– రూ.2.87 లక్షల కోట్ల డివిడెండ్ ప్రకటన
ముంబయి, మే 22: కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గుడ్ న్యూస్ చెప్పింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.2.87 లక్షల కోట్లు డివిడెండ్ రూపంలో చెల్లించనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఆర్‌బీఐ ఏటా మిగులు నిధులను కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో చెల్లిస్తుంది. ప్రస్తుత భౌగోళిక రాజకీయ అనిశ్చిత పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఈ మొత్తం ఊరట కల్పించే అంశం. ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలో ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డు డైరెక్టర్లు నిర్వహించిన 623వ సమావేశంలో డివిడెండ్ చెల్లింపులపై నిర్ణయం తీసుకున్నారు. ఈ స్థాయిలో డివిడెండ్ చెల్లించడం ఇదే తొలిసారి. దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, భయాందోళనల ముప్పును సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌బీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. దేశ, విదేశీ సెక్యూరిటీలపై వడ్డీ, సేవలపై రుసుములు, కమీషన్లు, విదేశీ మారకపు ద్రవ్యం లావాదేవీలపై లాభం, అనుబంధ సంస్థల నుంచి ప్రతిఫలం రూపేణా ఆర్‌బీఐకు ఆదాయం లభిస్తుంది. కరెన్సీ నోట్ల ముద్రణ, డిపాజిట్లు-రుణాలపై వడ్డీల చెల్లింపులు, సిబ్బంది జీతభత్యాలు-పింఛన్లు, కార్యాలయాల నిర్వహణ ఖర్చులు, ఆకస్మిక పరిస్థితులు- తరుగుదలకు కేటాయింపులు వంటి వ్యయాలు ఉంటాయి. ఈ ఆదాయ, వ్యయాల మధ్య తేడానే మిగులు నిధులుగా వ్యవహరిస్తారు. ఈ మిగులు నిధులను కేంద్రానికి ఆర్‌బీఐ ఏటా బదిలీ చేస్తుంటుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల డివిడెండ్ల రూపంలో ఖజానాకు రూ.3.16 లక్షల కోట్లు సమకూరుతాయని బడ్జెట్‌లో ప్రభుత్వం అంచనా వేసింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





