సమ్మె యోచన విరమించండి

– చర్చలకు మా తలుపులు తెరిచే ఉన్నాయి
– ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం వినతి

హైదరాబాద్, ప్రజాతంత్ర ఏప్రిల్ 14: ఆర్టీసీ పరిరక్షణ – ప్రజల ప్రయోజనాల దృష్ట్యా సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రోడ్డు రవాణా సంస్థ కార్మికులకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుందామని కార్మికులకు పిలుపునిచ్చారు. సమస్యలు చెప్పుకోవడానికి తమ తలుపులు తెరిచే ఉన్నాయి.. ఎవరైనా వచ్చి తమ సమస్యలు చెప్పుకోవచ్చునని కార్మికులకు సూచించారు. ఆర్టీసీ విలీనం, కార్మిక సంఘాల అంశాలు ప్రభుత్వ పరిధిలోనే ఉన్నాయన్నారు. ఆర్టీసీ విలీనానికి సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీ పనిచేస్తున్నదని ఈ సందర్భంగా మంత్రి పొన్నం గుర్తు చేశారు. తమ డిమాండ్ల నెరవేరని పక్షంలో ఏప్రిల్ 22వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ సోమవారం ప్రకటించింది. 21వ తేదీ అర్థరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులు నిలిపివేస్తామని స్పష్టం చేసింది. ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని కార్మిక శాఖ కార్యాలయంలో ఆ శాఖ ఉన్నతాధికారులతో ఆర్టీసీ జేఏసీ నేతలు సోమవారం సమావేశమయ్యారు. అనంతరం ఆర్టీసీ జేఏసీ నేతలు మాట్లాడుతూ ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఆర్టీసీ సంస్థ నుంచి అధికారులు రాలేదని తెలిపారు. అయితే ఆర్టీసీ యాజమాన్యం నుంచి లేఖ మాత్రం వచ్చిందన్నారు. కార్మికుల సమస్యలు ప్రభుత్వం పరిధిలో ఉన్నాయని యాజమాన్యం స్పష్టం చేసిందన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, కార్మిక సంఘాలకు ఎన్నికలు సహా మరో 30 డిమాండ్లతో సమ్మెకు వెళ్తున్నట్లు జేఏసీ నేతలు ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పైవిధంగా స్పందించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *