• ఆదివాసీ ప్రాంతాల ప్రత్యేక వ్యాధులపై పరిశోధన కేంద్రం
• ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌కు మంత్రి సీతక్క విజ్ఞప్తి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 29 : ములుగు జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ అభివృద్ధికి తక్షణమే నిధులు మంజూరు చేసి ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ (సీతక్క) కోరారు. వైద్య ,ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో సచివాలయంలో ఆమె శనివారం భేటీ అయ్యారు. ములుగు జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో అత్యవసరంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పన, వైద్య సిబ్బంది నియామకం, ఆధునిక వైద్య పరికరాల ఏర్పాటు తదితర అంశాలపై మంత్రి సీతక్క వినతిపత్రం అందజేశారు.
అత్యవసర నిధులు, సిబ్బంది నియామకం
హాస్పిటల్ లో డ్రైనేజీ, పారిశుధ్య పనుల కోసం అత్యవసరంగా రూ.50 లక్షల నిధులు మంజూరు చేయాలని మంత్రి కోరారు. అలాగే రోగుల సంఖ్యకు అనుగుణంగా అదనపు ఓపీ (అవుట్ పేషెంట్) గదుల నిర్మాణం కోసం రూ.2 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. హాస్పిటల్ నిర్వహణ, సేవల మెరుగుదలకు 50 మంది వర్కర్ల నియామకానికి ఉత్తర్వులు జారీ చేయడంతోపాటు రూ.1.20 కోట్లు నిధులు కేటాయించాలని కోరారు. 132 టెక్నికల్ పోస్టులకు ప్రస్తుతం కేవలం 14 మంది మాత్రమే పనిచేస్తున్నారని, మిగిలిన పోస్టులను భర్తీ చేసేందుకు అత్యవసరంగా ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
అధునాతన వైద్య సదుపాయాల కల్పన
క్రిటికల్ కేర్ బ్లాక్‌లో రోగుల సౌకర్యార్థం అత్యవసరంగా ర్యాంప్ ఏర్పాటు చేయడానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అలాగే 5 నుంచి 10 పడకల సామర్థ్యంతో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, కంటి సంబంధిత శస్త్రచికిత్సల కోసం క్రిటికల్ కేర్ బ్లాక్‌లో ఆధునిక ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా ప్రజలకు అత్యధునిక వైద్య సేవలు అందుబాటులోకి రావాలంటే ఎంఆర్‌ఐ యంత్రాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక పరిశోధన కేంద్రం
ములుగు వంటి ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో తలసేమియా, సికిల్ సెల్ అనీమియా, హీమోఫీలియా వంటి వ్యాధులు అధికంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఈ వ్యాధులపై ప్రత్యేక అధ్యయనం, నిర్ధారణ, చికిత్స కోసం ములుగు జిల్లాలో ఒక ప్రత్యేక పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని మంత్రి సీతక్క వైద్య ఆరోగ్యశాఖ మంత్రిని కోరారు. ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో కనిపించే ప్రత్యేక ఆరోగ్య సమస్యలపై శాస్త్రీయ పరిశోధనలు నిర్వహించడం ద్వారా వ్యాధులను ముందుగానే గుర్తించి, బాధితులకు మెరుగైన చికిత్స అందించే అవకాశం ఉంటుందని ఆమె వివరించారు. ఈ పరిశోధన కేంద్రం ద్వారా ఆదివాసీ గిరిజనుల ఆరోగ్య పరిస్థితులపై సమగ్ర అధ్యయనం చేసి, దీర్ఘకాలిక వైద్య కార్యాచరణ రూపొందించవచ్చని తెలిపారు.జిల్లా ప్రజలు, ముఖ్యంగా మారుమూల ఆదివాసీ గిరిజన గ్రామాల ప్రజలు మెరుగైన వైద్య సేవల కోసం ఇతర జిల్లాలకు వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ని అన్ని విధాలుగా బలోపేతం చేయాలని కూడా సీతక్క కోరారు. తన వినతిపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. సంబంధిత అంశాలను పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకునేలా అధికారులకు సూచిస్తామని హామీ ఇచ్చారన్నారు.
———————————————————————————————————————————————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





