కాంగ్రెస్‌కు కంచుకోట ఖమ్మం

– పార్టీ కోసం శ్రమించిన వారికి తగిన గుర్తింపు
– ప్రభుత్వ కార్యక్రమాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలి
– ఆ బాధ్యత కార్యకర్తలదే
– ప్రజాప్రభుత్వంపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం
– ఖమ్మం డీసీసీ కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో భట్టి

ఖమ్మం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14: స్వాతంత్రం తెచ్చింది, పంచవర్ష ప్రణాళికల ద్వారా దేశ అభివృద్ధికి పునాదులు వేసింది కాంగ్రెస్ పార్టీ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. డీసీసీ కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం మంగళవారం ఖమ్మంలో జరిగింది. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి రోజున నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేయడం ఒక గొప్ప విషయమని అన్నారు. ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ రాజ్యాంగం అందించిన సమానత్వం, హక్కులను కాపాడుతూ పార్టీ మూల సిద్ధాంతాలకు కట్టుబడి నూతన కార్యవర్గ సభ్యులు పనిచేయాలని హితబోధ చేశారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్‌లో బాధ్యతలు స్వీకరించడం ఒక గౌరవంగా భావించాలన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికీ తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని డిప్యూటీ సీఎం ఉద్బోధించారు. కాంగ్రెస్ హయాంలోనే రైతులకు మేలు జరుగుతున్నదని, రైతు భరోసా, మద్దతు ధరతోపాటు ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ ఇచ్చే కార్యక్రమం అమలు చేస్తున్నామని చెప్పారు. రైతులకు మేలు జరుగుతుండగా బీఆరఎస్ నాయకులు కుట్రలు పన్నుతున్నారని, ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తూ రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున, రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 4.5 లక్షల ఇళ్లను మంజూరు చేశామని, ఇందుకోసం ప్రజా ప్రభుత్వం రూ.22,500 కోట్లను వెచ్చిస్తోందంటూ పేదవాడు ఆత్మగౌరవంతో బతికితే తమ ఉనికి ఉండదని భయంతోనే ప్రతిపక్షాలు ఈ పథకంపై విషప్రచారం చేస్తున్నాయన్నారు. మార్కెట్‌లో కిలో రూ.50 నుంచి రూ.55 ఉన్నప్పటికీ పేదలకు నాణ్యమైన ఆహారం అందించాలనే లక్ష్యంతో ప్రతి వ్యక్తికి 6 కిలోల చొప్పున రాష్ట్రంలోని కోటీ 6 లక్షల కుటుంబాలకు ప్రజా ప్రభుత్వం ఉచితంగా సన్న బియ్యం అందిస్తోందని వివరించారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి వారికి రూ.10వేల కోట్ల ఆర్థిక ప్రయోజనం చేకూర్చినట్లు భట్టి చెప్పారు. రాబోయే ఐదేళ్లలో మహిళా సంఘాలకు రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు అందిస్తామని, ఇప్పటికే రూ.57,000 కోట్లను బ్యాంక్ లింకేజీ ద్వారా స్వయం సహాయ సంఘాలకు, డ్వాక్రా గ్రూపులకు అందించామని తెలిపారు. ఎవరికైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పించే పథకాన్ని బడ్జెట్‌లో ప్రవేశపెట్టామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 28 లక్షల మంది విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందించే కార్యక్రమం జూన్ 2నుంచి ప్రారంభిస్తున్నామని, ఇంటర్ విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి మధ్యాహ్న భోజన సౌకర్యం ప్రారంభిస్తున్నామని, నీటిపారుదల ప్రాజెక్టులు, హామ్ విధానం ద్వారా వేల కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణాన్ని చేపడుతున్నామని వివరించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారిని గుర్తించి అభినందిస్తామని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఖమ్మం జిల్లాను కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా నిలబెట్టాలన్నారు. గత పదేళ్లు అధికారంలో లేనప్పుడు కూడా పార్టీ జెండాను మోసిన నాయకులు, కార్యకర్తలను అభినందిస్తూ వారిని పార్టీ, ప్రభుత్వం ఖచ్చితంగా గుర్తించి గౌరవిస్తాయన్నారు. డాక్టర్ అంబేడŠ్కర్ ఆశయాలను, ఆలోచనలను ముందుకు తీసుకెళ్లాలని, పార్టీ సిద్ధాంతాలను, భావజాలాన్ని ప్రతి ఇంటికీì చేరవేయాలని పార్టీ శ్రేణులను డిప్యూటీ సీఎం కోరారు.

కొండంత పని చేస్తున్నాం : మంత్రి పొంగులేటి

గత పాలకులు గోరంత చేసి కొండంత చెప్పుకున్నారు.. కానీ మన ప్రభుత్వం కొండంత అభివృద్ధి చేస్తున్నా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వెనుకబడి ఉన్నాం. కార్యకర్తలు నడుం బిగించి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని ప్రతి ఇంటికీ వివరించాలి అని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా కార్యాలయంలో మంగళవారం జరిగిన జిల్లా, నగర కాంగ్రెస్ నూతన కార్యవర్గ బాధ్యతల స్వీకరణ మహోత్సవంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో కొనసాగుతున్నది కార్యకర్తల ప్రభుత్వమని పొంగులేటి పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలనే తపనతో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని చెప్పారు. కార్యకర్తల కష్టం, పోరాట ఫలితంగానే నేడు మనం అధికారంలో ఉన్నామని, ఆ బాధ్యతను గుర్తెరిగి ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు.

ప్రతిపక్షాల మాయమాటలను తిప్పికొట్టాలి

పదేళ్లపాటు రాష్ట్రాన్ని ఏలిన వారు అధికారం కోల్పోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని మంత్రి విమర్శించారు. అధికారం పోయిందన్న కసితో నిప్పు తొక్కిన కోతుల్లా ఎగురుతున్నారని, వారి మాయమాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఎద్దేవా చేశారు. మనం చేసిన అభివృద్ధిని, అందిస్తున్న సంక్షేమాన్ని గడప గడపకూ వివరించగలిగితే కాంగ్రెస్ విజయ పరంపరను ఎవరూ అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు.

వేడుకగా ప్రమాణ స్వీకారం

పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా, నగర కాంగ్రెస్ నూతన కార్యవర్గ సభ్యులు ఉత్సాహంగా బాధ్యతలు చేపట్టారు. డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, ఎంపీ రామసహాయం రఘురామ్ రెడ్డి, ఎమ్మెల్యేలు రామదాస్ నాయక్, మట్టా రాగమయి దయానంద్, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *