నిమ్స్‌లో వెయ్యి రొబోటిక్ సర్జరీలు

– డాక్టర్లు, సిబ్బందిని అభినందించిన మంత్రి దామోదర్

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 3 : నిమ్స్ హాస్పిటల్ మరో ఘనతను సాధించింది. రెండున్నరేళ్ల వ్యవధిలోనే నిమ్స్‌లో వెయ్యి రొబోటిక్ సర్జరీలను విజయవంతంగా పూర్తి చేసినట్లు నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్ తెలిపారు. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహని సచివాలయంలో సోమవారం కలిసిన ఆయన నిమ్స్ సాధించిన ఈ ఘనతను మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా ఆయనతోపాటు రొబోటిక్ సర్జరీల్లో భాగస్వాములైన డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్లు, ఇతర సిబ్బందిని మంత్రి అభినందించారు. ప్రభుత్వ హాస్పిటల్స్‌లో అత్యాధునిక వైద్య సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో నిమ్స్ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ఇటీవలే నిమ్స్‌లో 2,000 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు పూర్తవడం, ఇప్పుడు వెయ్యి రొబోటిక్ సర్జరీల మైలు రాయిని చేరుకోవడం ప్రభుత్వ వైద్యరంగ సామర్థ్యానికి నిదర్శనమని మంత్రి అన్నారు.

దక్షిణ భారత దేశంలో ప్రభుత్వ రంగంలో తొలి రొబోటిక్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ను విజయవంతంగా నిర్వహించిన నిమ్స్ దేశంలోనే ప్రముఖ అవయవ మార్పిడి కేంద్రాల్లో ఒకటిగా నిలిచిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక వైద్య సేవలను మరింత విస్తరిస్తోందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం నిమ్స్‌తోపాటు ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్‌లో కూడా రొబోటిక్ సర్జరీలు విజయవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. నిర్మాణంలో ఉన్న కొత్త టిమ్స్ హాస్పిటళ్లతోపాటు గాంధీ, కొత్త ఉస్మానియా హాస్పిటల్‌లోనూ అత్యాధునిక రొబోటిక్ ఆపరేషన్ థియేటర్లను ఏర్పాటు చేసి, ప్రపంచస్థాయి వైద్య సేవలను ప్రభుత్వ రంగంలోనే అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వెల్లడించారు. డాక్టర్ రాహుల్ దేవరాజ్ మాట్లాడుతూ నిమ్స్‌లో ఇప్పటివరకు యూరాలజీ విభాగంలో 590, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగంలో 248, సర్జికల్ ఆంకాలజీ విభాగంలో 162 రొబోటిక్ శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు తెలిపారు. వీటిల్లో 90 శాతానికి పైగా ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి వంటి ప్రభుత్వ పథకాల ద్వారా రోగులకు పూర్తిగా ఉచితంగా నిర్వహించడం విశేషమని తెలిపారు. దీంతో ఖరీదైన రొబోటిక్ సర్జరీలను కూడా సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురాగలిగామని చెప్పారు. ఈ విజయానికి యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, సర్జికల్ ఆంకాలజీ, అనస్థీషియా విభాగాలు, నర్సింగ్ సిబ్బంది, ఆపరేషన్ థియేటర్ బృందం, ఇతర సహాయక విభాగాల సమష్టి కృషి కారణమని డాక్టర్ రాహుల్ తెలిపారు. రాష్ట్రంలో ఆధునిక వైద్య సేవల బలోపేతానికి నిరంతరం సహకరిస్తున్న ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌కు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు అత్యాధునిక, నాణ్యమైన వైద్య సేవలను అందించడంలో నిమ్స్ మరిన్ని మైలురాళ్లు సాధించే దిశగా ముందుకు సాగుతుందని ఆయన పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *