– ఇంగ్లీష్ వద్దనడం పేదలను చులకన చేయడమే
– ఇంగ్లీష్ ఒక వారదిలాంటి భాష మాత్రమే
– సీనియర్ నేత రాహుల్ గాంధీ
న్యూదిల్లీ,జూన్20: ఇంగ్లీష్ మాట్లాడే వాళ్లు త్వరలోనే సిగ్గుపడాల్సి వస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ శుక్రవారంనాడు తప్పుపట్టారు. దేశంలోని పేద పిల్లలను ఉన్నత విద్యకు దూరం చేసేందుకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కుట్ర చేస్తున్నాయని అన్నారు. ‘ఇంగ్లీష్ అనేది డ్యామ్ కాదు, ఒక బ్రిడ్జి. ఇంగ్లీష్ అంటే సిగ్గు కాదు, పవర్. ఇంగ్లీషు అనేది ఒక చైన్ కాదు, చైన్‌లను బ్రేక్ చేసే పరికరం. ఇండియాలోని పేద పిల్లలు ఇంగ్లీష్ చదువుకోవడం బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌కు ఇష్టం లేదు. వాళ్లను ప్రశ్నించేవారు ఉండకూడదని వారు కోరుకుంటున్నారు. తమతో సమానంగా ఎదగడం కూడా వారికి ఇష్టం లేదని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో రాహుల్ పేర్కొన్నారు.
ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రతిరోజూ ఇంగ్లీష్ మాట్లాడవద్దని,హిందీలో మాట్లాడమని చెబుతుం టారని, అయితే ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలోని పిల్లల మాత్రం ఇంగ్లీషు విద్యకు వెళ్తుంటారని, దీని వెనుక కారణమేమిటని రాహుల్ ప్రశ్నించారు. ఎందుకంటే పేద పిల్లలు బోర్డ్ రూముల్లోకి ఎంటర్ కారాదని, అధిక వేతనాలతో కూడిన ఉద్యోగాలు రాకూడదని వారు కోరుకుంటున్నారని అన్నారు. వాళ్లు ఇంగ్లీషు స్కూళ్లకు వెళ్లి కాంటాక్టులు పెంచుకుంటారని, పేద పిల్లలకు మాత్రం తలుపులు మూసేస్తారని ఆక్షేపణ తెలిపారు.సాధికారతకు మాతృభాషతో పాటు ఇంగ్లష్ చాలా అవసరమని, ఇంగ్లీష్ విద్య విద్యార్థులకు ఆత్మవిశ్వా సాన్ని, ఉపాధిని కల్పిస్తుందని రాహుల్ అన్నారు.
దేశంలోని ప్రతి భాష ఆత్మవంటిదని, సంస్కృతి, నాలెడ్జికి ప్రతీక అని అన్నారు. భాషాభివృద్ధి జరగాలని, అదే సమయంలో ప్రతి ఒక్క పిల్లవాడికి ఇంగ్లీష్ బోధించాలని అన్నారు. అప్పుడే ప్రపంచంతో భారత్ పోటీ పడగలుగుతుందని, ప్రతి ఒక్క పిల్లవాడు సమానావకాశాలు పొందగలడని రాహుల్ స్పష్టం చేశారు. తన ఎక్స్ అకౌంట్‌లో హిందీ భాషలో రాహుల్ గాంధీ ఈ పోస్టు చేశారు. ప్రతి భారతీయ భాషకు ఆత్మ, సంస్కృతి, జ్ఞానం ఉన్నాయని, వాటిని ఆదరించాలని, అదే సమయంలో ప్రతి చిన్నారికి ఇంగ్లీష్ భాషను నేర్పాలన్నారు. ప్రపంచంతో పోటీపడాలంటే ఇండియాకు ఇదో మార్గమని, ఇది ప్రతి పిల్లవాడికి సమాన అవకాశం కల్పిస్తుందన్నారు.