– స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో మంత్రి పొంగులేటి
హనుమకొండ, ప్రజాతంత్ర, ఆగస్టు 15: పేదల ముఖంలో చిరునవ్వు చూడటమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హనుమకొండలోని అంబేద్కర్ భవన్‌లో శనివారం నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో మాట్లాడారు. ఎంపీ డాక్టర్ కావ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, నాగరాజు, కాలెక్టర్ చాభత్ బాజ్‌పాయిలతో కలిసి స్మార్ట్ రేషన్ కార్డులను లబ్దిదారులకు మంత్రి పంపిణీ చేశారు. రేషన్ కార్డు అనేది కేవలం ఒక గుర్తింపు పత్రం కాదని, పేద కుటుంబాలకు ఆహార భద్రతతోపాటు అనేక సంక్షేమ పథకాలకు ఆధారమని పేర్కొన్నారు.
పేదవాడి సంక్షేమం పట్టని గత పాలకులు
పేదవాడికి రేషన్ కార్డు, సన్న బియ్యం, ఉచిత విద్యుత్ ఇస్తే తమకు ఏం వస్తుందనే ఆలోచనలోనే గత పాలకులు ఉన్నారని మంత్రి పొంగులేటి తీవ్రంగా విమర్శించారు. ప్రజల అవసరాల కంటే కమీషన్లే లక్ష్యంగా భారీ ప్రాజెక్టుల పేరుతో రూ.లక్షల కోట్లు ఖర్చు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని మండిపడ్డారు.
పేదవాడికి సొంత ఇల్లు అంటే ఆత్మగౌరవం
నీ ఇల్లు ఎక్కడ అని అడిగితే గర్వంగా చూపించుకునే ఇల్లు ఉండాలి. ఆ ఆలోచన కూడా గత ప్రభుత్వానికి రాలేదు అని మంత్రి అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 4.50 లక్షల ఇళ్లను అందిస్తున్నామని, రెండో విడతలో మరో 2.50 లక్షల ఇళ్లను నిర్మిస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు ఇచ్చే వరకు ప్రభుత్వం వెనక్కి తగ్గదన్నారు. పేదింటి ఆడబిడ్డ కూడా నాణ్యమైన బియ్యం తిని గౌరవంగా జీవించాలన్నదే ఇందిరమ్మ ప్రభుత్వ సంకల్పమన్నారు. గతంలో మాదిరిగా హామీలు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రభుత్వం కాదని, ఇచ్చిన మాటను అమలు చేసి చూపిస్తున్న ప్రజా ప్రభుత్వం ఇది అని చెప్పారు. గత పాలకులు రాష్ట్రంపై సుమారు రూ.8.21 లక్షల కోట్ల అప్పుల భారాన్ని మోపారని, ఆ అప్పులకు అసలు-వడ్డీ చెల్లిస్తూనే పేదల సంక్షేమానికి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. అప్పుల భారం ఉన్నప్పటికీ పేదల సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ అదే సమయంలో రూ.వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పారు. సుమారు రూ.5,700 కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. వరంగల్‌కు విమానాశ్రయం రావాలన్న ప్రజల చిరకాల కోరికను నెరవేర్చేందుకు కేంద్రాన్ని ఒప్పించి, మెప్పించి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. క్యూఆర్ కోడ్‌తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా లబ్దిదారులు తమ ప్రాంతంలో కానీ పరిసర ప్రాంతాల్లోని రేషన్ దుకాణాల్లో కానీ సరకులు పొందే అవకాశం కల్పించామని తెలిపారు. పేదవాడి కడుపు నింపేందుకు ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యం విషయంలో తూకంలో తేడాలు, అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని రేషన్ డీలర్లను మంత్రి హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజల మధ్యే ఉండి సమస్యలు పరిష్కరిస్తున్నారన్నారు.
మూడోసారి, నాల్గోసారి కూడా ఇళ్లు ఇస్తాం
అర్హత ఉన్న ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండే వరకు ఇందిరమ్మ ప్రభుత్వం నిరంతరం ఇళ్ల నిర్మాణాన్ని కొనసాగిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. గత పాలనకు భిన్నంగా ప్రాజెక్టుల్లో కమీషన్ల కోసం కాక పేదవాడి కడుపు నింపడం, పేదవాడి తలపై సొంతింటి పైకప్పు వేయడం, పేద పిల్లలకు మంచి విద్య అందించడం, ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





