– ఆదాయానికి మించి ఆస్తుల ఆరోపణలపై హైదరాబాద్, ఖమ్మంలో దాడులు
– నగదు, బంగారం, ఆస్తుల పత్రాలు, వాహనాలు స్వాధీనం
– 2019లోనూ ఏసీబీ ట్రాప్ లో చిక్కిన వెంకటరమణ
శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, జూలై 22: తెలంగాణ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (రెడ్కో) డిప్యూటీ ఇంజనీర్ (డీఈ) ముత్యం వెంకటరమణపై ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మంగళవారం విస్తృత సోదాలు నిర్వహించింది. హైదరాబాద్, ఖమ్మం జిల్లాల్లోని మొత్తం 10 ప్రాంతాల్లో ఎనిమిది బృందాలతో ఏకకాలంలో తనిఖీలు చేపట్టి భారీగా ఆస్తుల పత్రాలు, నగదు, నగలు, వాహనాలను గుర్తించింది. డీఎస్పీ మాజిద్ ఖాన్ ఆధ్వర్యంలో మాదాపూర్లోని వెంకటరమణ నివాసంతో పాటు హైదరాబాద్, ఖమ్మంలోని పలు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరో పణల నేపథ్యంలో ఈ తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు, సోదాల్లో నాలుగు రెసిడెన్షియల్ ప్లాట్లు, జీ+3 కమర్షియల్ భవనాలు, మూసాపేట ఆంజనేయనగర్లో జీ+5 కమర్షియల్ భవనం, నిర్మాణంలో ఉన్న మరో 10 ప్లాట్లకు సంబంధించిన పత్రాలు గుర్తించారు. ఈ ప్లాట్లు వెంకటరమణ భార్య స్వప్న పేరుపై ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే గుట్టల బేగంపేట, ఖానాపేట్ ప్రాంతాల్లో నగదు, బంగారం, వజ్రాభరణాలు, ఆస్తుల పత్రాలు, విదేశీ మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. పలు కంపెనీలకు చెందిన కార్లను కూడా గుర్తించిన అధికారులు, వాటి విలువను అంచనా వేస్తున్నట్లు తెలిపారు. కాగా, ముత్యం వెంకటరమణ ప్రస్తుతం డిప్యూ టేషన్పై రెడ్కోలో విధులు నిర్వహిస్తున్నారు. ఆయనపై గతంలో కూడా అవినీతి ఆరోపణలు నమోదయ్యాయి. 2019లో ఏసీబీ ట్రాప్ కేసులో వెంకటరమణ వద్ద రూ.26 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు గుర్తుచేశారు. ప్రస్తుతం జరుగుతున్న సోదాలతో ఆయన అక్రమ ఆస్తుల వ్యవహారం మరోసారి వెలుగులోకి వచ్చింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




