కార్యాచరణతో పర్యావరణ అనుమతులు

– సుప్రీం తీర్పుతో నీటి ప్రాజెక్టులపై న్యాయపరమైన స్పష్టత
– రాష్ట్ర ప్రయోజనాలకనుగుణంగా సద్వినియోగం చేసుకోవాలి
– ప్రాధాన్యత జాబితాలో పాలమూరు, సీతారామ, డిండి, గౌరవెల్లి
– గౌరవెల్లి పంప్‌హౌస్‌ను సర్వసన్నద్ధంగా ఉంచాలి
– నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ 

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 3 : రాష్ట్ర సాగునీటి భవిష్యత్తుకు అత్యంత కీలకమైన నాలుగు ప్రధాన ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు సాధించే ప్రక్రియను ఇకపై కాలపరిమితితో కూడిన కార్యాచరణతో ముందుకు తీసుకెళ్లాలని నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల, సీతారామ సాగర్, డిండి, గౌరవెల్లి ప్రాజెక్టులను అత్యున్నత ప్రాధాన్య జాబితాలో ఉంచి, సాధ్యమైనంతవరకు ఆరు నెలల్లో ప్రాజెక్టులవారీగా పర్యావరణ అనుమతులు సాధించేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల పర్యావరణ అనుమతులు, న్యాయపరమైన అంశాలు, పోలవరం బ్యాక్‌వాటర్ ప్రభావంపై సచివాలయంలో సోమవారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశానికి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షత వహించారు. సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు న్యాయపరమైన స్పష్టతను కల్పించడంతోపాటు రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టుల అనుమతుల సాధనకు కొత్త అవకాశాల ద్వారాలను తెరిచిందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకుని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖతోపాటు సంబంధిత చట్టబద్ధ సంస్థల వద్ద పెండింగ్‌లో ఉన్న ప్రతీ అర్హమైన ప్రతిపాదనను వేగంగా ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారు.

సుప్రీంకోర్టు తీర్పుతో న్యాయపరమైన స్పష్టత

సుప్రీంకోర్టు తాజా తీర్పులోని అంశాలను ప్రస్తావించిన ఉత్తమ్ గతంలో చట్టబద్ధంగా పర్యావరణ అనుమతులు పొందిన ప్రాజెక్టులకు ఆ రక్షణ కొనసాగుతుందని తెలిపారు. ఇప్పటికే పరిశీలనలో ఉన్న దరఖాస్తులను సుప్రీంకోర్టు మార్గదర్శకాలకనుగుణంగా పరిష్కరించే అవకాశం ఉందన్నారు. గతంలో తిరస్కరణకు గురైన ప్రతిపాదనలను ప్రాజెక్టులవారీగా సమగ్రంగా పరిశీలించి సాంకేతిక, విధానపరమైన లోపాలను సరిదిద్దిన అనంతరం చట్టపరంగా అవకాశం ఉన్నచోట తిరిగి సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ తీర్పు వెనుక రాష్ట్ర ప్రభుత్వం నిరంతరంగా సాగించిన న్యాయపోరాటం ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఈ తీర్పులోని న్యాయసూత్రాలను లోతుగా అధ్యయనం చేసి రాష్ట్రంలోని ప్రతి ప్రాజెక్టుకు అవి ఏ విధంగా వర్తిస్తాయో ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు.

అంతర్రాష్ట్ర విభాగాన్ని మరింత బలోపేతం చేయాలి

రాష్ట్ర సాగునీటి ప్రయోజనాల పరిరక్షణలో అంతర్రాష్ట్ర విభాగం అత్యంత కీలకమని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఆ విభాగాన్ని తగిన సాంకేతిక, పర్యావరణ, న్యాయ నిపుణులతో మరింత బలోపేతం చేయాలని ఉత్తమ్ ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం, జాతీయ హరిత ట్రిబ్యునల్, సుప్రీంకోర్టు, ఇతర న్యాయస్థానాలు, చట్టబద్ధ సంస్థల ముందు తెలంగాణ వాదనను శాస్త్రీయ ఆధారాలు, సమగ్ర పత్రాలతో బలంగా వినిపించే సామర్థ్యాన్ని పెంపొందించాలన్నారు. ప్రతి ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి చరిత్ర అధికారుల వద్ద అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. పర్యావరణ అనుమతులు, ఆ తర్వాత ప్రాజెక్టు పరిధిలో చోటు చేసుకున్న మార్పులు, రీడిజైన్, విస్తరణ, ప్రాజెక్టు ప్రాంత మార్పు, పెండింగ్ దరఖాస్తులు, న్యాయస్థానాల్లో కొనసాగుతున్న కేసులు, పాటించాల్సిన నిబంధనలు, జరిమానాలు ఉంటే వాటి వివరాలు.. ఇలా ప్రతీ అంశాన్ని సమగ్రంగా ఒకే రికార్డుగా పొందుపరచాలని ఆదేశించారు.

ఏడు రోజుల నుంచి ఆరు నెలల వరకు స్పష్టమైన కార్యాచరణ

పర్యావరణ అనుమతుల సాధనకు దశలవారీ కార్యాచరణను నిర్దేశించారు. ప్రతి ప్రాజెక్టుకు ప్రత్యేక నోడల్ అధికారిని నియమించి, అందుబాటులో ఉన్న పత్రాలు, రికార్డులన్నింటినీ ఏడు రోజుల్లో సమీకరించాలని ఆదేశించారు. నవీకరించిన పర్యావరణ అధ్యయనాలు, నిబంధనల అమలు నివేదికలు, భూ రికార్డులు, న్యాయపరమైన పత్రాలు, ఇతర అవసరమైన రికార్డులను 30 రోజుల్లో సిద్ధం చేయాలని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. ప్రధాన పరిపాలనా ప్రక్రియతోపాటు దరఖాస్తుల తయారీ, పరిశీలన, సమర్పణకు సంబంధించిన దశలను 60 రోజుల్లో పూర్తిచేయాలని సూచించారు. చట్టబద్ధ విధానాలు, సంబంధిత సంస్థల పరిశీలనకు లోబడి సాధ్యమైన ప్రతి ప్రాజెక్టుకు ఆరు నెలల్లో పర్యావరణ అనుమతులు సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రకటిం చారు. ప్రాజెక్టుల పురోగతిపై ప్రతి వారం నివేదిక సమర్పించాలని, ప్రతి నెలా ఉన్నతస్థాయిలో సమీక్ష నిర్వహి స్తామని తెలిపారు. నిర్ణీత గడువుల అమలులో అలసత్వం, నిర్లక్ష్యానికి తావులేదని స్పష్టం చేశారు.

రైతులు, నిర్వాసితుల హక్కులకు రక్షణ

ప్రాజెక్టు డిజైన్లలో గణనీయమైన మార్పులు చేపట్టే ముందే పర్యావరణ, అటవీ, పునరావాసం, భూసేకరణ, పరిహారం తదితర అంశాలను పరిష్కరించాలని మంత్రి స్పష్టం చేశారు. నిబంధనలను ముందుగానే పాటించడం ద్వారా న్యాయపరమైన వివాదాలను నివారించవచ్చని, అదే సమయంలో రైతులు, భూ యజమానులు, ప్రాజెక్టు ప్రభావిత కుటుంబాల న్యాయబద్ధమైన ప్రయోజనాలను పరిరక్షించవచ్చని పేర్కొన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం ఎంత ముఖ్యమో, వాటి పరిధిలో భూములు, జీవనోపాధి కోల్పోతున్న కుటుంబాలకు న్యాయం చేయడం కూడా అంతే ముఖ్యమని తెలిపారు. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, సామాజిక న్యాయం.. ఈ మూడింటి మధ్య సమతుల్యత ఉండేలా కార్యాచరణ కొనసాగాలని సూచించారు.

గౌరవెల్లి పంప్‌హౌస్‌ను సర్వసన్నద్ధంగా ఉంచాలి

గౌరవెల్లి ప్రాజెక్టును ప్రత్యేకంగా సమీక్షించిన ఉత్తమ్ పంప్‌హౌస్‌ను పూర్తిస్థాయిలో నిర్వహణకు సిద్ధంగా ఉంచేం దుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఇంజినీర్లను ఆదేశించారు. పంపులను వినియోగంలోకి తీసుకొచ్చే సమయానికి ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ముందుగానే తనిఖీలు, పరీక్షలు, అవసరమైన మరమ్మతులు పూర్తి చేయాలని సూచించారు. నిర్దేశిత ప్రామాణిక నిర్వహణ విధానాలను, ఎసఓపీలను కచ్చితంగా అమలు చేయాలన్నారు. ప్రాజెక్టు ఎడమ, కుడి కాల్వ వ్యవస్థలను ఇంజినీరింగ్ బృందాలు సమగ్రంగా పరిశీలించాలని ఆదేశించారు. నీటి ప్రవాహానికి ఉన్న అవరోధాలను గుర్తించి అత్యవసర పనులకు అంచనాలు సిద్ధం చేయాలరు. అసంపూర్తిగా ఉన్న కాల్వ తవ్వకాలు, గట్ల తొలగింపు లేదా కోత అవసరాలు, నీటి విడుదల కేంద్రాలు, గ్రామాల మధ్య అనుసంధానం, రహదారి క్రాసింగ్‌లు, ప్రజల రాకపోకలకు అవసరమైన వంతెనలు తదితర అంశాలన్నింటినీ ఈ తనిఖీల పరిధిలోకి తీసుకురావాలని సూచించారు.

అనుమతి రాగానే సీతారామ సాగర్ పనులు

సీతారామ సాగర్ ప్రాజెక్టుకు అవసరమైన అధ్యయనాలు, పర్యావరణ పత్రాలను ఏమాత్రం ఆలస్యం లేకుండా నవీకరించాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. సంబంధిత అనుమతి లేదా న్యాయపరమైన ఆమోదం లభించిన వెంటనే పనులను పునఃప్రారంభించేందుకు వీలుగా చేపట్టాల్సిన ప్యాకేజీలకు సంబంధించిన ఇంజినీరింగ్ ప్రణాళికలు, అంచనాలు, టెండర్ పత్రాలను ముందుగానే సిద్ధంగా ఉంచాలని చెప్పారు. అనుమతులు వచ్చిన తర్వాత మళ్లీ సన్నాహాల పేరుతో సమయం వృథా కాకూడదని స్పష్టం చేశారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల, డిండి ప్రాజెక్టుల పర్యావరణ అనుమతుల విషయంలోనూ ఇదే స్థాయి అత్యవసరతతో వ్యవహరించాలని సూచించారు. ప్రతీ ప్రాజెక్టుకు ప్రత్యేక అధికారుల బృందం ఉండాలని, ఆ బృందం పత్రాల తయారీ, కేంద్ర ప్రభుత్వ విభాగాలతో సమన్వయం, దరఖాస్తుల పురోగతి, పెండింగ్ న్యాయవ్యవహారాలపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.

ఎన్‌జీటీ, సుప్రీంకోర్టు కేసులకు సమన్వయ వ్యూహం

సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన ఎన్‌జీటీ, సుప్రీంకోర్టు కేసుల విషయంలో రాష్ట్ర న్యాయ సలహాదారులు, అదనపు అడ్వకేట్ జనరల్, సీనియర్ న్యాయవాదులతో శాఖాధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న ప్రతీ పర్యావరణ కేసును విడివిడిగా సమీక్షించి నిబంధనల అమలు నివేదికలు, సాంకేతిక రికార్డులు, పర్యావరణ అధ్యయనాలు, కౌంటర్ అఫిడవిట్లను ముందుగానే సిద్ధం చేయాలన్నారు. పర్యావరణ అనుమతుల సాధన కోసం రాష్ట్ర బృందానికి నాయకత్వం వహిస్తున్న న్యాయవాది శ్రవణ్‌కుమార్ ఈ సందర్భంగా వివిధ కేసుల ప్రస్తుత స్థితి, సుప్రీంకోర్టు తాజా తీర్పు వల్ల ఏర్పడనున్న న్యాయపరమైన పరిణామాలను వివరించారు. సుప్రీంకోర్టు నిర్దేశించిన సూత్రాలు, అనంతరం కేంద్ర ప్రభుత్వం జారీచేసే మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రాజెక్టులవారీ కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని మంత్రి ఉత్తమ్ న్యాయ బృందం, శాఖాధికారులను ఆదేశించారు.

పోలవరం బ్యాక్‌వాటర్‌పై ముందస్తు అప్రమత్తత

పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ కారణంగా రాష్ట్రంలోని ప్రాంతాలపై పడే ప్రభావాన్ని కూడా విస్తృతంగా సమీక్షించారు. భూములు, గ్రామాలు, నివాస ప్రాంతాలు, ప్రజా మౌలిక వసతులు, ఇతర ఆస్తులు ఎంతవరకు ముంపునకు లేదా బ్యాక్‌వాటర్ ప్రభావానికి గురయ్యే అవకాశం ఉందో నిర్ధారించేందుకు శాస్త్రీయ అధ్యయనం చేపట్టాలని ఉత్తమ్ ఆదేశించారు. రాష్ట్ర వాదన కేవలం అంచనాలపై కాక విశ్వసనీయమైన క్షేత్రస్థాయి సమాచారం, సాంకేతిక అధ్యయనాలు, సమగ్ర ఆర్థిక అంచనాలపై ఆధారపడి ఉండాలని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, సంబంధిత ఇతర సంస్థల వద్ద రాష్ట్ర ప్రయోజనాలను దృఢంగా వినిపించాలని సూచించారు. పోలవరం పూర్తయి పూర్తిస్థాయిలో వినియోగంలోకి వచ్చేలోపే ఉమ్మడి ఖమ్మం జిల్లాపై బ్యాక్‌వాటర్ ప్రభావం ఎంతవరకు ఉంటుందో ప్రభుత్వం స్పష్టంగా అంచనా వేసి, సంబంధిత సంస్థల ముందు ఉంచాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి ఆదేశించారు. పోలవరం ముంపు లేదా బ్యాక్‌వాటర్ ప్రభావంతో నష్టపోయే భూములు, మౌలిక వసతులు, ఇతర ఆస్తులకు పరిహారం చెల్లించాల్సిన బాధ్యత సంబంధిత కేంద్ర సంస్థలదేనని స్పష్టం చేశారు. శాఖల మధ్య సమన్వయ సమావేశాలు నిర్వహించి, పెండింగ్ అంచనాలను త్వరగా పూర్తి చేసి రాష్ట్రానికి సంబంధించిన పరిహార దావాలను అధికారికంగా సమర్థ సంస్థల ముందు ఉంచాలని ఉత్తమ్‌కుమార్ ఆదేశించారు. సమావేశంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ బలరాం నాయక్, ఇంజినీర్-ఇన్-చీఫ్(జనరల్) ఓ.వీ. రమేష్‌బాబు, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్, ఇంజినీర్-ఇన్-చీఫ్(అడ్మిన్) పి.శ్రీనివాస్, ఇంజినీర్-ఇన్-చీఫ్ (ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్) ఆర్.మధుసూదన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

‘సీతమ్మసాగర్ ’ను త్వరితగతిన పూర్తిచేయాలి : మంత్రి పొంగులేటి

ఖమ్మం జిల్లాలో గోదావరి నదిపై నిర్మిస్తున్న సీతమ్మసాగర్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి  పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. సీతమ్మసాగర్ ప్రాజెక్టు పురోగతిపై ఉన్నతస్థాయి సమీక్షలో ఆయన పాల్గొన్నారు. ‘సీతమ్మసాగర’ ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగం దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న అత్యంత కీలకమైన సాగునీటి ప్రాజెక్టు అని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతోపాటు పరిసర ప్రాంతాల్లో వ్యవసాయ రంగానికి కొత్త ఊపు వస్తుందన్నారు. నిర్దేశిత గడువు లోపు ప్రాజెక్టును పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి రైతులకు అంకితం చేయాలనే లక్ష్యంతో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి పొంగులేటి అధికారులను ఆదేశించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *