రేప‌టి నుంచి సెల్ఫ్-ఎన్యూమరేషన్

– మొదటిసారిగా వెబ్‌సైట్‌ ‌ద్వారా వివరాలు తెలిపే అవకాశం
– కులగణనతోపాటు జనగణన ఈసారి ప్రత్యేకం
– సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ డైరెక్టర్ భారతి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25 : జనగణన-2027లో భాగంగా రాష్ట్రంలో రేపటి(ఆదివారం) నుంచి సెల్ఫ్-ఎన్యూమరేషన్ కార్యక్రమం ప్రారంభం కానున్నట్టు డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్, తెలంగాణ డైరెక్టర్ భారతీ హోళికెరి తెలిపారు. ఈ ప్రక్రియ 26 నుంచి మే 10వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈసారి జరుగుతున్న జనగణన ప్రాముఖ్యతను భారతీ హోళికెరి వివరిస్తూ తెలంగాణ ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొదటి జనగణన అని పేర్కొన్నారు. డిజిటల్ పద్ధతిలో జరుగుతున్న తొలి జనగణన కూడా ఇదేనన్నారు. స్వాతంత్య్రం తర్వాత మొదటిసారి కులగణన జరుగుతుండటం కూడా ఈసారి జనగణనలో ప్రత్యేకమని పేర్కొన్నారు. ముఖ్యంగా మొదటిసారిగా జనగణన ప్రక్రియలో ఈసారి సెల్ఫ్-ఎన్యూమరేషన్ ప్రక్రియ పాటిస్తున్నామని, ప్రజలు నేరుగా జనగణనలో పాల్గొనేందుకు ఇది ఒక మంచి అవకాశమని చెప్పారు. https://se.census.gov.in వెబ్ పోర్టల్ ద్వారా ప్రజలు స్వచ్ఛందంగా, సొంతంగా జనగణనకు తమ వివరాలను అందించవచ్చని భారతీ హోళికెరి తెలిపారు. సెల్ఫ్-ఎన్యూమరేషన్ అనేది తప్పనిసరి కాదని, ప్రజలకు ఒక సౌలభ్యం మాత్రమేనని, దీని వల్ల జనగణనలో డేటా సేకరణ వేగవంతమవుతుందని, క్షేత్రస్థాయిలో ఎన్యూమరేటర్లకు పనిభారం తగ్గుతుందని చెప్పారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సహా 16 భాషల్లో పోర్టల్ పనిచేస్తుందని, ఈ పోర్టల్ అత్యంత సురక్షితమైనదని, ఇందులో డేటా సురక్షితంగా ఉంటుందని తెలిపారు. ఈ ప్రక్రియకు సంబంధించి ఎలాంటి అనుమానాలు ఉన్నా పోర్టల్‌లో ఉన్న సమాచారం నివృత్తి చేస్తుందని, ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య 1855 హెల్ప్‌లైన్ నెంబరుకు ఫోన్ చేసి కూడా తెలుసుకోవచ్చని చెప్పారు. జనగణనలోని మొత్తం 33 ప్రశ్నలకు సెల్ఫ్-ఎన్యూమరేషన్ ద్వారా 27 ప్రశ్నలకు జవాబులు ఇవ్వొచ్చని, మిగతా ఆరు ప్రశ్నలకు సమాధానాలను జనగణన ఎన్యూమరేటర్ వచ్చి నమోదు చేసుకుంటారని తెలిపారు. ప్రజలు ఎలాంటి డాక్యుమెంట్లు, ఫొటోలు అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. సెల్ఫ్-ఎన్యూమరేషన్ ప్రక్రియలో జియోఫెన్సింగ్ ఉండదని, ప్రజలు ఎక్కడినుంచైనా ఈ ప్రక్రియను పూర్తిచేయవచ్చని అన్నారు. జనగణన అనేది అన్ని సర్వేలకు మాతృ సర్వే వంటిదని, జనగణన ద్వారా సమగ్రమైన డేటా వస్తుందని ఆమె పేర్కొన్నారు. సరైన విధానాలు, అభివృద్ధి ప్రణాళికలు రూపొందించేందుకు జనగణన డేటా అత్యంత కీలకమన్నారు. మన కోసం, మన పిల్లల కోసం, భావి తరాల కోసం ఈ జనగణన ముఖ్యమైనదని, కాబట్టి ప్రజలు కచ్చితత్వంతో తమ వివరాలను ఇవ్వాలని, ఇది ప్రజల బాధ్యత అని ఆమె అన్నారు. జనగణనలో వచ్చే డేటా క్షేత్రస్థాయి పరిస్థితులను ప్రతిబింబించే అద్దంలా ఉండాలనేది తమ లక్ష్యమన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు కోర్ అర్బన్ రీజియన్(క్యూర్)లో జనగణన ప్రక్రియను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ వివరించారు. ఒక డివిజన్‌ను యూనిట్‌గా తీసుకొని జనగణన జరపనున్నట్టు చెప్పారు. క్యూర్ పరిధిలో 21,866 ఎన్యూమరేటర్లు, 3,652 మంది సూపర్‌వైజర్లు జనగణన విధుల్లో ఉంటారని, సర్కిల్‌కు ఒకరు చొప్పున 60 మంది డిప్యూటీ కమిషనర్లు ఇన్‌చార్జిలుగా ఉంటారని, కంటోన్మెంట్‌కు ఒకరు ఇన్‌చార్జిగా ఉంటారని తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా సెల్ఫ్-ఎన్యూమరేషన్ ప్రక్రియలో పాల్గొనాలని ఆయన కోరారు. అనంతరం జనగణనకు సంబంధించిన పోస్టర్, ప్రచార సామగ్రిని ఆవిష్కరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *