– కొత్తగా తొమ్మిది పౌర సేవలు అందుబాటులోకి
– డిజిటల్ సేవలను మరింత విస్తరించిన ప్రభుత్వం
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 19 : జీహెచ్ఎంసీకి సంబంధించిన పౌర సేవలను కొత్తగా మీ-సేవ వాట్సాప్, చాట్‌బాట్ ద్వారా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రజలకు మరింత సౌకర్యం, అందుబాటు, పారదర్శకత కల్పించే దిశగా ఈ సేవలను విస్తరించారు. ఈ మేరకు ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ విభాగం ఒక ప్రకటన విడుదల చేసింది. కొత్తగా జీహెచ్ఎంసీ ప్రాపర్టీ అసెస్మెంట్ రివిజన్, జనన ధ్రువీకరణ సవరణ, మరణ ధ్రువీకరణ సవరణ, బర్త్ హోమ్(ఇంటి దగ్గర పుట్టిన), డెత్ హోమ్(ఇంటి దగ్గర చనిపోయిన), ప్రాపర్టీ డోర్ నంబర్ సవరణ, ప్రాపర్టీ పేరు సవరణ, ప్రాపర్టీ ట్యాక్స్ సేవలు, ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ సేవలను వాట్సాప్ మీ-సేవలో చేర్చారు. రాష్ట్రవ్యాప్తంగా పౌరులు ఈ సేవలను వాట్సాప్ ద్వారానే పొందవచ్చని ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ విభాగం తెలిపింది. సేవలు పొందేందుకు ముందుగా 8096958096 నంబర్‌ను మొబైల్లో ‘మీ సేవ తెలంగాణ’ పేరుతో సేవ్ చేసుకోవాలి. అనంతరం వాట్సాప్‌లో ఆ నంబర్‌కు హాయ్(Hi) సందేశం పంపాలి. అవసరమైన సేవ పేరు టైప్ చేసి మెనూలో కనిపించే ఓపెన్ సర్వీస్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఫారంలో అడిగిన వివరాలు, చెల్లింపు పూర్తి చేస్తే దరఖాస్తు వెంటనే వాట్సాప్ ద్వారా నమోదవుతుంది. వాట్సాప్ ఆధారిత మీ -సేవ వేదికకు ప్రారంభం నుంచి ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని ప్రభుత్వం వెల్లడించింది. జనన ధ్రువీకరణ, ఆదాయ ధ్రువీకరణ పత్రం, పోలీస్ చలాన్, విద్యుత్ బిల్లు, బీఐఈ ఫలితాల సేవలను ప్రజలు ఎక్కువగా వినియోగిస్తున్నట్లు తెలిపింది. రోజువారీ పరిపాలన సేవలకు వాట్సాప్‌పై ప్రజల ఆధారపడటం పెరుగుతోందని పేర్కొంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





