ఎక్స్ వేదికగా వెల్లడించిన ప్రధాని మోదీ
న్యూ దిల్లీ, జూన్ 25: దేశంలో ఎమర్జెన్సీ విధించి జూన్ 25తో 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆనాడు ఎదురైన పరిస్థితులు, ఇబ్బందులపై ’ది ఎఎమర్జెన్సీ డైరీస్’ పేరుతో ప్రత్యేక పుస్తకాన్ని తీసుకొస్తున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ ద్వారా మోదీ వెల్లడించారు. అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు తాను ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తగా ఉన్నట్లు తెలిపారు. ఆ సమయంలో తన ప్రయాణం ఎలా సాగిందో డైరీలో ఉందని చెప్పుకొచ్చారు. ఎమర్జెన్సీ కాలంలో చాలామందికి అనుభవాలు ఉన్నాయని.. ఎన్నో కుటుంబాలు బాధపడ్డాయని గుర్తుచేశారు. ఆనాటి పరిస్థితుల్ని యువతకు అవగాహన కల్పించాలని కోరారు. చీకటి రోజులను సోషల్ మీడియా ద్వారా పంచుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. దేశ చరిత్రలో 1975 నుంచి 1977 వరకు చీకటి రోజులుగా మోదీ అభివర్ణించారు. ఆనాటి పరిస్థితులపై మోదీ తొలి రాజకీయ జీవితంపై బ్లూక్రాప్ట్ డిజిటల్ ఫౌండేషన్ ‘ది ఎమర్జెన్సీ డైరీస్-ఇయర్స్ దట్ ఫోర్‌జ్డ్ ఎ లీడర్‘ పేరుతో కొత్త పుస్తకాన్ని ఆవిష్కరించింది. మోదీ వ్యక్తిగత జీవితం..రాజకీయ ప్రస్థానం..రాజకీయ నిరంకుశత్వాన్ని ప్రతిఘటించడం లో.. ప్రజాస్వామ్యాన్ని రక్షించడంలో మోదీ పాత్ర ఏంటన్న విషయాలు ఈ పుస్తకంలో పొందిపరిచారు. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయంలో ఎమర్జెన్సీని ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తగా మోదీ ఎలా ఎదుర్కొన్నారో.. వాటి గురించి వివరణాత్మకంగా పుస్తకంలో ఉన్నాయని బ్లూక్రాప్ట్ డిజిటల్ ఫౌండేషన్ వెల్లడించింది. ఇక మోదీ తో సన్నిహితంగా మెలిగిన వ్యక్తుల అభిప్రాయాలను కూడా ఇందులో పొందిపరిచారు. దేశంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి గురించి ఇలా పుస్తకం ముద్రించడం మొదటి ప్రయత్నంగా పేర్కొంది.