బంధువు అస్థికలు నిమ‌జ్జ‌నం చేసేందుకు వెళ్తుంటే..

– ఎదురెదురుగా ఢీకొన్న వాహ‌నాలు  
– 8మంది ప్రయాణికుల దుర్మరణం

చండీగఢ్‌,‌ జూన్‌ 6: ‌పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌-‌ఫాజిల్కా రహదారిపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు వాహ‌నాలు ఎదురెదురుగా ఢీకొని 8మంది ప్రాణాలు కోల్పోగా 15మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితులంతా ఇటీవల మృతిచెందిన తమ బంధువు అస్థికలను నీటిలో కలిపేందుకు వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. ప్రమాదానికి గురైన వారిని జలాలాబాద్‌ ‌వాసులుగా పోలీసులు గుర్తించారు. బాధితులు తమ బంధువు అస్థికలను తీసుకుని బియాస్‌లోని రాధా సో డేరాకు శనివారం ఉదయం ప్రయాణమ‌య్యారు. సుమారు 25 మంది మహీంద్రా పికప్‌ ‌వాహనంలో బయలుదేరారు. అయితే వాహనం జంగవాలా గ్రామ సమీపానికి రాగానే ఎదురుగా వచ్చిన మరో ట్రక్కును ప్రమాదవశాత్తూ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించగా.. మరో నలుగురు హాస్పిటల్ లో చికిత్సపొందుతూ ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, వైద్య సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని ఫిరోజ్‌పూర్‌లోని సివిల్‌ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. కుటుంబ సభ్యులు, బంధువుల మృతితో ప్రమాద స్థలం, ఆస్పత్రి ప్రాంగణంలో బాధితుల రోదనలు మిన్నంటాయి. మరోవైపు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *