ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్ 18: విద్యుత్ సరఫరాలో ట్రిప్ అవడాన్ని త్వరగా గుర్తించి వెనువెంటనే మరమ్మతులు చేసేందుకు విద్యుత్ సంస్థల్లో ఆధునిక టెక్నాలజీ వినియోగిస్తున్నట్లు డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర విద్యుత్ చరిత్రలో ఇది కీలక ఘట్టమని అన్నారు. విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్తు సరఫరా, అంతరాయం ఏర్పడితే వెంటనే గుర్తించి మరమ్మతులు చేసేందుకు రియల్ టైం ఫీడర్ మేనేజ్‌మెంట్ సిస్టం, ఫాల్ట్ పాసేజ్ ఇండికేటర్స్(RTFMS,FPI) ఎంతో ఉపయోగపడతాయన్నారు. మధిర నియోజకవర్గం జానకిపురం సబ్ స్టేషన్‌లో ఈ వ్యవస్థలను బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి డిప్యూటీ సీఎం బుధవారం ప్రారంభించారు. ఈ ఆధునిక పరిజ్ఞానాన్ని ఎన్‌పీడీసీఎల్, ఎస్‌పీడీసీఎల్ సంస్థల పరిధిలో అమలు చేయనున్నట్టు తెలిపారు. ఎక్కడ విద్యుత్ సరఫరా నిలిచిపోయిందో కంప్యూటర్ ద్వారా గుర్తిస్తారన్నారు. ఎన్‌పీడీసీఎల్, ఎస్‌పీడీసీఎల్ కార్యాలయంలోని డాష్ బోర్డు ద్వారా కూడా రాష్ట్రంలో ఎక్కడ విద్యుత్ సమస్య ఏర్పడినా గుర్తించే అవకాశం ఈ ఆధునిక వ్యవస్థల ద్వారా వీలవుతుందని భట్టి విక్రమార్క తెలిపారు. రియల్ టైం ఫీడర్ మేనేజ్‌మెంట్ సిస్టం అనేది సబ్ స్టేషన్లలోని ఫీడర్ల పర్యవేక్షణ, నియంత్రణ, రక్షణ, రియల్ టైం ప్రాతిపదికన సమాచారాన్ని తీసుకోవడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. మొదట రాష్ట్రంలోని 100 సబ్ స్టేషన్లలో ఈ వ్యవస్థకు శ్రీకారం చుట్టామని చెప్పారు. మరో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఫాల్ట్ పాసేజ్ ఇండికేటర్ అనేది విద్యుత్తు సరఫరాలో సమస్యను అతి త్వరగా గుర్తించడానికి, ఏ ప్రాంతంలో సమస్య ఏర్పడిరదో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు. మొదటి దశలో 25 కి.మీ కంటే ఎక్కువ పొడవైన 33KV & 11KV ఫీడర్లలో లోపాలను త్వరగా గుర్తించి సరఫరాను పునరుద్ధరించడానికి వెయ్యి FPI లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎన్‌పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మూడు రోజుల్లో రూ.5,215 కోట్ల ‘భరోసా’ నిధులు జమ
రాష్ట్రంలో సాగు యోగ్యమైన 1,49,39,11 కోట్ల ఎకరాలకు తొమ్మిది రోజుల్లో మొత్తం రూ.9,000 కోట్ల రైతు భరోసా నిధులు అన్నదాతల ఖాతాలో జమ చేసి తీరుతామని జానకిపురం సభలో చెప్పారు. ఈనెల 16న ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రైతు సోదరులకు పెట్టుబడి సహాయంగా రైతు భరోసా నిధులను జమ చేశామని వివరించారు. రైతుల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని, అన్నదాతల సంక్షేమం కోసం ఉచిత విద్యుత్తు, రైతు భరోసా, రైతు బీమా వంటి కార్యక్రమాలతో యేటా రూ.70 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని, వానాకాలం సీజన్ ప్రారంభానికి ముందే రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులను జమ చేస్తున్నామని, వరితోపాటు ఇతర పంటల ఉత్పత్తి గణనీయంగా పెంచేందుకు అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం చేపట్టిందని మంత్రి భట్ఠి చెప్పారు.