– గండిపేట భూకబ్జా కేసులో..
- చంచల్‌గూడ జైలుకు తరలించిన పోలీసులు
హైదరాబాద్,ప్రజాతంత్ర, జూన్ 6: గండిపేట భూకబ్జా కేసులో అరెస్టైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ కేసు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. భూకబ్జా కేసులో నిందితుడిగా ఉన్న బ్రహ్మనాయుడిని సైబరాబాద్ పోలీసులు తమిళనాడులోని కాంచీపురంలో అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను హైదరాబాద్‌కు తీసుకువచ్చి నార్సింగి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విచారణలో భాగంగా స్టేట్‌మెంట్ నమోదు చేసిన అధికారులు ఆ తర్వాత న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. బ్రహ్మనాయుడిని నార్సింగి పోలీస్ స్టేషన్‌కు తీసుకువస్తున్నారనే సమాచారం అందడంతో వైసీపీ కార్యకర్తలు, ఆయన అనుచరులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా పోలీస్ స్టేషన్‌లోకి ఎవరినీ అనుమతించ లేదు. దీంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీస్ స్టేషన్ నుంచి కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉప్పరపల్లి కోర్టుకు తరలించారు. కేసుకు సంబంధించిన వాదనలు విన్న కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. గండిపేట భూకబ్జా కేసులో ఇప్పటికే ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. బ్రహ్మనాయుడు అరెస్టుతో మొత్తం అరెస్టుల సంఖ్య ఆరుకు చేరాయి. ఈ కేసులో మరికొంతమందిని కూడా విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. భూకబ్జాకు సంబంధించిన పలు కోణాల్లో సైబరాబాద్ పోలీసులు విచారణ చేపట్టారు. భూముల ఆక్రమణ, పత్రాల వ్యవహారం, సంబంధిత వ్యక్తుల పాత్ర వంటి అంశాలపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


