మిస్‌ఫైర్‌ అయిన ‘హిట్లర్‌’ ‌పోలిక

( మండువ రవీందర్‌రావు )

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ‘హైడ్రా’ పైన చేసిన వ్యాఖ్య మిస్‌ ‌ఫైర్‌ అయింది. రాష్ట్రంలో ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేసినప్పుడు ఎంత చర్చనీ యాంశమైందో, ఇప్పుడు హైడ్రాను ఏ స్పూర్తితో ఏర్పాటు చేసానంటూ వివరించే ప్రయత్నం చేసిన సీఎం వ్యాఖ్యలు అంతకన్నా వివాదస్పదంగా మారాయి. హైడ్రా ఏర్పాటుపై రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా నేటికీ తీవ్రస్థాయిలో చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పుడు దానికి ‘హిట్లర్‌’ ‌పోలిక తోడైంది.

    హిట్లర్‌ ‌స్ఫూర్తితోనే తెలంగాణలో తాను హైడ్రా(హైదరాబాద్‌ ‌డిజాస్టర్‌ ‌రెస్పాన్స్ అం‌డ్‌ అసెట్‌ ‌ప్రొటక్షన్‌ ఏజన్సీ) ని ఏర్పాటు చేసినట్లు బెంగుళూరులో ‘ది హిందూ’ పత్రిక నిర్వహించిన ‘హిందూ హడిల్‌ ‌సదస్సు’లో ‘ప్రజలచే, ప్రజలకోసం… తెలంగాణ సుపరిపాలన’ అంశంపై మాట్లాడిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. జర్మనీ నియంత అడాల్ఫ్ ‌హిట్లర్‌ ‌స్ఫూర్తిని పొందడమేంటన్న విషయంలోనే చర్చోపచర్చలు జరుగుతున్నాయి. దాదాపు దశాబ్ధానికిపైగా జర్మనీని ఏలిన నాజీ పార్టీ వ్యవస్థాపకుడు హిట్లర్‌ ‌దాదాపు అరవై లక్షల మంది యూదులను ఊచకోత కోసిన వ్యక్తి ఎలా స్ఫూర్తిదాయకమవుతాడన్నదే చర్చ జరుగుతున్నది. జర్మనీ సరిహద్దులను పెంచుకునేందుకు ఆస్ట్రీయా, పోలెండ్‌, ‌చెక్‌ ‌రిపబ్లిక్‌లపై దండయాత్రలు చేయడం ద్వారా రెండవ ప్రపంచ యుద్ధానికి కారకుడైన వ్యక్తి హిట్లర్‌. అనేక మంది యూదులను గ్యాస్‌ ‌చాంబర్‌లలో బంధించి , చిత్రహింసలకు గురిచేసిన వ్యక్తి అతడు. ప్రపంచ నియంతల్లో మొట్టమొదట పేర్కొనేపేరు  హిట్లర్‌దే. అలాంటి హిట్లర్‌కు చాలా ఇష్టమైన పదం హైడ్రా అంటారు మన ముఖ్యమంత్రి.
అతని ప్రధాన బృందానికి ‘హైడ్రా’ అని నామకరణం చేసిన  విషయాన్ని( అలాంటిదేమీ లేదంటారు చరిత్రకారులు) గుర్తు చేస్తూ, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో అనేక ప్రభుత్వ స్థలాల దురాక్రమణ జరుగుతున్నదని వాటిని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదన్నారు.  చెరువులు, కుంటలతోపాటు అక్రమ కట్టడాలను నిరోధించడం , విపత్తుల నిర్వహణ అన్నది ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. అందుకే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీని ఏర్పాటు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విమర్శలకు దారి తీసింది. విపక్షాలు దీన్ని తీసుకుని బుల్డోజర్‌ ‌పాలన అంటూ విమర్శించాయి. నిరుపేదవర్గాలకు చేయూతనివ్వాల్సిన ప్రభుత్వం వారినే టార్గెట్‌ ‌చేస్తున్నదన్న విమర్శలను హైడ్రా ఎదుర్కుంటు న్నది. నోటీసులు ఇవ్వకుండానే ఇండ్లు కూల్చి వేయడం, కనీసం నిత్యావసర వస్తువులను కూడా తీసుకోనివ్వకపోవడం లాంటి సంఘటనలు జరిగాయి. ప్రభుత్వ అనుమతితో ఇండ్లు నిర్మించుకుని, దశాబ్దాలుగా పన్నులు చెల్లిస్తున్న తమ ఇండ్లను నిర్ధాక్షిణ్యంగా కూలుస్తున్నారంటూ నిరుపేద, మద్యతరగతికి చెందిన పలువురి గోడు, అర్తనాథాలు నిత్యం ఎలక్ట్రానిక్‌ ‌మీడియాలో ఎక్కడో ఒక దగ్గర వినిపిస్తూనే ఉన్నాయి. ఈ విషయంలో ఉన్నత న్యాయస్థానం హైడ్రాను, దానికి సారథ్యం వహిస్తున్న ఐపిఎస్‌ అధికారిని పలుసార్లు చివాట్లు పెట్టిందికూడా. ఇంకా న్యాయస్థానంలో పలు కేసులు కొనసాగుతున్నాయి.
    ఇదిలాఉంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని హైడ్రా కుంగదీస్తున్నదన్న ఆరోపణలూ ఉన్నాయి. రియల్‌ఎస్టేట్‌ ‌రంగం దీనివల్ల కుదేలైందని ఆ రంగంలోని పలువురు వాపోతున్నారు. ఇంతలా విమర్శలు వస్తున్నా బెంగుళూరు సదస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రి పూర్తిస్థాయిలో దీన్ని సమర్థించుకున్నారు. హైడ్రా ఏర్పాటు చేయడం వల్ల కబ్జాకు గురైన 2వేల 182 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవడం ద్వారా ప్రభుత్వానికి 80 వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడగలిగామని చెప్పుకొచ్చారు. ఇవ్వాళ హైడ్రా ద్వారా కఠిన చర్యలు తీసుకోవడం వల్లే  కబ్జాదారులకు వణుకు పుట్టిస్తున్నదని, ఇక ముందెవరూ ధైర్యంచేసి కబ్జాలకు పాల్పడే అవకాశమేలేదని, అలా భయం కలిగించే  ఏజన్సీ కాబట్టే దీనికి హైడ్రాగా నామకరణం చేయడమైందన్నారు సిఎం రేవంత్‌రెడ్డి.
     అయితే హైడ్రా విషయం ఎలా ఉన్నా హిట్లర్‌ ‌స్ఫూర్తిదాయక మనడంపైన మాత్రం తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఇది కాంగ్రెస్‌ ‌మనస్తత్వానికి నిదర్శనమని బిజెపి ఘాటైన ఆరోపణ చేసింది. నాటి ఎమర్జెన్సీ మొదలు జర్నలిస్టులు, విద్యార్థుల అరెస్టులవరకు కాంగ్రెస్‌ ‌వైఖరి అలానే ఉందన్నారు. బిజెపి అధికార ప్రతినిధి షెహజాద్‌ ‌పూనావాలా, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు దీన్ని నియంతృత్వానికి నిదర్శనంగా అభివర్ణించారు. కాంగ్రెస్‌ ‌మొదటినుండి హిట్లర్‌ మాదిరిగానే ప్రజల గొంతును నొక్కుతూనే ఉందన్నారు. కోట్లాది మందిని ఊచకోత కోసిన హిట్లర్‌ ఆదర్శంగా చెప్పుకోవడాన్ని బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్  ‌కెటిఆర్‌ ‌తన ట్విట్టర్‌లో తీవ్రంగా ఆక్షేపించారు. మొన్న ప్రజాపాలన అన్నారు. నిన్న ఇందిరమ్మ పాలన అన్నారు. ఇప్పుడు హిట్లర్‌ ‌పాలనా? అని ఆయన ప్రశ్నించారు. హైడ్రా కూల్చివేతలు.. మూసీ ప్రక్షాళన.. లగచర్లనుంచి వెలుగుమట్ల వరకు పేద ప్రజలపై బుల్డోజర్‌ ‌నడపడం నయా నాజీ పాలనను తలపిస్తున్నదని  కెటిఆర్‌ ‌విమర్శించారు. హిట్లర్‌ ‌స్ఫూర్తి అనడం.. విధ్వంసమే తమ పాలన అని నిర్లజ్జగా చెప్పడమేనంటారు కెటిఆర్‌. ‌కాంగ్రెస్‌ ‌పాలన ఇలానే ఉంటుందన్న విషయం రాష్ట్ర ప్రజలకు ముందే తెలుసని, అయితే ఇవ్వాళ రాష్ట్ర ముఖ్యమంత్రే స్వయంగా దానిపై స్పష్టత ఇచ్చారంటున్న కెటిఆర్‌ ‘‌హిట్లర్‌ ‌హటావో.. తెలంగాణ బచావో’ నినాదాన్నిచ్చారు. మొత్తంమీద సిఎం హిట్లర్‌ ‌వ్యాఖ్యలు గల్లీ నుంచి దిల్లీ వరకు రాజకీయ వర్గాల్లో ప్రధాన చర్చగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *