ఈ రోజు బాబు, పవన్ కు కొత్త స్లోగన్ దొరికింది. మునుపెన్నడూ ఆంధ్రాలో ఈ స్లోగన్‌ను ఎవరూ వాడలేదు. కొత్త నినాదమిది. జనంలోకి సులువుగా వెళుతుంది. అదే సనాతన ధర్మం. ఆంధ్రాలో సనాతన ధర్మం ప్రమాదంలో పడిందనే నినాదం నిజంగా ఆకర్షణీయమైన నినాదంగా మారుతోంది. ఈ రోజు హిందుత్వ రాజకీయాలను నడిపేందుకు ఈ ఇద్దరు నేతలు బ్రాండ్ అంబాసిడర్లుగా మారుతున్నారు. గతంలో విపక్షంలో ఉన్నప్పుడు కూడా ఈ ఇద్దరు నేతలు హిందూ దేవాలయాలు ధ్వంసమయ్యాయంటూ జగన్ సర్కార్‌పై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మతమార్చిడులను ప్రోత్సహిస్తున్నారని, తిరుమల కొండపై కూడా క్రైస్తవ మత ప్రచారం చేయిస్తున్నారని ఈ ఇద్దరు నేతలు విమర్శలు చేశారు.
మతం, రాజకీయాలు కలగాపులగంగా కలిసిపోయినప్పుడు ఏమి మాట్లాడినా కష్టమే. ఒక్కోసారి రామా అంటే కూడా అపార్థం చేసుకుంటారు అంటే ఇదేనేమో. మత రాజకీయాల బురద అంటుకుంటే ఆ ఊబిలో కూరుకుపోతారు. జనసేనాని, ఆంధ్ర రాజకీయాల్లో హవా నడిపించుకుంటున్న ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ అసెంబ్లీలో అడుగుపెడితే చాలనుకున్నారు. చెగువీరా తనకు ఆదర్శమన్నారు. చివరకు హిందూ జాతీయవాదం కోచ్‌లో హాయిగా ప్రయాణం చేస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా ఉత్తరాదికే పరిమితమైన సనాతన ధర్మ అనే పదాన్ని తరచుగా ఉపయోగిస్తూ జనంలోకి వెళుతున్నారు. సనాతన ధర్మమంటే ఏమి ? దీనిని ఎలా నిర్వచిస్తారనే విషయం పక్కన పెడదాం. సనాతన ధర్మం గురించి చర్చించేందుకు వేరే వేదికలు ఉన్నాయి. ఈ రోజు సనాతన ధర్మమంటూ హైందవ సమాజాన్ని తాను రక్షించేందుకు పుట్టుకొచ్చిన నయా రక్షకుడిననే అర్థం స్ఫురించే విధంగా ప్రకటనలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లడ్డూ కల్తీ అయిందని వివాదాన్ని తెరపైకి తెచ్చారు. ఈ వివాదం ఈ రోజు దేశ సరిహద్దులు దాటింది. లడ్డూని శ్రీవారి ప్రసాదం అని భక్తితో భక్తులు ఆరగిస్తారు. ఎన్టీఏ కూటమిలో భాగస్వామి పవన్ కల్యాణ్ మాత్రం సనాతన ధర్మం పేరును పదే పదే ప్రస్తావిస్తూ దేవాలయాల పవిత్రతకు విఘాతం కలిగితే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు.
తిరుపతి లడ్డూ అపవిత్రమైందనే సమాచారం యావత్తు హిందూ సమాజాన్ని కలిచివేసింది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. నిజానిజాలు ఆ దేవ దేవుడికి తెలియాలి. కాగా ఈ అంశంపై పవన్ కల్యాణ్ మానసికంగా గాయపడ్డారని, కలత చెందారని చెప్పవొచ్చు. అందుకు పవన్ చేస్తున్న ప్రకటనలే తార్కాణం. సనాతన ధర్మ రక్ష బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. హిందూ ధర్మాన్ని మత సంప్రదాయాలను, దేవాలయాల పవిత్రతను పరిరక్షించేందుకు సనాతన ధర్మ రక్షణ బోర్డు కావాలని పవన్ కల్యాణ్ కోరుకుంటున్నారు. శ్రీవారి ప్రసాదం అపవిత్రం కావడంపై కలత చెందిన పవన్ కల్యాణ్ 11 రోజుల ప్రయాశ్చిత దీక్షను ప్రారంభించారు. చివరి రోజు ఆయన తిరుమల ఏడుకొండలు మెట్లెక్కి శ్రీవారి సందర్భించుకుని దీక్షను విరమిస్తారు.
