“రోజుకు కనీసం 30 నిమిషాలు పుస్తకాలు చదవడం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుంది. రోజులో కొన్ని గంటలు మొబైల్‌కు దూరంగా ఉండాలి. వ్యాయామం, యోగా ద్వారా మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. పాజిటివ్ పుస్తకాలు చదవడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గ్రంథాలయ సందర్శన నిశ్శబ్ద వాతావరణంలో చదవడం ద్వారా ఏకాగ్రత పెరుగుతుంది.”
- చదివే సమాజమే ముందుకు సాగుతుంది
- (ఏప్రిల్ 23 అంతర్జాతీయ పుస్తక మరియు కాపీరైట్ దినోత్సవం )
- “పుస్తకమే భవిష్యత్తుకు మార్గం – చదువు సంస్కృతికి పునాది”

లైబ్రేరియన్ ,
కిట్స్ , వరంగల్.
మొబైల్ : 9849375829
ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 23ను అంతర్జాతీయ పుస్తక మరియు కాపీరైట్ దినోత్సవంగా జరుపుకుంటారు. పుస్తక పఠనాన్ని ప్రోత్సహించడం, రచయితల కృషిని గౌరవించడం, కాపీరైట్ హక్కుల ప్రాముఖ్యత తెలియజేయడం ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశ్యం. ఈ దినోత్సవాన్ని 1995లో యునెస్కో ప్రకటించింది. ఈ తేదీ ప్రపంచ సాహిత్య చరిత్రలో విశేష ప్రాధాన్యత కలిగి ఉంది. ప్రముఖ రచయితలు విలియం షేక్స్పియర్ , మిగెల్ డి సెర్వాంటెస్, మరియుఇన్కా గార్సిలాసో డి లా వేగా ఈ రోజుతో అనుబంధం కలిగి ఉన్నారు. వారి సాహిత్య సేవలకు గౌరవార్థం ఈ రోజును పుస్తక దినోత్సవం గా నిర్ణయించారు.
పుస్తకాలు మనిషి జీవితాన్ని మారుస్తాయి. అవి కేవలం అక్షరాల సమాహారం కాదు; అనుభవాల భాండాగారం. పుస్తకాల ద్వారా మనం చరిత్రను, విజ్ఞానాన్ని, సంస్కృతిని తెలుసుకుంటాము. ఒక మంచి పుస్తకం మనలో ఆలోచనా శక్తిని పెంపొందిస్తుంది. పఠనం ద్వారా మనిషి వ్యక్తిత్వం వికసిస్తుంది. పుస్తకాలు సమాజ అభివృద్ధికి పునాది రాయి వంటివి. ఈ దినోత్సవంలో మరో ముఖ్య అంశం కాపీరైట్ హక్కులు. రచయితలు, కళాకారులు తమ సృజనాత్మక రచనలపై కలిగే చట్టపరమైన హక్కులే కాపీరైట్. ఈ హక్కుల వల్ల రచయితల కృషి రక్షించబడుతుంది. అనుమతి లేకుండా వారి రచనలను ఉపయోగించకుండా నిరోధిస్తుంది. ఇది సృజనాత్మకతను ప్రోత్సహిస్తుంది.
పుస్తకం ఒక సాధారణ కాగితాల సమాహారం కాదు. అది అనుభవాల నిల్వ. పుస్తకం ద్వారా మనిషి ప్రపంచాన్ని అర్థం చేసుకుంటాడు. పుస్తకాలు మనలో ఆలోచనా శక్తిని పెంపొందిస్తాయి, సమాజాన్ని మెరుగుపరచే విలువలను నేర్పిస్తాయి. ఒక మంచి పుస్తకం మనసును మేల్కొలిపి కొత్త ఆలోచనలకు మార్గం చూపుతుంది. పుస్తక పఠనం ద్వారా మనిషి వ్యక్తిత్వం వికసిస్తుంది. విజ్ఞాన శాస్త్రం, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి – అన్ని రంగాల అభివృద్ధికి పుస్తకాలు కీలక పాత్ర పోషించాయి. ఇప్పటి డిజిటల్ ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్‌లు, సోషల్ మీడియా, ఆన్‌లైన్ వినోదం మన జీవితాల్లో కీలక భాగమయ్యాయి. సమాచారాన్ని పొందడం సులభమైనప్పటికీ, అదే సమయంలో యువతలో ఏకాగ్రత తగ్గడం, ఒత్తిడి పెరగడం, డిజిటల్ డిప్రెషన్ వంటి సమస్యలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పుస్తక పఠనం మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది.
