– జీరో స్కూళ్లలో విద్యార్థుల నమోదుకు ప్రత్యేక కార్యాచరణ
– పాఠశాలల పునఃప్రారంభానికి ముందే సౌకర్యాలు కల్పించాలి
– చిన్నబోయినపల్లి పాఠశాల ఆదర్శనీయం
– జిల్లా కలెక్టర్ హేమంత్ సహదేవరావు
ములుగు, ప్రజాతంత్ర, జూన్ 9: ప్రతి పాఠశాలలో 10 శాతం విద్యార్థుల ప్రవేశాల పెరుగుదల సాధించాలని, జీరో విద్యార్థుల పాఠశాలల్లో విద్యార్థుల నమోదుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. 2026-27 విద్యా సంవత్సరంలో విద్యార్థుల నమోదు పెంపు, విద్యా నాణ్యత మెరుగుదల, ఎఫఎలఎన్ మిషన్, ఎఫఆరఎస్ హాజరు, బడిబాట కార్యక్రమం నిర్వహణ, పాఠశాలల పునఃప్రారంభ ఏర్పాట్లపై పాఠశాల, ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యాశాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మెరుగైన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని ప్రజలకు తెలియజేస్తూ బడిబాట కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించాలన్నారు. గ్రామాల వారీగా పాఠశాల వయస్సు పిల్లలను గుర్తించి వారందరినీ పాఠశాలల్లో చేర్పించేందుకు ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రవేశాల పెంపు కోసం ప్రతి పాఠశాల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా అమలు చేయాలని, విద్యా ప్రమాణాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ మిషన్‌ను సమర్థవంతంగా అమలు చేసి విద్యార్థుల్లో చదవడం, రాయడం, గణిత నైపుణ్యాలను పెంపొందించాలని సూచించారు. జిల్లాలోని ప్రతి పాఠశాలను విద్యాశాఖ అధికారులు క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని, బోధన, హాజరు, మౌలిక సదుపాయాలపై సమీక్షించాలని ఆదేశించారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని, నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పాఠశాలలు పునఃప్రారంభం అయ్యేలోపు తాగునీరు, మరుగుదొడ్లు, పారిశుధ్యం, పారిశుధ్యం, విద్యుత్, ఫర్నిచర్, పరిశుభ్రత తదితర అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని సూచించారు. విద్యార్థులకు సురక్షితమైన, పరిశుభ్రమైన విద్యా వాతావరణం కల్పించాలన్నారు. చిన్నబోయినపల్లి పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను 12 నుంచి 120 మందికి పైగా పెరిగేందుకు విశేష కృషి చేసిన కానిస్టేబుల్ దూపాటి సతీష్, గ్రామ సర్పంచ్‌ను జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించి నమోదు సంఖ్యను గణనీయంగా పెంచడం అభినందనీయమన్నారు. వారి కృషి జిల్లాలోని ఇతర పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. విద్యార్థుల నమోదు పెంపు, విద్యా నాణ్యత అభివృద్ధి, పాఠశాలల సమగ్ర అభివృద్ధికి ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. సమావేశంలో డీఈవో ఎ.సిద్ధార్థ రెడ్డి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కొప్పుల మల్లేశం, డీఎంహెచ్‌వో గోపాలరావు, మున్సిపల్ కమిషనర్ సంపత్, డీఐఈవో,అన్ని మండలాల ఎంఈవోలు, ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




