– కుటుంబీకులను ఓదార్చిన ఉప ముఖ్యమంత్రి
– హైదరాబాద్‌కు జ్యోతి బదిలీ, కుమారుడికి ఉద్యోగంపై హామీ
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 1 : ఉన్నతమైన విలువలు, వృత్తి పట్ల అంకితభావం కలిగిన సీపీఆర్వో మారబోయిన మధుసూదన్‌ను కోల్పోవడం బాధాకరమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. మధుసూదన్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. మిర్యాలగూడలోని మధుసూదన్ నివాసానికి శుక్రవారం వెళ్లిన ఆయన శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. మధుసూదన్ భార్య జ్యోతి, తల్లి పార్వతమ్మలతో మాట్లాడిన భట్టి విక్రమార్క మధుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పాత్రికేయ విలువలకు మధు నిలువెత్తు రూపమని, సమాజం పట్ల ఆయనకున్న దృక్పథం, వృత్తిలో ఆయన చూపిన నిబద్ధత ఎందరికో ఆదర్శం అని కొనియాడారు. మధు మృతి వ్యక్తిగతంగా తనకు కూడా తీరని లోటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను కుటుంబ సభ్యులు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా మధుసూదన్ సతీమణి జ్యోతి ప్రస్తుతం తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీలో కోఆర్డినేటర్‌గా హైదరాబాద్‌లో డెప్యుటేషన్‌పై పనిచేస్తున్నారు. తన కుమారుడి భవిష్యత్తు దృష్ట్యా తనను శాశ్వతంగా హైదరాబాద్ లేదా మేడ్చల్- మల్కాజ్‌గిరి జిల్లాకు బదిలీ చేయాలని కోరారు. దీనిపై తక్షణమే అవసరమైన చర్యలు తీసుకుంటామని భట్టి హామీ ఇచ్చారు. బీటెక్ పూర్తి చేసిన కుమారుడు వెంకట్ సూరజ్‌కు కార్పొరేట్ సంస్థల్లో మంచి ఉద్యోగం వచ్చేలా సహకరించాలని కోరగా సూరజ్ భవిష్యత్తు బాధ్యత తనదేనని డిప్యూటీ సీఎం ప్రకటించారు. మధుసూదన్ కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటామని, వారికి ఎలాంటి అవసరం వచ్చినా, ఇబ్బంది కలిగినా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. వ్యక్తిగతంగానూ ఆ కుటుంబానికి పూర్తి సహకారం అందిస్తామని భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





