తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల కాష్టం రగిలిస్తున్న కేంద్ర ప్రభుత్వం

 “మరోవైపు గతంలో ప్రతిపాదన చేసినట్లు తెలంగాణ భూభాగంతో నిమిత్తం లేకుండా గోదావరి జలాలు తరలిపోతాయని బిఆర్ఎస్ నేత హరీష్ రావు వాదన లో వాస్తవం ఉంది. ఇంతకీ తెలంగాణ దక్కేది 41  టీఎంసీ  లే. కేంద్ర ప్రభుత్వంతో కేసీఆర్ పోట్లాడి 1956 అంతర్ రాష్ట్ర జలవివాద చట్టం క్రింద ట్రిబ్యునల్ నియామకం సాధించారు. తెలంగాణ వాదనలు పూర్తయ్యాయి. ఆంధ్ర ప్రదేశ్ వాదనలు పూర్తి కావొస్తోంది. ఈ దశలో ట్రిబ్యునల్ వెలుపల రెండు రాష్ట్రాలు ఒప్పందం చేసుకొంటే ట్రిబ్యునల్ తీర్పు ఏ విధంగా ఉంటుందో ఎవరూ చెప్పలేరు..”  

దేశంలో వివిధ రాష్ట్రాల మధ్య ఏర్పడే నదీజలాల వివాదాలను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించ వలసి ఉంది. కానీ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత తను సుస్థరమయ్యేందుకు రాష్ట్రాల మధ్యనే తంపులు పెడుతోంది. రాజకీయ ప్రయోజనం ప్రధాన లక్ష్యంగా ఎంచుకొంటోంది. మరీ దక్షిణ భారత దేశంలో కేంద్ర ప్రభుత్వం వికృత క్రీడ వెర్రి తలలు వేస్తోంది. కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు శాసనసభ ఎన్నికల ముందు అప్పర్ భద్ర పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు వ్యతిరేకించినా పట్టించు కోలేదు. ఎనిమిది మంది కేంద్ర ప్రభుత్వం కార్యదర్శులు అగమేఘాల మీద సమావేశమై ఆమోదం తెలిపారు. ఇలాంటివి ఎన్నైనా చెప్పవచ్చు.కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుండి తమిళనాడులో పాగా వేసేందుకు ఏ దుర్ముహూర్తాన గోదావరి కావేరి అనుసంధాన పథకానికి శ్రీకారం చుట్టారో ఏమో గాని అన్నీ విఘ్నాలే.

కెసిఆర్ హయాం నుండి గోదావరి కావేరి అనుసంధానం గురించి కేంద్ర ప్రభుత్వం ఎడతెగని ప్రయత్నాలు చేసింది. నదుల అనుసంధానం తలకెత్తుకున్న జాతీయ జల అభివృద్ధి సంస్థ దక్షిణ భారతదేశంలో ప్రతిపాదించిన తొమ్మిది అనుసంధానాల్లో మొదటిదైన మహానది గోదావరి అనుసంధానం చేపట్టిన తర్వాతనే గోదావరి కావేరి అనుసంధానం చేపట్టాలని కెసిఆర్ పట్టుబట్టడంతో కేంద్ర ప్రభుత్వయత్నాలకు కొన్నాళ్లు బ్రేక్ పడింది. వాస్తవం చెప్పాలంటే కేసీఆర్ పట్టుబట్టినందున (ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి మారు మాట్లే వారు కాదు) అప్పట్లో కేంద్ర ప్రభుత్వం పప్పులుడక లేదు. తదుపరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మెత్త బడలేదు. దఫాలు వారిగా వివిధ షరతులు విధించడంతో గోదావరి కావేరి అనుసంధానం ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉండి  పోయింది.

అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బనకచర్ల అనుసంధానం ప్రతిపాదన తీసుకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమ్మక్క బ్యారేజీ నుండి గోదావరి కావేరి అనుసంధానానికి అంగీకరించారు. తర్వాతనే కొంత కదలిక ఏర్పడింది. ఇంతకీ కేంద్ర జలసంఘమే గోదావరిలో మిగులు జలాలు లేవని స్పష్టం చేసిన పూర్వ రంగంలో కేంద్ర ప్రభుత్వం ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం ఉపయోగించుకొనని 141 టిఎంసిలను సమావేశాల్లో ప్రతి పాదించుతోంది. . గమనార్హమైన అంశమేమంటే గతంలో ఛత్తీస్ ఘడ్  లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్నా  తాము ఉపయోగించుకొనని నీళ్లు ఇచ్చేందుకు ఛత్తీస్ ఘడ్ అంగీకరించడం లేదు.

మరీ బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంద్రావతి నదిపై బోధ్ ఘాట్ బహుళార్థ సాధక ప్రాజెక్టు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం అనుమతి కూడా లభించింది. కానీ దుర్మార్గ మేమంటే ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం పథకం అమలు లోనికి వచ్చే వరకు దాని వాటా నీళ్లు ఉపయోగించుకొంటామని చెప్పడమే. రాష్ట్రాల అధికారాల్లో కేంద్ర ప్రభుత్వం చొరబడే దురాగతానికి ఇంతకన్నా నిదర్శనం కావాలనా? ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం గోదావరి వరద జలాల ఆధారంగా ప్రతిపాదించిన బనకచర్ల అనుసంధానం డీపీఆర్ ను ఆమోదించే అవకాశాలు కేంద్ర జల సంఘానికి కనిపించ లేదు. దేశంలో ఇంత వరకు వరద జలాలు ఆధారంగా ఒక్క ప్రాజెక్టుకు డీపీఆర్ ను కేంద్ర జల సంఘం ఆమోదించ లేదు.

అయితే కేంద్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకున్న పరపతి మేరకు కేంద్ర జల సంఘం జిమ్మీక్కులు మొదలు పెట్టినది. రెండు ప్రతిపాదనలు చేసింది. బహుశా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదంతో కేంద్ర జల శక్తి శాఖ చొరవతో కేంద్ర జల సంఘం ఈ ప్రతిపాదనలు చేసినట్లుంది. ఈ ప్రతిపాదనలను పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం అంగీకరించక పోవచ్చు. ఈ ప్రతిపాదనల్లో ముఖ్యమైన అంశమేమంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం  డీపీఆర్   ఆమోదించడంలో ఆంధ్ర ప్రదేశ్ అడ్డు చెప్ప కూడదు. పైకి గణాంకాల మేరకు పోలవరం వాటా మొత్తం 45 టీఎంసీలు తెలంగాణ కు ఇచ్చేందుకు ఆంధ్ర ప్రదేశ్ అంగీకరించాలి. అందుకు ప్రతిగా సమ్మక్క బ్యారేజీ నుండి 45 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ తీసుకోవాలి. యధావిధిగా ఛత్తీస్ ఘడ్ వాటా నీళ్లతో పోలవరం నుండి కావేరి అనుసంధానం అమలుకు కేంద్ర జల సంఘం ప్రతిపాదించినది.

కాగా తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన మేరకు దిండి కి కూడా అవసరమైన 30 టీఎంసీలు మొత్తం 120  టీఎంసీలు   కృష్ణ జలాలు ఇస్తే తెలంగాణ ప్రభుత్వం బనకచర్ల అనుసంధానం అంగీకరించే ప్రతిపాదన చర్చల్లో నలుగుతున్నట్లుంది.

గోదావరి కావేరి అనుసంధానం తెలంగాణ భూభాగం నుండి లేకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగీకరించుతారా? గతంలో ఒక దఫా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పథకం  డీపీఆర్   ను కేంద్ర జల సంఘం తిప్పి పంపుతూ ఆంధ్ర ప్రదేశ్ అభ్యంతరానికీ తోడు ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు కొత్త ప్రాజెక్టుల  డీపీఆర్   ఆమోదించమని చెప్పింది . మరి ట్రిబ్యునల్ తీర్పు రాకమునుపే ఇప్పుడు కేంద్ర జల సంఘం  డీపీఆర్   ను ఏలా ఆమోదించుతుంది?

ట్రిబ్యునల్ తీర్పు రాక ముందే ఎపి తో ఒప్పందం చేసుకోవడం తెలంగాణ భూభాగం నుండి కాకుండా గోదావరి కావేరి అనుసంధానం అమలు ఆంధ్ర ప్రదేశ్ కు
సుజలాం తెలంగాణకు నిష్పలమని బిఆర్ఎస్ నేత హరీష్ రావు అభివర్ణించారు. వాస్తవంలో ఈ ప్రతిపాదన రెండు రాష్ట్రాలకూ నష్టదాయకమే. ట్రిబ్యునల్ తీర్పు లేకుండా 120 టీఎంసీలకు తెలంగాణకు ఎన్ఓసీ ఇవ్వడం ఆంధ్రప్రదేశ్ తీవ్రమైన నష్టమే. మరోవైపు గతంలో ప్రతిపాదన చేసినట్లు తెలంగాణ భూభాగంతో నిమిత్తం లేకుండా గోదావరి జలాలు తరలిపోతాయని బిఆర్ఎస్ నేత హరీష్ రావు వాదన లో వాస్తవం ఉంది. ఇంతకీ తెలంగాణ దక్కేది 41  టీఎంసీ  లే. కేంద్ర ప్రభుత్వంతో కేసీఆర్ పోట్లాడి 1956 అంతర్ రాష్ట్ర జలవివాద చట్టం క్రింద ట్రిబ్యునల్ నియామకం సాధించారు. తెలంగాణ వాదనలు పూర్తయ్యాయి. ఆంధ్ర ప్రదేశ్ వాదనలు పూర్తి కావొస్తోంది. ఈ దశలో ట్రిబ్యునల్ వెలుపల రెండు రాష్ట్రాలు ఒప్పందం చేసుకొంటే ట్రిబ్యునల్ తీర్పు ఏ విధంగా ఉంటుందో ఎవరూ చెప్పలేరు.కాని ఇక్కడ  ఒక కీలకమైన అంశం ఉంది . రాష్ట్ర విభజన చట్టం 89 మేరకు ట్రిబ్యునల్ విచారణ సాగిస్తున్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పథకం ప్రతిపాదన చేస్తే ట్రిబ్యునల్ నిరాకరించింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పథకం రాష్ట్ర విభజన చట్టం 11 వ షెడ్యూల్ లో లేదని ఈ ప్రాజెక్టు తన విచారణ పరిధిలోనికి రాదని తిరస్కరించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రమాదం దృష్టిలో పెట్టుకుని ఈ ప్రతిపాదనకు సిద్దమైనారా? అయితే బిఆర్ఎస్ నేత హరీష్ రావు ఇరువురు ముఖ్యమంత్రులు గురుశిష్యులని రాజకీయ విమర్శ చేశారు. ఈ విమర్శ వాస్తవానికి చాలా దూరంలో ఉంది .

ఎందుకంటే కృష్ణ జలాలు 120 టీఎంసీ లకు తెలంగాణకు ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా లేదంటున్నారు. ఇంత జరిగినా గోదావరిలో లభించే 45 టీఎంసీ లకు చట్టబద్ధత లేదని మల్లగుల్లాలు పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బిఆర్ఎస్ నేత హరీష్ రావు చెబినట్లు కేంద్ర జల సంఘం చేసిన ఈ ప్రతిపాదనకు ఆంధ్ర ప్రదేశ్ ఎగిరి గంతేసి అంగీకరించే స్థితిలో లేదు.ఏతా వాతా లేలినదేమంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతృప్తి పర్చడం అదే సమయంలో తమిళనాడుకు నీళ్లు ఇవ్వ బోయి సరి కొత్తగా రెండు రాష్ట్రాల మధ్య మరింత కాష్టం రాజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *