– ఓ వర్గానికి ఆపాదించుకునే కుట్ర జరుగుతోంది
– తడకపల్లిలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణలో హరీష్‌రావు
సిద్దిపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14 : సిద్దిపేట అర్బన్ మండలం తడకపల్లిలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని, ఎన్నో ఎళ్లుగా ఉన్న లోటు నేటితో తీరిపోయిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సాయి, ఆయన కుమారుడు గ్రామంలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేసినందుకు వారిని అభినందిస్తున్నానంటూ గ్రామం మొదట్లోనే విగ్రహం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని, ఎవరు గ్రామానికి వచ్చినా మొదట ఆహ్వానం పలికేది అంబేడ్కరేనని, ఆయన జయంతి రోజున విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషదాయకమని అన్నారు. కొంతమంది అనుకున్నట్లు అంబేడ్కర్ ఒక వర్గానికి మాత్రమే నాయకుడు కాదని, ఆయన అందరివాడని, కొంతమంది కావాలనే ఒక వర్గానికి ఆపాదించే కుట్ర చేస్తున్నారని అన్నారు. ఇవాళ భారత దేశం ప్రపంచంలో అదిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఎదుగుతునదంటే అది అంబేడ్కర్ రచించిన రాజ్యాంగమే కారణమన్నారు. అమెరికా వంటి దేశంలోనే మహిళలకు ఓటు హక్కు రావాలంటే దశాబ్దాల కాలం పట్టింది.. కానీ మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన వెంటనే రాజ్యాంగం ద్వారా ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించిన గొప్ప వ్యక్తి బాబా సాహెబ్ అంబేడ్కర్ అని హరీష్‌రావు తెలిపారు. నేటి యువత ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని హితవు పలికారు. పేదరికం చదువుకు అడ్డు కాదని అంబేడ్కర్‌ని చూసి నేర్చుకోవాలన్నారు. దేశంలోని అణగారిన వర్గాల కోసం పోరాడి విజయం సాధించిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. అలాంటి గొప్ప వ్యక్తి ఆశయాలను రాష్ట్రంలో ముందుకు తీసుకుపోవాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం అలవికాని హామీలు ఇచ్చి గద్దెనెక్కి నేడు ఏమీ చేయలేక చేతులు ముడుచుకుని కూర్చుందని విమర్శించారు. 10వ తరగతి పాస్ అయితే రూ.10 వేలు, ఇంటర్ పాస్ అయితే రూ.25 వేలు, డిగ్రీ పాస్ అయితే రూ.లక్ష, పీజీ పాస్ అయితే రూ.2 లక్షలు ఇస్తామని ఎన్నికలపుడు కాంగ్రెస్ నాయకులు చెప్పి ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను నమ్మించి మోసం చేశారని విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయకపోవడంతో సర్టిఫికెట్లు రాక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు చూస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ రెండున్నరేళ్లల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. ఆనాడు కేసీఆర్ ఒక్కో విద్యార్థికి రూ.20 లక్షలు ఇచ్చి విదేశాల్లో చదివించారన్నారు. దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ అని గుర్తు చేశారు. హైదరాబాద్ నడిబొడ్డున భారీ అంబేడŠ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే ఇది కేసీఆర్ పెట్టించిండు అని రేవంత్ రెడ్డి అక్కడ గేట్లకు తాళం వేయించాడని, కనీసం అంబేడ్కర్ కు దండ కూడా వేయని సంకుచిత మనస్తత్వం ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం దళిత బంధు అమలు చేయాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





