకా అధికారం కోసం కేంద్రంలో అధికారంలో ఉన్న, తమిళ ప్రజలు చేత నిర్ద్వందంగా తిరష్కరణకు గురైన బిజెపి ని నమ్ముకొని ఆడుతున్న అవకాశవాదం రాజకీయ క్రీడ రేపు ఆ పార్టీల ఉనికికే ప్రశ్నార్థకం అన్న విషయం గమనించడం లేదు. ఏడియంకే తనకున్న 49 సీట్లతో అధికార పీఠం ఎక్కాలని తహతహ లాడుతుండగా, సైద్ధాంతికంగా బలమైన డియంకే 57 సీట్లతో ప్రదాన ప్రతిపక్షం గా వ్యవహరించాల్సి ఉంది.ఇంకా విచక్షణ పాటిస్తే తమ భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, సిపిఐ,సిపియం మాదిరిగా ప్రజలు తీర్పును గౌరవించాల్సిన అవసరం ఉంది.కానీ, మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ తమ వారసుడైన ఉదయనిధి రాజకీయ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని విజయ్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కకుండా చాటుమాటు రాజకీయ క్రీడలకు తెరలేపారు.
కరుడుకట్టి ద్రవిడ రాజకీయ అధికార పీఠానికి అతుక్కు పోతున్న డీఎంకే,ఏడియంకే సాంప్రదాయ రాజకీయాల తిరస్కరణే మోన్నటి తమిళ ప్రజలు ఇచ్చిన తీర్పు.కాకుంటే సింగిల్ గా సింహంలా తమిళ రాజకీయాల్లో ప్రవేశించిన విజయ్ కు రాజకీయ గుంట నక్క ఎత్తులు,జిత్తులు ఇంకా వంట పట్టలేదు.ఒకవేళ వంట పట్టి ఉంటే సింగిల్ పార్టీ మెజారిటీ కాకుండా మరికొన్ని శక్తులను పోగేసుకొని పూర్తి మెజారిటీ సాధించే వాడే!? బిజెపి కూడా తమిళ నాడు లో ఏడియంకే తో పొత్తు పెట్టుకొని చంద్రబాబు లాంటి వారితో ప్రచారం చేయించినా చావుతప్పి కన్నులొట్ట పోయి ఒకే ఒక్క స్థానంలోకి పడిపోయింది.ఇక తాను ప్రత్యక్షంగా చేయగలిగింది ఏమీలేదు , కేంద్రం లో అధికారం లో ఉన్న బిజెపి కి తమిళ తంబిలైన డియంకే,ఏడియంకే పార్టీలు పార్లమెంట్ స్థానాలతో అవసరం ఉంది. రేపు పంతం పట్టి వీగిన మహిళా బిల్లు,డిలిమిటేషన్ బిల్లు యథాతథం ఆమోదం కు తంబీల మద్దతు చాలా విలువైనది.బిజెపి “తివిరితైలంబు తీయవచ్చు”నన్న సామెత ననుసరించి ఎంతటి చిన్న రాజకీయ అవకాశం నైనా పెద్ద ప్రయోజనం గా మార్చుకోగలిగే నైపుణ్యం “మోషా”లకే సాధ్యం.కనుక ప్రస్తుతం తమిళ నాడు ఇన్చార్జి గవర్నర్ నిర్ణయం డియంకే,ఏడియంకే లో అపవిత్ర రాజకీయ పోత్తులకు పొద్దుపోడుస్తోంది.
ఏడియంకే అధికారం కోసం ఏగడ్డినైనా కరవడానికి సిద్దం అని జయలలిత మరణం నుండి ఆపార్టీ గ్రూపు రాజకీయాలు ద్వారా స్పష్టం అయ్యింది.తాజాగా నిన్నటి దాకా హుందాగా ఉండి గవర్నర్ సైంధవ పాత్రను సుప్రీంకోర్టు వరకు వెళ్ళి పోరాడిన స్టాలిన్ వైఖరి కూడా కుటుంబ రాజకీయ ప్రయోజనాల కోసం అవకాశవాద రాజకీయ ఊబిలో కూరుకు పోతున్నట్లు కనిపిస్తుంది.ఒకవైపు సింగిల్ లార్జెస్ట్ పార్టీ గా విజయ్ కు అవకాశం కల్పించాలని పైపై పొడి మాటలు మాట్లాడుతూనే ఏడియంకే తో మంతనాలు జరుపుతున్నారు.తెరవెనుక ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు .ఆయనకు బాగా అర్థం అయిన విషయం ఏమంటే విజయ్ ఒక్కసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కితే తన కుమారుడు ఉదయనిధి రాజకీయ భవిష్యత్తు అంధకారంలో పడుతుంది.అందుకే ఆయన లోపల ,బయట మనిషిగా రెండు రకాలు గా వ్యవహరిస్తున్నారు. మిత్రపక్షాలైన కాంగ్రెస్, వామపక్షాలు,ఐయుయంయల్ పార్టీలు విజయ్ కు మద్దతు ఇవ్వడం ఆయన జీర్ణించుకోలేక పోతున్నారు.అంతేకాదు,ఎన్నో ఏళ్ళుగా కేంద్ర రాజకీయాల్లో కాంగ్రెస్ తో కొనసాగుతున్న డీఎంకే ఆకస్మికంగా పార్లమెంటులో తమ సీట్లు కూడా ఇండియా కూటమి వరుస నుంచి మార్చాలని పార్లమెంటు స్పీకర్ కు లేఖ సైతం రాశారు.బిజెపి ఆశించిన పరిణామాలు కూడా ఇవే!
కానీ, ఓ పద్దతి, సైద్ధాంతిక ఆచరణ ఉందనుకున్న డీఎంకే పార్టీ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పుంజుకునే అవకాశం ఉన్నప్పటికీ,ఇంకా ఉదయనిధి స్టాలిన్ లాంటి వారికి ప్రత్యక్ష ప్రతిపక్ష ప్రతినిధి గా ఎదిగే అవకాశం పుష్కలంగా ఉన్నప్పటికీ, చిరకాల ప్రత్యర్థి ఏడియంకే, నిన్నటిదాకా పాలనా అడ్డంకులు సృష్టించిన బిజెపి ని నమ్ముకొని ప్రజలు తీర్పుకు విరుద్ధంగా రాజకీయ డ్రామాలు ద్రావిడ ప్రజల్లో రేపు అసహనానికి, అసంతృప్తి కి గురై పతనం అంచులకు చేరినా ఆశ్చర్య పోలేము .ఒక్క సారి పాకుడు బండపై కాలిడిన ఏ రాజకీయ పార్టీ అయినా ఎక్కడిదాకా నైనా జారిపోయో అవకాశం ఉంది.
ప్రజలు మార్పును,యువ నాయకత్వాన్ని ఇప్పుడు కోరుకుంటున్నారు.ప్రజలతీర్పు ప్రకారం సినీనటుడు విజయ్ కు అవకాశం ఇస్తే పర్వాలేదు.తేడా వచ్చి తరతరాల పేరుకు పోయిన రాజకీయ ఆహంతో , అదికార మందంతో వ్యవహరిస్తే!ప్రజలు ఆగ్రహం ముందు ద్రావిడ పార్టీల చరిత్ర కూడా చిన్నబోయో అవకాశం ఉంది.రాజకీయ పరిణామాలు ఎటుదారితీసినా విజయ్ కు జరిగే నష్టం పెద్దగా ఏమీ ఉండదు.సుడిగాలిలా,సునామీలా ముంచుకొస్తున్న సానుభూతి, సాహానుభూతి రేపు ఆయనను తమిళ రాజకీయ ముఖ చిత్రం పై తిరుగులేకుండా నిలబెడుతుంది. చరిత్ర గమనం ఏదైనా పాత్రను తుడిచేసి వర్తమానం కు బాటలు పరచడమే! తమిళ రాజకీయ యవనిక సైతం అలాంటి మార్పు సంకేతంగానే నిలువనుంది.హేతువు నుండి పుట్టిన తమిళ రాజకీయాలు అవకాశవాదం ,అస్థిరత , రాజకీయ అజ్ఞానం నుండి బయటపడి నైతిక, సాంఘిక, సామాజిక మార్పులు దిశగా కొనసాగాలని ఆశిద్దాం.