– కరీంనగర్‌ను వాటర్ హబ్‌గా మార్చాం
– కాళేశ్వరంతోనే ఇంత పంట పండింది
– అది నిజం కాదని చెప్పగలరా..
– కొండన్నపల్లి వరద కాల్వ పరిశీలించిన హరీష్‌రావు
చొప్పదండి, ప్రజాతంత్ర, మార్చి 7: బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో, కేసీఆర్ నాయకత్వంలో కరీంనగర్ జిల్లాను అద్భుతమైన వాటర్ హబ్‌గా మార్చామని మాజీ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం నీళ్లు వాడుకుంటున్నారు.. ఆ నీళ్లతోనే పంటలు పండుతున్నాయి.. కానీ బయట మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టే లేదని చిల్లర మాటలు మాట్లాడటం ఆ స్థానంలో ఉన్న వ్యక్తికి సిగ్గుచేటు అని అన్నారు. చొప్పదండి నియోజకవర్గ పర్యటనలో భాగంగా కురిక్యాల వద్ద కొండన్నపల్లి వరద కాలువను ఆయన శనివారం పరిశీలించారు. ఆయన వెంట మాజీ మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే సంజయ్, ఎమ్మెల్సీ ఎల్.రమణ, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తదితరులు ఉన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వరద కాలువలో పారుతున్న నీళ్లు, ఆ కాలువ మీద ఆధారపడి పండుతున్న లక్షలాది ఎకరాల పంటలు, మిడ్ మానేరుతోపాటు అనంతగిరి, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్‌లలో నింపిన జలాలు కాలేశ్వరం నీళ్లు కావా.. ఈ రిజర్వాయర్ల కింద పండుతున్న పంటలన్నీ కాళేశ్వరం జలాలతోనే కదా అని నిలదీశారు. నిన్నగాక మొన్న లక్ష్మీ పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వరద కాలువలకు నీళ్లు వదిలారు.. పొద్దున లేస్తే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని రేవంత్ రెడ్డి పదేపదే అబద్ధాలు చెబుతున్నారని .. కానీ లక్ష్మీ పంప్ హౌస్ మోటార్లు నడుస్తుంటేనే కదా ఈ నీళ్లొచ్చాయి అని హరీష్‌రావు ప్రశ్నించారు. ప్యాకేజీ 6, ప్యాకేజీ 8 కింద మోటార్లు పెట్టి టన్నెల్స్ పనులు పూర్తి చేసి, వరద కాలువను ఒక రిజర్వాయర్‌గా మార్చి చొప్పదండి, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, బాల్కొండ నియోజకవర్గాలకు అద్భుతంగా సాగునీరు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఒక్క మేడిగడ్డ బ్యారేజీ మాత్రమే కాదు. అందులో 100 కంపోనెంట్లు ఉన్నాయి. 3 బ్యారేజీలు, 16 రిజర్వాయర్లు, 18 సబ్‌స్టేషన్లు, 203 కిలోమీటర్ల టన్నెళ్లు, 1600 కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు.. ఇవన్నీ కలిపితేనే కాళేశ్వరం ప్రాజెక్టు అని కాంగ్రెస్ నేతలు తెలుసుకోవాలన్నారు. కాళేశ్వరం లేకుండానే రాష్ట్రంలో వరి పండుతోందని రేవంత్ రెడ్డి చెప్పడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు.
అత్యధికంగా వరి పండించిన రాష్ట్రంగా తీర్చిదిద్దాం
2022లోనే దేశంలో అత్యధికంగా వరి పండించిన రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దింది కేసీఆరే అని పేర్కొన్నారు. మెదక్, సిద్దిపేట, కరీంనగర్, సిరిసిల్ల, హుజురాబాద్ ప్రాంతాల్లో నేడు కళకళలాడుతున్న పంటలన్నీ కాళేశ్వరం చలవేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఈ రెండున్నరేళ్లలో ఒక్క కాలువ తవ్వలేదు, ఒక్క చెక్ డ్యాం నిర్మించలేదు, ఒక్క ప్రాజెక్టు కట్టలేదు. కనీసం కాలువల తవ్వకానికి ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సిందల్లా కేవలం పిల్ల కాలువలు, పంట కాలువలు తవ్వడమే.. ఆ చిన్న పని చేస్తే లక్షల ఎకరాలకు నీళ్లు అందుతాయి.. కానీ రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్షకట్టి ఉద్దేశపూర్వకంగానే కాలువల పనులు చేయడం లేదని అన్నారు. రూ.2052 కోట్లు ఖర్చుపెట్టి ఎల్లంపల్లి ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసిందని, ఎల్లంపల్లిలో రాయపట్నం బ్రిడ్జి నిర్మించిందని, నిర్వాసితుల కోసం 126 ఇళ్లు కట్టించి భూసేకరణ పూర్తి చేసి 2016లోనే 20 టీఎంసీల నీళ్లను ఎల్లంపల్లిలో నింపింది కేసీఆరేనని వివరించారు. గత కాంగ్రెస్ హయాంలో మిడ్ మానేరు ప్రాజెక్టులో చారాణా వంతు పనులు మాత్రమే జరిగితే 90 శాతం కాంక్రీట్ పనులు, 100 శాతం గేట్ల బిగింపు పనులు పూర్తి చేసి కరీంనగర్ జిల్లాకు గుండెకాయ లాంటి ఆ ప్రాజెక్టును పూర్తి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని చెప్పారు. మిడ్ మానేరుపై రూ.1586 కోట్లు ఖర్చు చేసి దాన్ని కాళేశ్వరం జలాలతో నింపామన్నారు. ఒకప్పుడు ఇక్కడున్న వరద కాలువ కింద రైతులకు మొక్కజొన్న పంట కూడా పండని పరిస్థితి ఉండేది. అలాంటిది కేసీఆర్ రూ.2 వేల కోట్లతో ఎస్సారెస్పీ పునర్జీవన పథకం చేపట్టి వరద కాలువను ఒక జీవనదిగా, ఒక రిజర్వాయర్‌గా మార్చి 365 రోజులు నీళ్లుండేలా చేశారని ఆయన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ధర్నా చేస్తేనో, మాజీ మంత్రి గంగుల కమలాకర్ గొంతు విప్పితేనో భయపడి మీరు మోటార్లు ఆన్ చేసి వరద కాలువలకు నీళ్లు వదలగా తూముల ద్వారా రెండు వైపులా మోటార్లు పెట్టుకుని వేలాది ఎకరాల్లో రైతులు పంట పండించుకుంటున్నారంటే అది బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన కృషేనన్నారు. వరద కాలువ నుండి ఎస్సారెస్పీకి కూడా లింక్ ఇచ్చి పెద్దపల్లి, మంథని, చొప్పదండి వర్గాలకు సాగునీరు అందించామన్నారు. సిరిసిల్ల-వేములవాడ ప్రాంతంలో మల్కపేట రిజర్వాయర్, మెట్‌పల్లికి నీళ్లందించే సదర్మాట్ ప్రాజెక్టు, అలాగే గొల్లవాగు ప్రాజెక్టులను పూర్తి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. హుస్నాబాద్‌లోని గౌరవెల్లి ప్రాజెక్టులో 96 శాతం పనులను తమ ప్రభుత్వమే పూర్తి చేసి రిజర్వాయర్‌లో నీళ్లు నింపితే మిగిలిన 4 శాతం పనులు పూర్తి చేసి కాలువల ద్వారా రైతులకు నీళ్లిచ్చే చేతగాని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని హరీష్‌రావు ఎద్దేవా చేశారు. అలాగే మిడ్ మానేరు కింద తోటపల్లి రిజర్వాయర్ ద్వారా మానకొండూరు నియోజకవర్గానికి కాళేశ్వరం జలాలను అందించింది కేసీఆరేనన్నారు. కాళేశ్వరం నీళ్లు మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్‌లోని మూసీ నదిని శుద్ధి చేయడానికి తీసుకెళ్తానని చెప్పి ఏకంగా రూ.8000 కోట్లతో టెండర్లు పిలిచారు.. ఆ మల్లన్న సాగర్‌లో ఉన్నవి కాళేశ్వరం నీళ్లు కాదా అని ప్రశ్నించారు. ఈ చిల్లర మాటలు బంద్ చేసి కాళేశ్వరం నీటిని ప్రజలకు ఇచ్చి చూపించు.. మేడిగడ్డ పిల్లర్లకు మరమ్మతులు చేసి రైతులకు నీళ్లు అందించు అని సవాల్ చేశారు. మేడిగడ్డపై ఎన్డీఎస్‌ఏ ఇచ్చిన రిపోర్టులో స్పష్టంగా మరమ్మతులు చేసి ప్రాజెక్టును వాడుకోవాలని చెప్పగా రెండేళ్లయినా పనులు చేపట్టకుండా ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తోందని ఆరోపించారు. మేడిగడ్డ పిల్లర్ కుంగినా సరే.. ఎస్సారెస్పీ ద్వారా నేరుగా మిడ్ మానేరుకి, ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకి, మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి మోటార్లు ఆన్ చేసి మూడు వైపుల నుంచి నీటిని తరలించే అవకాశం ఉందని స్పష్టం చేశారు. కానీ రేవంత్ రెడ్డి రైతులకు నీళ్లు ఇవ్వకూడదనే కుట్రతోనే ఈ పనులు చేయడం లేదన్నారు. ఉమ్మడి కరీంనగర్ లో రేవంత్ సర్కార్ కనీసం 10 వేల ఎకరాలకైనా కొత్తగా నీళ్లిచ్చిందా అని హరీష్‌రావు నిలదీశారు. వెంటనే కాలువల పనులు పూర్తి చేసి నీళ్లందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




