– తగ్గిన పీఎం10 స్థాయిలు
– ‘స్వచ్ఛ వాయు సర్వేక్షణ్’లో నల్గొండకు జాతీయ ర్యాంకు
– ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ కమిటీ సమావేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: రాష్ట్రంలో వాయు కాలుష్య నియంత్రణ, గాలి నాణ్యత మెరుగుదలే లక్ష్యంగా ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ కమిటీ ఆధ్వర్యంలో సమగ్ర కార్యాచరణ అమలు చేస్తున్నట్లు అటవీ, పర్యావరణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిటీ ఛైర్మన్ అహ్మద్ నదీమ్ తెలిపారు. బుధవారం సచివాలయంలో పీసీబీ మెంబర్ సెక్రటరీ, మెంబర్ కన్వీనర్ రవి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ కమిటీ సమీక్షా సమావేశంలో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) మార్గదర్శకాల అమలుపై చర్చించారు. గత కొన్నేళ్లుగా చేపడుతున్న శాస్త్రీయ పర్యవేక్షణ వల్ల రాష్ట్రంలో PM10 స్థాయిలు తగ్గుముఖం పట్టాయని అధికారులు వెల్లడించారు. 2019–20 నుంచి 2025–26 నాటికి హైదరాబాద్‌లో PM10 వార్షిక సగటు స్థాయి 86 నుంచి 80 µg/m³కు, సంగారెడ్డిలో 87 నుంచి 78 µg/m³కు తగ్గింది. ప్రస్తుతం రాష్ట్రంలో వాయు నాణ్యత సూచీ (AQI) ప్రధానంగా ‘సాటిస్‌ఫ్యాక్టరీ’ నుంచి ‘మోడరేట్’ కేటగిరీలలోనే కొనసాగుతోందని సమీక్షలో స్పష్టం చేశారు.
జాతీయ స్థాయిలో మెరిసిన నల్గొండ
ఎన్ఏసీపీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 130 నగరాల్లో చేపట్టిన వార్డు స్థాయి ‘స్వచ్ఛ వాయు సర్వేక్షణ్’లో నల్గొండలోని 16వ వార్డు (10 వేల జనాభా కేటగిరీ) జాతీయ స్థాయిలో రెండో ర్యాంక్ సాధించి రూ. 20 లక్షల పురస్కారం పొందింది. అలాగే హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ (215వ వార్డు), గన్‌ఫౌండ్రీ (154వ వార్డు), సంగారెడ్డిలోని 31వ వార్డులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ పనితీరు కనబరిచినట్లు తెలిపాయి.
సమావేశంలో తీసుకున్న ప్రధాన నిర్ణయాలు:
13 కొత్త ‘నిరంతర పరిసర వాయు నాణ్యత పర్యవేక్షణ వ్యవస్థ’ల ఏర్పాటు పనులు వేగవంతం చేశారు. వీటి ద్వారా లభించే డేటాను అందుబాటులో ఉంచేందుకు ప్రత్యేక ‘ఎయిర్ క్వాలిటీ డ్యాష్ బోర్డు’ను అభివృద్ధి చేస్తున్నారు. రాష్ట్రంలోని 516 పీయూసీ కేంద్రాలను కేంద్ర సర్వర్‌తో అనుసంధానించారు. రాబోయే రోజుల్లో ఏఎన్‌పీఆర్ కెమెరాల ద్వారా గడువు ముగిసిన పీయూసీ వాహనాలను గుర్తించి ఆటోమేటిక్ చలాన్లు విధించనున్నారు. జీహెచ్ ఎంసీ పరిధిలో ప్రస్తుతం 310 ఈ-బస్సులు తిరుగుతుండగా, పీఎం ఈ డ్రైవ్ కింద మరిన్ని బస్సులను అందుబాటులోకి తేనున్నారు. రోడ్డు ధూళి నివారణకు మెకానికల్ స్వీపింగ్, మియావాకీ ప్లాంటేషన్, గ్రీన్ కవర్ పెంపు చర్యలు చేపడుతున్నారు. పంట వ్యర్థాలను బహిరంగంగా కాల్చకుండా వాటిని బ్రికెట్లు, పెల్లెట్లుగా మార్చి ప్రత్యామ్నాయ ఇంధనంగా వినియోగించే యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నారు.ఎన్ఏసీపీ కింద 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను నల్గొండకు రూ.4.83 కోట్లు, సంగారెడ్డికి రూ.2.42 కోట్లు (మొత్తం రూ.7.25 కోట్లు) కేటాయించారు. అన్ని శాఖల సమన్వయం, ప్రజా భాగస్వామ్యంతో తెలంగాణలో మెరుగైన వాయు నాణ్యత సాధనకు పీసీబీ నిరంతరం కృషి చేస్తుందని మెంబర్ సెక్రటరీ రవి పేర్కొన్నారు. ఈ సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు, కలెక్టర్లు, కమిషనర్లు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