తిరుపతి లడ్డూ ఎంత రుచికరంగా ఉంటుందో , ఆధ్యాత్మికంగా శోభాయమానాన్ని కల్పిస్తుందో, భక్తికి నిదర్శనమో, వివాదాలు కూడా అంతే స్పీడుగా చుట్టుముడుతున్నాయి. తిరుపతి లడ్డూలో రాజకీయాల వివాదాలు ఎప్పుడూ చేరి ఉంటాయి. బీజేపీ ప్రత్యేక హోదా కల్పించకలేపోయిందంటూ పాచిపోయిన లడ్డూలను ఆంధ్రాకు ఇచ్చారని పవన్ కల్యాణ్ నిందించడం తెలిసిన విషయమే. ఈ పాచి పోయిన లడ్డూలను స్వీకరించాలా లేదా అనేది చంద్రబాబు నిర్ణయించుకోవాలని ఐదేళ్ల క్రితమే వవన్ కల్యాణ్ చేసిన ప్రకటనను మనం మర్చిపోలేదు. సనాతన ధర్మం ప్రమాదంలో పడలేదు. కాని సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పవన్ కల్యాణ్ బలమైన సందేశాన్ని ఇచ్చారు. ఈ రోజు సనాతన ధర్మం గురించి తీవ్రమైన ప్రకటనలు చేస్తున్న పవన్ కచ్చితంగా వైకాపా చీఫ్, మాజీ సీఎం జగన్‌ను టార్గెట్ చేస్తున్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. జగన్ క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్న సంగతి తెలిసిందే.

లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అనే విషయంపై కచ్చితమైన ల్యాబ్ రిపోర్టులు లేవు. పరస్పర విరుద్ధమైన ప్రకటనలు వెలువడుతున్నాయి. ఈ ప్రకటనలు గందర గోళం కలిగిస్తున్నాయి. కాని లడ్డూ కల్తీ జరిగిందని వొచ్చిన ఆరోపణల ముసుగులో మాత్రం మతపరమైన సెంటిమెంట్లను రెచ్చగొడుతున్నారు. బాబు, పవన్ ఇద్దరూ ల్యాబ్ రిపోర్టులపై కచ్చితమైన ప్రకటనలు చేయడం లేదు. ఈ నివేదికలు కూడా అసంపూర్తిగా ఉన్నాయి. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడడం లేదని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. ల్యాబ్ నివేదికలపై ఎవరికి తోచిన రీతిలో వారు ప్రకటనలు చేయడం వల్ల ప్రజల్లో గందరగోళం, అయోమయం నెలకొని ఉంది. రాజకీయ పార్టీలు ఈ నివేదికలపై ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రకటనలు చేస్తున్నారు. ఈ ల్యాబ్ నివేదిక కరెక్ట్‌గా ఉంది. జంతువుల కొవ్వు కలిసి ఉందా లేదా డాల్డా కలిసిందా అనే విషయమై టీటీడీ కొంత మేర స్పష్టతతో ప్రకటన చేసింది. నెయ్యి కల్తీ జరిగింది. కాని జంతువుల కొవ్వు అవశేషాలు లేవని టీటీడీ పేర్కొంది. టీటీడీ చెప్పే అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా, చంద్రబాబు పవన్ కల్యాణ్‌లు రాజకీయ స్వప్రయోజనాల కోసం ఆత్రుతతో ప్రకటనలు చేస్తున్నారు. ఇందులో అర్థం ఉందా ? ముందూ వెనక ఆలోచించకుండా ప్రకటనలు చేయడం ద్వారా రాజకీయ లబ్దికోసమనే అర్ధమవుతోంది.
బీజేపీ అజెండాలో భాగంగా బాబు, పవన్‌లు అడుగులు వేస్తున్నారు. బీజేపీ సుప్రీం లీడర్ చెప్పినట్లుగా నడుచుకుంటున్నారా ? గత ప్రభుత్వాన్ని అంటే వైకాపాను, జగన్‌ను నిందించేందుకు, అప్రతిష్టపాలు చేసేందుకు తిరుపతి లడ్డూను అడ్డుపెట్టుకుని దాడులు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో చంద్రబాబు సర్కార్ విఫలమైంది. తమవైఫల్యాల వల్ల అభాసుపాలవుతున్నామనే విషయాన్ని రాష్ట్రంలో ఎన్టీఏ సర్కార్ గ్రహించింది. అందుకే కొత్త డ్రామా ఆడుతున్నారా? ఈ రోజు బాబు, పవన్ కు కొత్త స్లోగన్ దొరికింది. మునుపెన్నడూ ఆంధ్రాలో ఈ స్లోగన్‌ను ఎవరూ వాడలేదు. కొత్త నినాదమిది. జనంలోకి సులువుగా వెళుతుంది. అదే సనాతన ధర్మం. ఆంధ్రాలో సనాతన ధర్మం ప్రమాదంలో పడిందనే నినాదం నిజంగా ఆకర్షణీయమైన నినాదంగా మారుతోంది. ఈ రోజు హిందుత్వ రాజకీయాలను నడిపేందుకు ఈ ఇద్దరు నేతలు బ్రాండ్ అంబాసిడర్లుగా మారుతున్నారు. గతంలో విపక్షంలో ఉన్నప్పుడు కూడా ఈ ఇద్దరు నేతలు హిందూ దేవాలయాలు ధ్వంసమయ్యాయంటూ జగన్ సర్కార్‌పై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మతమార్చిడులను ప్రోత్సహిస్తున్నారని, తిరుమల కొండపై కూడా క్రైస్తవ మత ప్రచారం చేయిస్తున్నారని ఈ ఇద్దరు నేతలు విమర్శలు చేశారు.

ఈ రోజు పవన్ కల్యాణ్ సనాతన ధర్మంపై తరచుగా ప్రకటనలు చేస్తున్నారు. చంద్రబాబు కూడా ఇందులో ముందున్నారు. బీజేపీని, హిందుత్వ రాజకీయ వాదులను ఆకట్టుకునేందుకు పవన్, బాబులు పోటీపడుతున్నారు. రాష్ట్రంలో హైందవ శక్తుల పునరేకీకరణకు అనుకూలంగా ఈ ఇద్దరు నాయకులు కొత్త ఎత్తుగడలతో ముందుకెళుతున్నారు. పరిపాలన పక్కనపెట్టి లొసుగులు బహిర్గతం కాకుండా, తిరుమల లడ్డూను చంద్రబాబు తెరపైకి తెచ్చారు. అలాగే సనాతన ధర్మంతో పవన్ కల్యాణ్ అలజడి సృష్టిస్తున్నారు. ఏ నాటికైనా తన కుమారుడు లోకేష్‌ను ముఖ్యమంత్రి గద్దెపై కూర్చోపెట్టాలనే తాపత్రయంలో చంద్రబాబు ఉన్నాడు. ఈ ఆకాంక్షకు పవన్ కల్యాణ్ కచ్చితంగా అడ్డుపడుతారా ? అందుకే తన వారసుడు లోకేష్ అంటూ చంద్రబాబు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ రోజు రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితి బాగాలేదు. బీజేపీతో బాబుకు సంబంధాలు అంతంత మాత్రమే. అందుకే హిందుత్వ అజెండాను తెరపైకి తెచ్చి బీజేపీను అకట్టుకునేందుకు చంద్రబాబు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు పెద్దగా నమ్మదగిన నేత కాదు. నేను సదా హిందుత్వ అజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉంటాననే సిగ్నల్‌ను పవన్‌కల్యాణ్ ఇచ్చేశారు. ఏతా వాతా చూస్తే తిరుపతి శ్రీవారి ప్రసాదం వివాదం బెడిసికొడుతుందా? చంద్రబాబుకు రాజకీయంగా లాభిస్తుందా లేక నష్టం చేకూర్చుతుందా? లేదా దీని వల్ల పవన్ కల్యాణ్ జాక్ పాట్ కొడతారా? ఏమైనా మత రాజకీయాల వల్ల దీర్జ కాలంలో ప్రతికూల ఫలితాలు ఉంటాయనే విషయాన్ని అన్ని రాజకీయ పార్టీలు గ్రహించడం మంచింది. వీరి వివాదాలు, స్వార్ధ ప్రయోజనాల వల్ల బీజేపీ బలోపేతమైనా ఆశ్చర్యపడనక్కర్లేదు.
-శామ్ సుందర్