పుస్తక పఠనం మనిషి ఆలోచనా విధానాన్ని లోతుగా మార్చే శక్తి కలిగినది. మొబైల్‌లో వచ్చే చిన్న చిన్న సమాచారం కంటే పుస్తకాలు విశ్లేషణాత్మక జ్ఞానాన్ని అందిస్తాయి. పుస్తకాలు చదివే అలవాటు ఉన్నవారిలో ఏకాగ్రత పెరుగుతుంది, ఆలోచనా లోతు పెరుగుతుంది, ఒత్తిడి తగ్గుతుంది,సృజనాత్మకత అభివృద్ధి చెందుతుంది. డిజిటల్ పరికరాల వల్ల వచ్చే సమస్యలను తగ్గించేందుకు పుస్తకం ఒక ఉత్తమ ప్రత్యామ్నాయం.
గ్రంథాలయాలు సమాజంలో జ్ఞాన కేంద్రాలుగా నిలుస్తున్నాయి. ఇవి కేవలం పుస్తకాల నిల్వ గదులు కాదు; అవి అభ్యాసం, పరిశోధన, ఆలోచనల అభివృద్ధికి వేదికలు. ఈ రోజుల్లో గ్రంథాలయాలు డిజిటల్ వనరులతో కూడి మరింత విస్తృతంగా సేవలందిస్తున్నాయి. ఈ-బుక్స్, ఆన్‌లైన్ జర్నల్స్ , డిజిటల్ డేటాబేస్‌లు , చదువు గదులు, నిశ్శబ్ద వాతావరణం, గ్రంథాలయాలు యువతలో పఠన అలవాటు పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
లైబ్రేరియన్ల పాత్ర – మార్గనిర్దేశకులు: లైబ్రేరియన్లు కేవలం పుస్తకాలను అందించే వ్యక్తులు కాదు; వారు జ్ఞాన మార్గదర్శకులు. సరైన సమాచారాన్ని అందించడం , పాఠకులను సరైన పుస్తకాల వైపు దారితీస్తారు, డిజిటల్ వనరుల వినియోగంపై మార్గనిర్దేశం చేస్తారు, పఠన సంస్కృతిని ప్రోత్సహిస్తారు . నేటి కాలంలో లైబ్రేరియన్ ఒక సమాచార నిపుణుడిగా మారి సమాజానికి సేవలందిస్తున్నారు. డిజిటల్ డిప్రెషన్ – యువతలో పెరుగుతున్న సమస్య: స్మార్ట్‌ఫోన్‌ల అధిక వినియోగం, సోషల్ మీడియా ఒత్తిడి, పోలికల సంస్కృతి వల్ల యువతలో డిజిటల్ డిప్రెషన్ పెరుగుతోంది. దీని లక్షణాలు: ఒంటరితనం భావన, ఆందోళన, ఒత్తిడి , నిద్రలేమి , ఏకాగ్రత లోపం . ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో తీవ్రమైన మానసిక సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది.
డిజిటల్ డిప్రెషన్‌ను ఎలా అధిగమించాలి?
రోజుకు కనీసం 30 నిమిషాలు పుస్తకాలు చదవడం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుంది. రోజులో కొన్ని గంటలు మొబైల్‌కు దూరంగా ఉండాలి. వ్యాయామం, యోగా ద్వారా మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. పాజిటివ్ పుస్తకాలు చదవడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గ్రంథాలయ సందర్శన నిశ్శబ్ద వాతావరణంలో చదవడం ద్వారా ఏకాగ్రత పెరుగుతుంది. డిజిటల్ యుగంలో పుస్తక పఠనం మరింత అవసరం. ఇది కేవలం జ్ఞానాన్ని మాత్రమే కాదు, మనసుకు ప్రశాంతతను కూడా ఇస్తుంది. గ్రంథాలయాలు, లైబ్రేరియన్లు ఈ దిశగా మార్గనిర్దేశకులుగా నిలుస్తున్నారు. యువత పుస్తకాలను మిత్రులుగా చేసుకుని, డిజిటల్ ప్రపంచాన్ని సమతుల్యంగా వినియోగిస్తేనే ఆరోగ్యకరమైన భవిష్యత్తు సాధ్యమవుతుంది.
అంతర్జాతీయ పుస్తక మరియు కాపీరైట్ దినోత్సవం మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని అందిస్తుంది — ప్రతి రోజూ కొంత సమయం పుస్తక పఠనానికి కేటాయించాలి. పుస్తకం మనకు స్నేహితుడు, గురువు, మార్గదర్శి. పఠనం అలవాటుగా మారితే వ్యక్తిత్వ వికాసం, జ్ఞానాభివృద్ధి సులభమవుతుంది. పుస్తకాలు కేవలం చదవడానికి మాత్రమే కాదు; అవి ఒక తరాన్ని మరో తరానికి అనుసంధానించే వంతెనగా నిలుస్తాయి. పుస్తకాల ద్వారా మనం కొత్త ప్రపంచాలను, కొత్త ఆలోచనలను తెలుసుకుంటాము. పుస్తకాలు మనలో విజ్ఞానం పెంచడమే కాకుండా, సంస్కృతి, విలువలను కూడా అందిస్తాయి. పుస్తకాలు సమాజ అభివృద్ధికి ప్రధాన ఆధారంగా నిలుస్తాయని యునెస్కో పేర్కొంటుంది.
పుస్తకాలు లేని ఇల్లు కిటికీలు లేని గది వంటిది అని నమ్మిన అంబేడ్కర్ వ్యక్తిగత గ్రంథాలయంలో 50 వేలకు పైగా పుస్తకాలు ఉండేవి, లండన్ మ్యూజియం లో గంటల తరబడి చదువుతూ లైబ్రరీ మూసివేసే వరకు అక్కడే గడిపే వారట, సంపాదనలో ఎక్కువ భాగం పుస్తకాలకే వెచ్చించిన ఆయన జ్ఞానమే అసలైన సంపద అని అది మాత్రమే మనిషిని బానిసత్వము నుండి విముక్తి చేయగలరని నిరూపించారు. డిగ్రీల కోసం కాకుండా విచక్షణ జ్ఞానం కోసం పుస్తకాలను చదవాలని ఆయన ఆశించారు.
“చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో” అన్నారు కందుకూరి వీరేశలింగం పంతులు. నేటి డిజిటల్ యుగంలో మొబైల్ ఫోన్లకు బానిసలై పుస్తక పఠనాన్ని మర్చిపోతున్న తరుణంలో, ఈ దినోత్సవం మళ్ళీ పుస్తకాల వైపు మనల్ని మళ్ళిస్తుంది. 2026 అంతర్జాతీయ పుస్తక దినోత్సవం నాడు, కనీసం ఒక పుస్తకమైనా చదవడం ప్రారంభిద్దాం, జ్ఞానాన్ని పెంచుకుందాం. ప్రపంచ పుస్తక మరియు కాపీరైట్ దినోత్సవం మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. పుస్తకాలను చదవాలి, రచయితల కృషిని గౌరవించాలి, జ్ఞానాన్ని పంచుకోవాలి. “పుస్తకం మనిషి జీవితాన్ని మార్చగలిగే గొప్ప శక్తి.” పుస్తకం మనిషి జీవితాన్ని మలిచే శక్తి. డిజిటల్ యుగంలోనూ పఠన అలవాటు తగ్గిపోకుండా కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. పుస్తకాల పట్ల ఆసక్తి పెంపొందితేనే జ్ఞాన సమాజం నిర్మాణం సాధ్యం.
“పుస్తకం మనిషికి మంచి మిత్రుడు, నిశ్శబ్ద సలహాదారు. గొప్ప గురువు “





