– గణపతి తదితరులు ఇంకా అజ్ఞాతంలోనే
– డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25: తెలంగాణలో మావోయిస్టు ఉద్యమం అంతిమ దశకు చేరుకోవడంతో మిగిలిన వారు కూడా లొంగుబాట పట్టారు. మొత్తం 47మంది అజ్ఞాత మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయి జనజీవన స్రవంతిలో చేరారు. లొంగిపోయిన వారిలో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు, అలాగే దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీకి చెందిన కీలక నేతలు ఉన్నారు. ముఖ్యంగా హేమ్లా ఇతు (అలియాస్ విజ్జా), పోడియం లచ్చు (అలియాస్ మనోజ్) వంటి నాయకులు ఈ జాబితాలో ఉన్నారని డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. లొంగుబాటు సందర్భంగా మొత్తం 32 ఆయుధాలు, 515 తూటాలు పోలీసులకు అప్పగించినట్లు వెల్లడించారు. వీటిలో ఏకె-47, పలు రకాల రైఫిల్స్‌తోపాటు పిస్టల్స్, రివాల్వర్, మస్కెట్ గన్స్ వంటి వివిధ రకాల ఆయుధాలు ఉన్నాయి. రాఫ్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస విధానం కారణంగా ఈ మావోయిస్టు కేడర్లు లొంగుబాటుకు ముందుకొచ్చారని చెప్పారు. దక్షిణ బస్తర్ డివిజన్ ప్రస్తుతం పూర్తిగా నిర్వీర్య స్థితికి చేరిందని డీజీపీ వ్యాఖ్యానించారు. లొంగిపోయిన వారిలో పీఎల్‌జీఏ బెటాలియన్‌కు చెందిన నలుగురు, డీకేఎస్‌జెడ్‌సీకు చెందిన 28మంది, అలాగే 9వ, 30వ ప్లాటూన్‌లకు చెందిన 15మంది ఉన్నారని వివరించారు. ఇక తెలంగాణకు చెందిన కొంతమంది కీలక మావోయిస్టు నాయకులు ఇంకా అజ్ఞాతంలో ఉన్నారని డీజీపీ తెలిపారు. వారిలో లక్ష్మణరావు (గణపతి), పసునూరి నరహరి (సంతోషం), జాడి రత్నాభాయ్ (సుజాత), వార్త శేఖర్ (మంగు) ఉన్నారని పేర్కొన్నారు. వీరిని కూడా లొంగిపోవాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు. మావోయిస్టు ఉద్యమంపై తెలంగాణలో భద్రతా బలగాల చర్యలు మరింత ప్రభావం చూపుతున్నాయన్నారు. జీవన స్రవంతిలో చేరి తెలంగాణ ప్రభుత్వ లొంగుబాటు, పునరావాస విధానం ద్వారా లభించే అన్ని ప్రయోజనాలను పొందాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు. గత రెండేళ్లలో పోలీసుల సమర్థవంతమైన పనితీరు వల్ల మొత్తం 818మంది మావోయిస్టులు లొంగిపోగా, వారి నుంచి 334 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న మెరుగైన పునరావాస ప్యాకేజీలు, పోలీసులు సాగిస్తున్న అవగాహన కార్యక్రమాల వల్ల అడవిబాట పట్టిన వారు తిరిగి ఇంటికి చేరుకుంటున్నారని చెప్పారు. ఈ భారీ లొంగుబాటుతో రాష్ట్రంలో మావోయిస్టు ప్రభావం మరింత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





