హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 18: ములుగు జిల్లా జంపన్న వాగు రివర్ ఫ్రంట్ అభివృద్ధికి రూ.5 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. మేడారం సమక్క-సారలమ్మ జాతరలో జంపన్న వాగుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. భక్తులు పవిత్ర స్నానమాచరించే స్థలంగా ప్రాచుర్యం పొందిన ఈ వాగు అభివృద్దికి మహిళాశిశు సంక్షేమ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిధులు మంజూరు చేసింది.
మిషన్ భగీరథ ఫిర్యాదులకు నాలుగంకెల టోల్‌ఫ్రీ
కాగా, గ్రామీణ తాగునీటి సమస్య ఫిర్యాదుల కోసం ప్రజలకు సులువుగా గుర్తుండేలా నాలుగు అంకెల కొత్త టోల్ ఫ్రీ నంబర్ 1916ను అధికారులు కేటాయించారు. 11 అంకెలతో గ్రామీణ ప్రజలు అవస్థలు పడుతున్నందున కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సీఎం, రేవంత్‌రెడ్డి, మంత్రి సీతక్క ఆదేశాల మేరకు నాలుగు అంకెల కొత్త నంబరు కేటాయించి ఫిర్యాదులు సత్వరం పరిష్కరిస్తున్నారు. ఈ నాలుగు అంకెల 1916 టోల్ ఫ్రీ నంబరుతో ప్రజలు రాష్ట్రంలో ఎక్కడి నుండైనా తమ తాగునీటి సమస్య ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చని మిషన్ భగీరథ అధికారులు తెలిపారు.