– రేవంత్ అవగాహనా రాహిత్యంతోనే సమస్య
– రైతు కూలీలకు ఏడాదికి రూ.12వేలు ఇవ్వాలి
– పవర్ మ్యాక్స్ కంపెనీతో ఒప్పందం ఏంటో బయటపెట్టాలి
– తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 16:కరువు వస్తుందనే ముందే హెచ్చరించినా ముందస్తు చర్యలు చేపట్టడంలో సీఎం రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ అయ్యారని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. బంజారాహిల్స్ లోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది జనవరి నుంచే ఎల్ నినో ఎఫెక్ట్ తో తీవ్రమైన కరువు వచ్చే ప్రమాదముందని హెచ్చరించినా కనీస చర్యలు చేపట్టలేదన్నారు. దొంగలు పడిన ఆరు నెలలకు అన్నట్లుగా ఇప్పుడొచ్చి రైతులు త్యాగాలు చేయాలని చెప్పడం సిగ్గుచేటు అన్నారు. కరువు విషయంలో తాను ఏమీ చేయలేనని రేవంత్ రెడ్డి నిస్సహాయతను వ్యక్తం చేస్తూ చేతులెత్తేశారని మండిపడ్డారు. ఆగస్టులో 28 అలర్ట్ అయి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదన్నారు. పక్క రాష్ట్రాలు కరువు మండలాలను ప్రకటించి కేంద్రానికే ఇప్పటికే నివేదిక పంపాయని గుర్తు చేశారు. మన సీఎం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇప్పుడు రివ్యూలు అంటూ కాలం వెళ్లదీసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతోందని, ఇప్పటివరకు పాలమూరు- రంగారెడ్డి పూర్తి చేయలేదని, మేడిగడ్డ బ్యారేజ్ ను కూడా రిపేర్ చేయలేదని అన్నారు. వాటిని పూర్తి చేసి ఉంటే ఇవ్వాళ రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.1.86 లక్షల కోట్లు ఖర్చు చేసినా ప్రాజెక్టులు పూర్తి కాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రూ.26 వేల కోట్లు ఖర్చు చేసినప్పటికీ ఒక్క ఎకరానికి కూడా కొత్తగా నీళ్లు ఇవ్వలేదన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్లు చేసుకోవడానికి ఇదే సరైన సమయమని, వచ్చే వర్షాకాలంలోగా ఆ పనులు పూర్తి చేసి గోదావరి నీళ్లను వినియోగంలోకి తేవాలని ఆమె డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అనుభవలేమి రాష్ట్రానికి శాపంగా మారిందన్నారు. పంట నష్టపోయిన వారికి ఎకరానికి రూ.10 వేలు ఇస్తామని లీకులు ఇస్తున్నారే తప్ప ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేయడం లేదన్నారు. యాసంగిలో పంటలు సాగు చేయకపోతే రైతు కూలీలు ఆగమయ్యే పరిస్థితి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు సైతం పనులు లేక పట్ణణాలకు వలస వెళ్లే పరిస్థితి ఉందని, పట్టణాల్లో సరైన ఉపాధి అవకాశాలు లేవని అన్నారు. రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇవ్వడంతో పాటు వారి కుటుంబాలకు బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీలో పని దినాలు పెంచడం కోసం ఇప్పుడు కమిటీ వేస్తే ఎప్పుడు కేంద్రానికి నివేదిక ఇస్తారు.. వాళ్లు ఎప్పుడు ఆమోదిస్తారని ప్రశ్నించారు. యాదాద్రి పవర్ ప్లాంట్ లో కొన్ని కాంపొనెంట్లను ప్రైవేటీకరించి దోచుకునేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. పవర్ మ్యాక్స్ కంపెనీతో ముఖ్యమంత్రికి ఉన్న సంబంధాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కరెంట్ విషయంలో ప్రభుత్వానికి అధికారం ఉండాలని గతంలో మాట్లాడిన సీఎం.. ఇప్పుడు ప్రైవేటీకరణకు ఎందుకు యత్నిస్తున్నారని ప్రశ్నించారు. రైతులకు నీళ్లు, కరెంట్ ఇవ్వగలిగే పరిస్థితి ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం లేదని, ఈ విషయాన్ని రైతులు గమనించాలని కోరారు. కరెంట్ కష్టాలను అధిగమించేందుకు అవసరమైతే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లను కలుస్తామని, దిల్లీకి వెళ్లి కేంద్రం పెద్దలతో మాట్లాడతామని చెప్పారు. హైదరాబాద్ లో నీటి కొరతకు కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 8 వేల చెరువులు మాయం చేశారని చెప్పారు. దీంతో నగరంలో భూగర్భ జలాలు అడుగంటాయని తెలిపారు. కరువు విషయంలో అఖిలపక్ష మీటింగ్ పెడతామని అంటున్నారని కానీ దానితో ప్రయోజనం ఏముంటుందని ప్రశ్నించారు. ఈ పని ముందే చేయాల్సిందన్నారు. బీసీ బిల్లు విషయంలో అఖిలపక్షాన్ని దిల్లీకి ఎందుకు తీసుకెళ్లలేదని నిలదీశారు. ఇప్పుడు తాను చేసిన తప్పుకు అందరినీ భాగస్వాములు చేసే ప్రయత్నం చేస్తున్నారని కవిత మండిపడ్డారు. విదేశీ బొగ్గు కొనుగోలు ఒప్పందాలపై విచారణ పేరుతో ప్రతిమ శ్రీనివాస్ రావుకు వ్యతిరేకంగా కేటీఆర్ లేఖ రాయడంపై కవిత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఉద్యమకాలంలో బీఆర్ఎస్ కు పూర్తి అండగా ఉన్న ఆయనపై విచారణ కోరడం అంటే నమ్మినోళ్లను నట్టేట ముంచడమేనన్నారు. సాయం చేసిన వాళ్లను, కుల బంధువులను ఇబ్బంది పెట్టడం, ఇంటి మనిషినైనా తనను కిరాయి మనుషులతో తిట్టించే నైజం కేటీఆర్ ది అని మండిపడ్డారు. తమ పోరాటాలతోనే ప్రభుత్వం దిగి వచ్చి సింగరేణిలో మెడికల్ బోర్డు నిర్వహిస్తోందని గుర్తు చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





