– ప్రజాస్వామ్యాన్ని, సమాఖ్య వ్యవస్థను కాపాడాలి
– తెలంగాణ ప్రజా సమావేశం డిమాండ్
– తెలంగాణ ప్రజా సమావేశం డిమాండ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 27: జనాభా లెక్కలు, డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన)తో సంబంధం లేకుండా, పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలలో 33% మహిళా రిజర్వేషన్ల చట్టం, 2023 (ఎస్సీ, ఎస్టీ మహిళలతో సహా)ను తక్షణమే, బేషరతుగా అమలు చేయాలని వివిధ మహిళా హక్కుల సంఘాలు, లౌకిక పార్టీలకు చెందిన సుమారు 100 మంది ప్రతినిధులతో పాటు పలువురు సామాజిక కార్యకర్తలు శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ల జాతీయ కూటమి తో సంఘీభావంగా, తెలంగాణలోని మహిళా హక్కుల, ఫెమినిస్ట్ సంఘాలు ఈ సమావేశాన్ని నిర్వహించాయి. కేంద్రంలోని అధికార పార్టీ డీలిమిటేషన్ బిల్లు ద్వారా పార్లమెంటరీ విస్తరణ అనే సమాఖ్య-వ్యతిరేక, అప్రజాస్వామిక ఎజెండాను కొనసాగించకూడదని, మహిళా రిజర్వేషన్లను ఒక ఆయుధంగా వాడుకోవడం మానుకోవాలని స్పష్టం చేశారు. సీనియర్ విద్యావేత్తలు, కార్యకర్తలైన ప్రొఫెసర్ శాంత సిన్హా, ప్రొఫెసర్ రమా మెల్కోటే కీలకోపన్యాసం చేస్తూ మహిళా రిజర్వేషన్ల కోసం దశాబ్దాలుగా సాగుతున్న పోరాటాన్ని వివరిస్తూ, ముఖ్యంగా అణగారిన వర్గాలకు చెందిన మహిళలు రాజ్యాంగ హక్కులను పరిరక్షిస్తూ పార్లమెంటులో, రాష్ట్ర శాసనసభలలో గణనీయ సంఖ్యలో ఉంటే, ప్రజా విధానాలు, పరిపాలనలో సానుకూల మార్పు వస్తుందని నొక్కి చెప్పారు.. *వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు శారద నెరెళ్ల, త్రిపురాన వెంకటరత్నం, సుమిత్ర ఆనంద్ తనోబా, కల్వకుంట్ల కవిత , లక్ష్మి రాగులపల్లి , శాంత ) తదితరులు ఇందులో ప్రసంగించారు. వివిధ వామపక్ష పార్టీలు, మహిళా సంఘాల తరపున మల్లు లక్ష్మి, ఆశ, పాస్య పద్మ, కృష్ణ కుమారి, అనసూయ, వి.సంధ్య, ఝాన్సీ , జ్యోతి బన్నురు, విమలక్క మాట్లాడారు. రాజ్యాంగ 106వ సవరణ చట్టం-2023 ద్వారా వచ్చిన ‘మహిళా రిజర్వేషన్ చట్టం-2023’ అమలులో జరుగుతున్న అన్యాయమైన జాప్యం పట్ల వీరందరూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చట్టం అమలులోకి రావడానికి ఏకంగా మూడేళ్ల తర్వాత అంటే 2026 ఏప్రిల్ 16న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం దీనిని ‘నారీ శక్తి వందన్ అధినియం’ అని పిలుస్తూనే, చట్టం అమలును ఉద్దేశపూర్వకంగా జాప్యం చేయడం విడ్డూరమని వక్తలు పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ల అమలు ముసుగులో పార్లమెంటు సీట్ల పెంపును తీసుకురావడానికి ప్రయత్నించిన ప్రజాస్వామ్య వ్యతిరేక బిల్లును 2026 ఏప్రిల్‌లో ప్రతిపక్ష పార్టీలు సమంజసంగానే తిరస్కరించినప్పటికీ ఇప్పుడు వాటిపైనే ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తోందని వక్తలు పేర్కొన్నారు. స్వతంత్ర మహిళా సంఘాలు, నెట్‌వర్క్‌లకు చెందిన ప్రొఫెసర్ సుజాత సూరేపల్లి, సునీత, దీప్తి, ఆశాలత, రుక్మిణి, పులి కల్పన, సిస్టర్ లిస్సీ జోసెఫ్ మంజుల, రచన, వైజయంతి, ఇందిర, రుబీనా, ముస్లిం మహిళా సంఘాల ప్రతినిధులు, సామాజిక మరియు రాజకీయ కార్యకర్తలు, జూపాక సుభద్ర, నింఫియా, విద్యార్థి నాయకురాలు స్వాతి మాట్లాడుతూ పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలలో మహిళలకు 33% ప్రాతినిధ్యం కల్పించాలని మూడు దశాబ్దాలుగా సాగిన పోరాటం ఫలితంగానే 2023 చట్టం వచ్చిందని పేర్కొన్నారు. అయితే, ఈ చట్టం ఓబీసీ మహిళలకు స్పష్టమైన హక్కులను కల్పించకపోగా కనీసం ప్రస్తుత రూపంలో ఉన్న ఈ చట్టాన్ని అమలు చేయడానికి కూడా రాజకీయ చిత్తశుద్ధి లోపించిందని ఆందోళన వ్యక్తం చేశారు.
————————————————————————————————————————————————————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





