భూమి స్వాధీనంలో వేగం.. పరిహారంలో తాత్సారం!

నారాయణపేట జిల్లా భూసేకరణ పరిహార చెల్లింపు కేసులో రూ. 51.35 కోట్లను 12 వారాల్లోగా చెల్లించాలని జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ ప్రభుత్వానికి 12 వారాల తుది గడువు విధించడం పాలనాపరమైన జవాబుదారీతనాన్ని గుర్తుచేస్తున్నది . ఇతర ప్రాజెక్టులకు సేకరించిన భూముల పరిహార చెల్లింపులు, పెండింగ్ బకాయిల పరిష్కార కాలపట్టికపై అదనపు అఫిడవిట్ సమర్పించాలని కూడా ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ విభాగాలకు సంబంధించి సుమారు రూ. 40వేల కోట్ల చెల్లింపు టోకెన్లు పెండింగ్‌లో ఉన్నాయని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఈ సందర్భంగా హైకోర్టుకు నివేదించడం ద్వారా ఖజానాలో నిధుల కొరత వల్ల “చెల్లించాలనే ఉద్దేశం ఉన్నా తక్షణమే ఇవ్వలేని నిస్సహాయ స్థితి” ఉందని ప్రభుత్వం కోర్టు ముందు అంగీకరించినట్లయింది. భూసేకరణ ప్రక్రియలో పౌరుల ఆస్తి హక్కులను కాపాడటం, సకాలంలో చట్టబద్ధమైన పరిహారం అందించడం రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వ బాధ్యత. అయితే రాష్ట్ర ఆర్థిక ఒత్తిళ్లు, నిధుల కేటాయింపులో ప్రాధాన్యతల మార్పు వంటి కారణాల వల్ల ఈ చెల్లింపుల్లో తీవ్ర ఆలస్యం జరుగుతున్నది.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 300-ఎ ప్రకారం, చట్టబద్ధమైన ప్రక్రియ , న్యాయమైన పరిహారం లేకుండా ఏ పౌరుడి ఆస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోకూడదు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూమిని కోల్పోయిన రైతులకు మార్కెట్ విలువకు అనుగుణంగా సకాలంలో పరిహారం, పునరావాసం కల్పించడం తప్పనిసరి. పరిహారం చెల్లింపులో ఆలస్యం జరిగితే అది పౌరహక్కుల ఉల్లంఘనేనని, ఆలస్యమైన కాలానికి ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం చెల్లించాలని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసింది. సంక్షేమ పథకాలు, ఇతర కీలక హామీల అమలుకు నిధులను మళ్లించడం వల్ల భూసేకరణ పరిహారం, కాంట్రాక్టర్ల బిల్లుల వంటి చట్టబద్ధమైన చెల్లింపులు వెనుకబడిపోతున్నాయనే విమర్శల్లో సహేతుకతను కాదనలేం. ప్రాజెక్టుల కోసం భూమిని సేకరించే ముందే, పరిహారానికి అవసరమైన పూర్తి నిధులను ప్రత్యేకంగా కేటాయించకపోవడంవల్ల భూమి స్వాధీనం పూర్తయ్యాక చెల్లింపులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో పడుతున్నాయి. సంబంధిత శాఖలు బిల్లులను ఆమోదించి పే ఆఫీస్ ద్వారా టోకెన్లు జారీ చేసినప్పటికీ, ఆర్థిక శాఖ నుంచి నిధులు విడుదల కాకపోవడంతో బాధితులు కోర్టు ధిక్కరణ పిటిషన్లు వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది.

వివిధ ప్రభుత్వ విభాగాలు పనులు పూర్తయిన తర్వాత లేదా భూసేకరణ ప్రక్రియ అనంతరం బిల్లులను పరిశీలించి టోకెన్లు జారీ చేస్తాయి. అయితే టోకెన్ జారీ అయినంత మాత్రాన ఖజానాలో నిధులు సిద్ధంగా ఉన్నాయని అర్థం కాదని నివేదికలోని వివరాలు స్పష్టం చేస్తున్నాయి.  టోకెన్లు చేతికి అందడంతో తమకు త్వరలోనే డబ్బు వొస్తుందని భావించిన రైతులు, కాంట్రాక్టర్లకు ఏళ్ల తరబడి నిధులు విడుదల కాకపోవడంతో ఆర్థిక వ్యవస్థ విశ్వసనీయతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రూ. 40వేల కోట్ల బకాయిలలో ఏ బిల్లులను ముందుగా చెల్లిస్తున్నారు, ఏవి ఎందుకు నిలిచిపోతున్నాయి అనే విషయంలో పారదర్శకమైన విధానం కనిపించడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. సాధారణ పద్ధతిలో నిధులు విడుదల కాకపోవడంతో బాధితులు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. కోర్టులు ఆదేశించిన కేసులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ నిధులు విడుదల చేయడం వల్ల మిగిలిన సాధారణ చెల్లింపుల క్రమం దెబ్బతింటున్నది. బడ్జెట్‌లో కేటాయింపులు చూపించినప్పటికీ వాస్తవంగా చెల్లించాల్సిన బకాయిల భారం ఎంత ఉందనే పూర్తి చిత్రం ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పెండింగ్‌లో ఉన్న టోకెన్ల వివరాలు, వాటి తేదీలు , చెల్లింపుల క్రమాన్ని పబ్లిక్ పోర్టల్‌లో బహిరంగంగా ఉంచితే పారదర్శకత పెరుగుతుంది.

ఖజానాలో నిధుల లభ్యతను బట్టి కొత్త పనులకు అనుమతులు ఇవ్వడం వల్ల టోకెన్ల పేరుతో బకాయిలు పేరుకుపోయే పరిస్థితిని నివారించవొచ్చు. అభివృద్ధి ప్రాజెక్టులకు భూసేకరణ ప్రక్రియను ప్రారంభించే ముందే పరిహార నిధులను ప్రత్యేకంగా కేటాయించినిర్ధారించే వ్యవస్థను తప్పనిసరి చేయడం వల్ల బాధితులకు న్యాయం జరగడంతో పాటు రాష్ట్ర ఆర్థిక క్రమశిక్షణ కూడా మెరుగుపడుతుంది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూమిని స్వాధీనం చేసుకునే ముందే పరిహార మొత్తాన్ని నిర్ణయించి, సంబంధిత అధికారి వద్ద జమ చేయాలి. దీనిని కచ్చితంగా అమలు చేస్తే రైతులు ఏళ్ల తరబడి కార్యాలయాలు, కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. పరిహారం చెల్లింపులో ఆలస్యం జరిగితే చట్టప్రకారం ప్రభుత్వం అదనపు వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. ముందే నిధులు సిద్ధంగా ఉంటే ఖజానాపై అదనపు ఆర్థిక భారం పడకుండా నివారించవొచ్చు .

ముందస్తు నిధుల భరోసా ఉంటే భూసేకరణ వేగంగా పూర్తవుతుంది. రాష్ట్ర ఆదాయ వ్యయాల మధ్య సమతుల్యత లేనప్పుడు, పెద్ద మొత్తంలో నిధులను ప్రత్యేక ఖాతాల్లో లాక్ చేయడంవల్ల రోజువారీ ఆర్థిక నిర్వహణ కష్టతరమవుతుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తాయి. ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ, కోర్టు కేసులు లేదా పునరావాస ప్యాకేజీల మార్పుల వల్ల తుది పరిహార మొత్తం భారీగా పెరుగుతుంది. దీనివల్ల ముందే పూర్తి మొత్తాన్ని కచ్చితంగా అంచనా వేయడం కష్టమవుతుంది. ఈ నేపథ్యంలో మొత్తం ప్రాజెక్టు నిధులను ఒకేసారి కాకుండా, ఏ దశలో ఎంత భూమిని సేకరిస్తున్నారో ఆ మేరకు నిధులను ప్రత్యేక ఖాతాలో జమ చేసిన తర్వాతే నోటిఫికేషన్ జారీ చేసే నిబంధన తీసుకురావొచ్చు. ప్రాజెక్టుల కోసం ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకునేటప్పుడే, అందులో భూసేకరణ పరిహార వాటాను నేరుగా బాధితుల ఖాతాలకు వెళ్లేలా ఒప్పందం చేసుకోవొచ్చు. నిధుల లభ్యతపై ఆర్థిక శాఖ అనుమతి లేకుండా భూసేకరణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లకుండా కఠిన నిబంధనలు అమలు చేయడం ద్వారా బకాయిల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *