‘సహకార’ ఎన్నికల కోసం ఒత్తిడి తేవాలి

– కేటీఆర్‌కు సహకార సంఘాల అధ్యక్షుల విజ్ఞప్తి
– సహకారం అందిస్తామని కేటీఆర్ హామీ

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 16 : రాష్ట్రంలోని సహకార సంఘాలు, సహకార బ్యాంకులకు వెంటనే ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(పీఏసీఎస్)ల అధ్యక్షులు బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కోరారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన సహకార సంఘాల అధ్యక్షులు తెలంగాణ భవన్‌లో ఆయనను కలిసి సహకార రంగం ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. వారి విజ్ఞప్తిపై స్పందించిన కేటీఆర్ ఎన్నికల నిర్వహణ కోసం తమవంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రం ఏర్పడిన సమయంలో సహకార బ్యాంకుల మొత్తం వ్యాపారం సుమారు రూ.13 వేల కోట్లుగా ఉండగా కేసీఆర్ నేతృత్వంలోని పదేళ్ల బీఆరఎస్ పాలనలో అది రూ.60 వేల కోట్లకు చేరిందని అధ్యక్షులు తెలిపారు. రైతాంగానికి మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో సొసైటీలకు స్వయం ప్రతిపత్తి కల్పించి, ఎన్నికల ద్వారా పాలకవర్గాలను ఏర్పాటు చేయడంతో రైతులకు చేరువగా సేవలు అందించగలిగాయని తెలిపారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ పాలకవర్గాలతో నడిపిస్తుండటంతో సహకార రంగం తీవ్రంగా దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు.

పంట రుణాలు ఇవ్వలేని స్థితిలో సహకార బ్యాంకులు

మేనేజ్‌మెంట్ కమిటీలు లేకపోవడంతో సహకార బ్యాంకులు రైతులకు పంట రుణాలు అందించలేని పరిస్థితి ఏర్పడిందని అధ్యక్షులు తెలిపారు. ప్రస్తుత పంట సీజన్‌లో సహకార బ్యాంకుల ద్వారా పంట రుణాలు అందించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. బ్యాంకుల సీఈవోలకు పరిమిత అధికారాలే ఉండటంతో రూ.10 లక్షలకు మించిన రుణాల మంజూరుకు అవసరమైన నిర్ణయాలు తీసుకోవడం కష్టమవుతోందన్నారు. దీంతో జిల్లా సహకార బ్యాంకుల కార్యకలాపాలు, వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణాల పంపిణీ కూడా ప్రభావితమవుతున్నాయని వివరించారు. ఉన్నత విద్య కోసం ఐఐటీలు, ఐఐఎంలలో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు సైతం రుణాలు అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. పాలకవర్గాల పునరుద్ధరణ అంశం హైకోర్టులో పెండింగ్‌లో ఉందని, న్యాయపరమైన ప్రక్రియలో జాప్యం జరుగుతున్నందున తక్షణమే ఎన్నికల నిర్వహణకు చర్యలు చేపట్టేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. సహకార సంఘాలు, బ్యాంకులు తిరిగి బలోపేతం కావాలన్నా, రైతులకు పంట రుణాలు, విద్యార్థులకు విద్యా రుణాలు సహా అవసరమైన సేవలు సక్రమంగా అందాలన్నా పాలకవర్గాలకు ఎన్నికలు జరిపించాలని కోరారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *