కాలం వ్యంగ్యమై చెప్పిన కథ

చెమ్మ : వారాల ఆనంద్

రచయిత నందిగం కృష్ణారావు అనగానే కోర్టులు, న్యాయవాదులు, క్లైంట్లు, పోలీసులు వారి నడుమ నలిగిపోయే ప్రజలు గుర్తొస్తారు, కేసులు, చట్టాల్లోని లొసుగులు, పోలీసులు చేసే అరాచకాలు, న్యాయవాదుల ఎత్తుగడలు అన్నీ మన కళ్ళముందు కదలాడుతాయి. రాజ్యాంగం పరిధిలోనే జరిగే అన్యాయాలు అక్రమాలూ తమ ముసుగులని విప్పుకుని మనలో కోపం తెప్పిస్తాయి ఆవేశాల్ని రగిలిస్తాయి. అంతేకాదు తెలుగు సాహిత్యంలో వ్యంగ్యాన్ని సామాజిక విమర్శకు శక్తివంతమైన సాధనంగా మలిచిన రచయితల్లో నందిగం కృష్ణారావు ముఖ్యుడు. తెలుగు జీవితాల్లో సాహిత్యంలో హాస్యం వ్యంగ్యం దాదాపు కనిపించకుండాపోతున్న తరుణంలో నందిగం రచనలు గొప్ప ఊరట. ఆయన రచనల్లో పాత్రలు మనముందు నిలబడి పలకరిస్తాయి, ఏడుస్తాయి, కోపం తెచ్చుకుంటాయి మనల్ని కోపం తెచ్చుకునేలా చేస్తాయి. సామాజిక వ్యంగ్యం చాలాసార్లు చాలా కఠినంగా ఉంటుంది. దానిలోని నవ్వు కొన్నిసార్లు ఎంతో క్రూరంగా కూడా అనిపించవచ్చు. కానీ కృష్ణారావు వ్యంగ్య రచన వెనుక సాటిమనిషి పట్ల బాధ్యత, అతని అవమానంపై ఆవేదన ఉంటాయి. నందిగం కృష్ణారావు రచనల్లో ప్రసిద్ధమైనది ‘మరణానంతర జీవితం’ నవల. మరో ముఖ్యమైన నవల ‘చీకట్లో నల్లపిల్లి’ విప్లవోద్యమం పట్ల సానుభూతి కలిగిన విద్యార్థుల జీవితాలను చిత్రించిన రచనగా నిలబడింది. ఇంకా కథా రచయితగా ఆయన నాలుగు కాళ్ల న్యాయం కథా సంపుటి వెలువరించారు.

 

ఆయన రాసిన ‘మరణానంతర జీవితం’ నవలలో మరణం అంటే ఒక మనిషి ప్రపంచాన్ని చూడటం ఆగిపోవడమా, లేక ప్రపంచం ఆ మనిషిని చూసే విధానం మారిపోవడమా అన్న ప్రశ్న ఉదయిస్తుంది. మనిషి చనిపోతాడు. కానీ అతని మరణం చుట్టూ వున్న సమాజం బతుకుతూనే ఉంటుంది. కన్నీళ్లు కారుస్తుంది. లెక్కలు వేస్తుంది. ఆచారాల్ని పూజలని నిర్వహిస్తుంది. అధికారిక పత్రాలు తయారుచేస్తుంది. చట్టం తనపని తాను చేసుకుపోతుంది. ఆ క్రమంలో దాని నిజస్వరూపాన్ని స్పష్టంగా బయటపెడుతుంది.

 

నిజానికి మరణం ఒక వ్యక్తి జీవితానికి ముగింపు అయితే కావచ్చు. కానీ అతని మరణం చుట్టూ జరిగే సంఘటనలు సమాజంలోని అనేక ముఖాల్ని బయటపెడతాయి. దుఃఖం, ఆచారం, అధికారం, డబ్బు, కుటుంబ సంబంధాలు, పోలీసు వ్యవస్థ, వైద్యవ్యవస్థ, న్యాయప్రక్రియ  ఇవన్నీ ఒకశవం చుట్టూ తిరుగుతున్నప్పుడు మనిషి అసలు స్వరూపం ఏమిటో మరణానంతర జీవితం నవలలో రచయిత నందిగం కృష్ణారావు తన వ్యంగ్యపు టార్చ్ లైటు వెలుగులో చూపిస్తారు.

 

‘కాలం జీవమై శవంలోకి ప్రవేశించి, శవం సజీవంగా కథ చెప్పడం మొదలుపెట్టింది’ అంటూ కృష్ణారావు మొదలుపెట్టిన ‘మరణానంతర జీవితం’ మరణం చుట్టూ తిరిగే సంఘటనల ద్వారా బతికున్న సమాజంలోని విలువలను ప్రశ్నించే నవల. బతికున్నప్పుడు మనిషికి తనదయిన మాట అంటూ ఒకటి ఉంటుంది. తన ఇష్టం అంటూ కూడా ఉంటుంది. తన నిర్ణయాలూ ఉంటాయి. కానీ మరణించిన తరువాత అతని తరఫున మాట్లాడేవారు అనేకమంది తయారవుతారు. అతని డెడ్ బాడీని ఎలా చూడాలి, అంత్యక్రియలు ఎప్పుడు జరపాలి, ఏ ఆచారాలు పాటించాలి, ఏ పత్రాలు సిద్ధం చేయాలి, ఏ పరిహారం పొందాలి  ప్రతి ఒక్కరికీ ఒక్కో అభిప్రాయం, ప్రయోజనం, బాధ్యత, అయితే ఆ హడావుడిలో మరణించిన వ్యక్తిపట్ల గౌరవం, అతని కుటుంబం పట్ల సానుభూతి మృగ్యమవుతాయి. సరిగ్గా ఇక్కడే మరణం ఒక విషాద సంఘటన నుంచి సామాజిక అంశంగా మారుతుంది.

 

స్వార్థం ఎప్పుడూ బహిరంగంగా కనిపించదు. అది బాధ్యత రూపంలోనో, సంప్రదాయం రూపంలోనో, న్యాయం పేరుతోనో, కుటుంబ గౌరవం పేరుతోనో, మత విశ్వాసం పేరుతోనో తన ఉనికిని చాటుకోవచ్చు. మనిషికి సహాయం చేస్తున్నామనే భావన కలిగిస్తూనే, అతని బలహీనతను ఉపయోగించుకునే సందర్భాలూ ఉంటాయి. మరణం ఒకవ్యక్తి జీవితానికి ముగింపు కావచ్చు. కానీ అతని మరణం చుట్టూ జరిగే సంఘటనలు కుటుంబ విలువలను, అధికార వ్యవస్థల స్వభావాన్ని, చట్టం పరిమితులను, మనుషుల స్వార్థాలను మనముందుకు తెస్తాయి.

 

‘మరణానంతర జీవితం’ నవలలో ప్రమాదంలో మరణించిన సురేందర్ రెడ్డి, అతని భార్య స్వప్న, పిల్లలు కథకు ప్రధాన మానవీయ కేంద్రం. ఒక మధ్యతరగతి కుటుంబం ఎదుర్కొనే ఆర్థిక అభద్రత, బంధువుల నిర్లక్ష్యం, ప్రమాదంవల్ల జరిగిన మరణం తరువాత మొదలయ్యే అధికారిక వ్యవహారాలు కథను ముందుకు నడిపిస్తాయి. ఈ నవలలో స్వప్న పాత్రను ప్రత్యేకంగా గుర్తించాలి. భర్తను కోల్పోయిన ఆమెకు దుఃఖాన్ని అనుభవించే ప్రశాంతత కూడా దక్కదు. భర్త మరణంతో ఏర్పడిన సంక్షోభాన్ని ఎదుర్కోవాలి. పిల్లలను చూసుకోవాలి. అత్తమామల ప్రవర్తనను భరించాలి. భర్తశవాన్ని ఇంటికి తీసుకురావడం నుంచి అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అనేకమంది మధ్య తనను తాను నిలబెట్టుకోవాలి. ఆమె వ్యక్తిగత విషాదం చుట్టూ ఇతరుల ప్రయోజనాలు తిరుగుతుంటాయి. కొందరు బీమా పరిహారం కోసం ఆలోచిస్తారు. మరికొందరు న్యాయపరమైన వ్యవహారాల్లో తమవాటాను వెతుక్కుంటారు. ఇంకొందరు సంప్రదాయాల పేరుతో నిర్ణయాలు తీసుకుంటారు.

 

ఇక్కడ రచయిత ఒక మహిళ దుఃఖాన్ని మాత్రమే చిత్రించడు. ఆ దుఃఖానికి సమాజం ఇచ్చే ప్రతిస్పందనలోని అసమానతను కూడా చూపిస్తాడు. పురుషుడు మరణించినప్పుడు అతనిభార్యకు అండగా నిలవాల్సిన కుటుంబం, సమాజం, వ్యవస్థలు ఆమెను మరింత బలహీనురాలిని చేస్తే, ఆ విషాదం వ్యక్తిగతంగా మిగలదు. అది సామాజిక సమస్యగా విమర్శగా మారుతుంది. నిజానికి శవానికి జరిపే పోస్టుమార్టం అనేది మరణానికి సంబంధించిన వాస్తవాలను తెలుసుకునే వైద్య ప్రక్రియ. కానీ నవలలో ఈ ప్రక్రియ చుట్టూ ఏర్పడే సంఘటనలు వైద్యవృత్తిలోని నైతికతను రచయిత ప్రశ్నిస్తాడు. మరణించిన తర్వాతకూడా మనిషి శరీరానికి గౌరవం అవసరం. మరణించిన వ్యక్తి తనహక్కులను తానే కాపాడుకోలేడు కాబట్టి అతని శరీరాన్ని, మరణానికి సంబంధించిన ఆధారాలను మరింత బాధ్యతతో నిర్వహించాలి. అటువంటి చోట కూడా పలువురి వ్యక్తిగత ప్రయోజనాలు ముందుకు వస్తాయి. రచయిత వ్యంగ్యం ఇక్కడ పతాక స్థాయికి చేరుతుంది.

 

ప్రమాదంలో మరణించిన వ్యక్తి  కుటుంబానికి ఇప్పుడు కావలసింది నిజం, న్యాయం, మానవీయమైన సహాయం. కానీ ఈ అవసరాల చుట్టూ అనేక ప్రయోజనాలు చేరినప్పుడు విషాదం ఒక వ్యాపార సంబంధంగా మారుతుంది. న్యాయవాదులు, పోలీసులు, వైద్యులు, బీమా వ్యవహారాల్లో మధ్యవర్తులు, అంత్యక్రియల సందర్భంలో నిర్ణయాలు తీసుకునే వ్యక్తులు వీరిలో ఎవరి పాత్ర ఎలా ఉంటుందో రచయిత కృష్ణారావు అత్యంత వ్యంగ్యాత్మకంగా మనముందుకు తెస్తారు. మన సమాజంలో వ్యవస్థలు ప్రజలకు సేవ చేయడానికి ఏర్పడ్డాయి. కానీ వాటి కార్యకలాపాల్లో మనిషి అన్నవాడు తప్పిపోయి, ఫైలు, కేసు, పరిహారం, ఫీజు, ఆచారం మాత్రమే కేంద్రంగా మిగిలితే, వ్యవస్థ తన ఉద్దేశాన్ని కోల్పోతుంది. ఈ నేపధ్యంలో నందిగం కృష్ణారావు ‘మరణానంతర జీవితం’ మనల్ని మరణం గురించి మాత్రమే ఆలోచింపజేయదు. మనం బతుకుతున్న విధానం గురించి కూడా ప్రశ్నిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *