రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం
టిటిడి తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన టిటిడి అర్చక బృందం
శివార్చనను ప్రారంభించిన మంత్రి పొన్నం
సిరిసిల్ల,ప్రజాతంత్ర,మార్చి 7: వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి.ఈ ఉత్సవాల కోసం అన్ని శాఖల సిబ్బంది తమకు కేటాయించబడిన విధుల్లో చేరి సేవలను అందిస్తున్నారు.ఈ ఉత్సవాల కోసం ఆలయంతో పాటు వేములవాడను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. గురువారం రాత్రి వరకు 50 వేలకు పైగా భక్తులు వేములవాడకు చేరుకున్నారు.శుక్రవారం ఉదయం నుండి రాత్రి వరకు మరో రెండు లక్షల భక్తులు వేములవాడకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.శుక్రవారం ఉదయం నుండి రాజన్నగుడికి భక్తుల రాక అధికంగా ఉంటుందని ఆలయంలో తగిన ఏర్పాట్లు పూర్తి చేశారు.ఈ ఏర్పాట్లన్నింటిని వేములవాడ ఎమ్మెల్యే ,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్,రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్,జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,ఎస్పీ అఖిల్ మహాజన్‌లు గురువారం పరిశీలించారు.
గురువారం సాయంత్రం రాష్ట్ర రవాణశాఖ ,బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వేములవాడకు చేరుకుని,ఆది శ్రీనివాస్‌తో కలిసి రాష్ట్ర ప్రభుత్వ తరపున శ్రీ రాజరాజేశ్వరస్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు.అనంతరం టిటిడి అర్చక బృందం వేములవాడకు చేరుకుని శ్రీస్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు.ఈ కార్యక్రమాలనంతరం గురువవారం రాత్రి నుండి శనివారం ఉదయం వరకు కొనసాగే రాష్ట్ర సాంస్కృతిక శాఖ,దేవస్థానం వారు సంయుక్తంగా రూ కోటికి పైగా వ్యయంతో చేపట్టిన శివార్చన కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌లు ప్రారంభించారు. గురువారం అర్ధరాత్రి నుండి శుక్రవారం ఉదయం 3 గంటల వరకు స్థానిక భక్తులు శ్రీస్వామివారికి అభిషేకం చేసే అవకాశాన్ని కల్పించడంతో వేలాది స్థానికులు రాత్రి 11 గంటల నుండే క్యూలైన్లలో బారులు తీరారు.వీరంతా ఆలయంలోకి చేరుకుని శ్రీస్వామివారికి అభిషేకం చేసే సమయంలో మహామండపంలో రద్దీ అధికమైంది.ఈ రద్దీని క్రమబద్దీకరించడానికి సిబ్బంది తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఈ ఉత్సవాలను ఎప్పటి కప్పుడు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,బందోబస్తును అఖిల్ మహాజన్ లతో పాటు అన్ని శాఖల జిల్లా అధికారులు సిబ్బందికి తగిన సూచనలిస్తున్నారు.
ఇదిలా ఉండగా మహాశివరాత్రికి వేములవాడకు విచ్చేసే భక్తులకోసం ఆర్టీసి వారు వేములవాడబస్ స్టేషన్ నుండి దేవస్థానం వరకు 14 ఉచిత బస్సులను నిర్వహిస్తున్నారు.స్థానిక వాసవీ సేవాసమితి వారు,వేములవాడ అన్నదాన ట్రస్టువారు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఉచిత అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేయగా దానిని ఎమ్మెలే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు.అంతేగాకుండా దేవస్థానం వారు ఏర్పాటు చేసిన ఉచిత అల్పాహార శిబిరాన్ని సైతం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు.దీనికి తోడుగా వేములవాడ అన్న దాన ట్రస్టు వారు మహాశివరాత్రి రోజున భక్తులకు ఉచితంగా అరటి పళ్లు,నీటి బాటిళ్లు పంపిణి చేయనున్నారు.వేములవాడకు చెందిన వ్యాపారవేత్తలు ఉచితంగా మజ్జిగ పాకెట్లు,పాలను పంపిణి చేయనున్నారు. వేములవాడలోని పలు ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ల నిర్వాహకులు,స్థానికులు ఉచిత ప్యూరిఫైడ్ వాటర్‌ను పంపిణి చేయడానికి వాహనాలను సమకూర్చారు. వేములవాడలోని పలు స్వచ్చంద సంస్థల ప్రతినిధులు మజ్జిగ పాకెట్ల పంపిణి,నీటి పాకెట్ల పంపిణిని చేయనున్నారు.భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని రకాల వాహనాలను వేములవాడలోని మేన్ రోడ్డులోకి రాకుండా పోలీసులు చర్యలు తీసుకుని,ఆ వాహనాలన్నింటిని పార్కింగ్ స్థలాలకు తరలించడానికి చర్యలు తీసుకున్నారు.ఆర్టీసి వారు వివిధ ప్రాంతాల నుండి వెయ్యి బస్సులద్వారా భక్తులను వేములవాడకు చేరవేయడానికి ఏర్పాట్లు చేశారు.మేన్ బస్‌స్టేషన్‌తోపాటు కట్టకింద మరో తాత్కాలిక బస్ స్టాండ్‌ను ఏర్పాటు చేసి అక్కడ మౌళిక సదుపాయాలను కల్పిస్తున్నారు.దేసవ్థానం ఆవరణలో భక్తులు బస చేయడానికి వీలుగా పందిళ్లను వేయడంతో పాటు తాత్కాలిక మరుగుదొడ్లు,నల్లాలను దేవస్థానం వారు ఏర్పాటు చేశారు.ఎలాంటి అగ్ని ప్రమాదాలు సంభవించిన నివారించడానికి అగ్నిమాపక సిబ్బంది వారు రెండు ఫైరింజన్లతో సిద్ధంగా ఉండగా మొబైల్ వాహనాలను సైతం ఏర్పాటు చేసుకున్నారు.
భక్తులు పవిత్ర స్నానాలు అచరించే ధర్మగుండాన్ని నీటితో నింపారు.
ఈ ఉత్సవాల్లో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 15వందలకు పైగా పోలీస్ సిబ్బంది వివిధ స్థలాల్లో విధులను నిర్వహిస్తున్నారు.వైద్య ఆరోగ్య శాఖ వారు ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడంతో పాటు తీవ్ర సమస్యలతో బాధపడే వారిని ఏరియా ఆసుపత్రికి తరలించడానికి వీటుగా అంబులెన్సును సిద్ధంగా ఉంచారు.





