– బీజేపీ చీఫ్ రామచందర్‌రావు నివాళులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14 : అంబేద్కర్ కేవలం రాజ్యాంగ రచయిత మాత్రమే కాదు.. సామాజిక న్యాయం, బడుగు, బలహీనవర్గాల సాధికారత కోసం జీవితాంతం పోరాడిన మహానుభావుడు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు కొనియాడారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఆయనకు ఘన నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈరోజు రాహుల్ గాంధీ రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకొని తిరుగుతున్నారంటూ ముందుగా కాంగ్రెస్ పార్టీ చరిత్రలో అంబేద్కర్‌పై ఎలా వ్యవహరించిందో పరిశీలించుకోవాలన్నారు. స్వాతంత్య్రానికి ముందు బాంబే ప్రెసిడెన్సీలో అంబేడ్కర్‌ని పోటీ చేయకుండా అడ్డుకోవడం, వ్యతిరేకంగా అభ్యర్థులను నిలబెట్టి ఓడించడం, రాజ్యాంగ సభలో ఆయనకు అవకాశం ఇవ్వకపోవడం వంటి చర్యలు కాంగ్రెస్ పార్టీ చేసినవేనని గుర్తు చేశారు. చివరికి ముస్లిం లీగ్ మద్దతుతోనే ఆయన అసెంబ్లీలోకి ప్రవేశించాల్సి వచ్చిందన్నారు. స్వాతంత్య్రం తర్వాత డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్‌గా అంబేద్కర్‌ని అంగీకరించడంలో కూడా కాంగ్రెస్ నాయకత్వం తొలుత వెనుకంజ వేసిందన్నారు. ఆయన ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థులను నిలబెట్టి రెండుసార్లు ఓడించిందని చెప్పారు. హరిజన్ సేవక్ సంఘ్ వంటి సంస్థలను ఏర్పాటు చేసి ఆయన ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం చేసిందన్నారు. ఆయనకు భారత్ రత్న కూడా కాంగ్రెస్ పాలనలో కాకుండా తర్వాతి ప్రభుత్వ కాలంలోనే లభించిందన్నారు. ఆయన జన్మస్థలంలో స్మారక నిర్మాణం విషయంలో కూడా ప్రభుత్వం ముందుకు రావాల్సిన అవసరం లేదని అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పేర్కొన్నారన్నారు. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్‌కు తగిన గౌరవం లభించిందన్నారు. ఆయన జీవితానికి సంబంధించిన ఐదు ముఖ్య ప్రదేశాలను ‘పంచతీర్థాలు’గా అభివృద్ధి చేశారని, ఎస్సీ, ఎస్టీ వర్గాల సాధికారత కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ సమాజంలో సమానత్వాన్ని బలోపేతం చేసే దిశగా కృషి చేస్తున్నారని వివరించారు. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందంటూ మహిళా రిజర్వేషన్ ఒక విషయం, డీలిమిటేషన్ మరో విషయం, సెన్సస్ ఇంకో విషయం. ఈ మూడింటిని కలిపి కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో గందరగోళం సృష్టించడం, అసత్య ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దేశం మొత్తం ఒకటేనంటూ ఉత్తరం-దక్షిణం అనే విభజన చేయడం దేశ సమగ్రతకు విరుద్ధ మన్నారు. మహిళల సాధికారత గురించి ఆ పార్టీకి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ట్రిపుల్ తలాక్ వంటి కీలక అంశంపై కూడా వారు ధైర్యంగా నిర్ణయం తీసుకోలేకపోయారని, తమ ప్రభుత్వం మాత్రం మహిళల గౌరవం, భద్రత, సాధికారత కోసం స్పష్టమైన చట్టాలు తీసుకువచ్చి అమలు చేసిందని రామచందర్‌రావు చెప్పారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నుంచి 33% మహిళా రిజర్వేషన్ల అమలు దిశగా ‘నారీ శక్తి వందన్ అధినియమ’తో మహిళా రిజర్వేషన్ బిల్లు తప్పకుండా అమలవుతుంది.. ఎవరికీ అన్యాయం జరగదు.. డీలిమిటేషన్, సెన్సస్ అన్నీ రాజ్యాంగబద్ధంగా, నిర్దిష్ట విధానాల ప్రకారం జరుగుతాయి.. ప్రజలు అపోహలకు లోనుకాకుండా వాస్తవాలను అర్థం చేసుకోవాలి అని రామచందర్‌రావు స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




