దేశం దశ, దిశ…ఏ వైపు..?

  • ఓ వైపు  సంకల్ప్ పత్ర   ‌పేరుతో మోదీ గ్యారంటీ
  • మరో వైపు పాంచ్‌ ‌న్యాయ్‌, ‌పచ్చీస్‌ ‌గ్యారంటీ పేరుతో కాంగ్రెస్‌ ఆశ్వాసం
  • ప్రజలు శాశ్వతంగా తమచెప్పుచేతుల్లో ఉండాలనే దిశగానే నాయకుల ధోరణి
  • సాధికారత, స్వావలంబన ఉత్తి మాటేనా..ప్రజల్లో మార్పు వొచ్చేనా..?

ఏ ‌దేశమైనా స్థిరమైన అభివృద్ధి దిశగా పయనించాలన్నా, దేశ ప్రజలు శాంతి, సుఖ సంతోషాలతో పరిఢవిల్లాలన్నా ఆ దేశంలో పాలన ప్రణాళికా బద్ధంగా ప్రజా సేవయే పరమవధిగా సాగితేనే సాధ్యమవుతుంది. స్వామి వివేకానంద చెప్పినట్లుగా ఇతరుల కొరకు జీవించిన వారే యథార్థ జీవులని, తక్కిన వారు జీవన్మృతులనేంతగా కాకపోయినా ప్రస్తుత పాలకులు కనీసం తమది తాము కావలసినంత చూసుకుంటూ మిగతాది ప్రజల కొరకు చేస్తే  దేశం బాగు పడుతుంది. గతంలో లాల్‌బహదూర్‌ ‌శాస్త్రి లాంటి వేళ్ల మీద లెక్కపెట్టే అంత మంది నాయకులే ఆ కోవలోకి వొస్తారు. ప్రస్తుతం ఇంకా మనం కలియుగ ఆరంభంలోనే ఉన్నాం..పోనుపోనూ పరిస్థితులు ఇంకెంత దిగజారుతాయో అనే ఆందోళనక పరిస్థితిలో, దిక్కుతోచని స్థితిలో ఉన్నాం. పాలకుల నిర్వాకం వల్ల శ్రీలంకా, పాకిస్తాన్‌లలో పరిస్థితులు ఎంతగా దిగజారాయో, ప్రజలు ఎంతటి దుర్భర జీవితాలను గడుపవలసి వొస్తుందో మనము ప్రత్యక్షంగా చూస్తున్నాం.

ఇక ప్రస్తుతం దేశంలో సార్వత్రిక ఎన్నికల సందడి నెలకొంది. స్వాతంత్య్రానంతరం 18వ లోక్‌ ‌సభకు ఎన్నికలు జరుగనున్నాయి. అసలు దేశంలో  ప్రజాస్వామ్య పటిష్టతకు ఎన్నికలే పరమావధి. అయితే ప్రజలు స్వేచ్ఛగా తమ వోటు హక్కు వినియోగించుకున్ననాడే, ఎన్నికలు సక్రమంగా నిర్వహించబడినప్పుడే అది సాధ్యమవుతుంది. ప్రస్తుతం మచ్చుకైనా ఆ పరిస్థితులు కనిపించడం లేదు. సమీప భవిష్యత్తులో మారుతాయన్న ఆశ కూడా లేదు. ‘ప్రభావితం’ అనే విషవలయంలో చిక్కుకుని వోటర్లు విలవిలలాడుతున్నారు. దాంతో దేశ భవిష్యత్తు కోసం ఆలోచించి వోటేసే విచక్షణను మెజారిటీ ప్రజలు కోల్పోయారనే చెప్పొచ్చు. పైగా ఇప్పటి వరకు 17 సార్లు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అత్యధికంగా నమోదయిన పోలింగ్‌ ‌శాతం 67.40. అంటే ఇప్పటికీ ప్రతి ముగ్గురిలో ఒకరు తమ వోటు హక్కును వినియోగించుకోవడం లేదు.

ఆ విషయం అట్లుంచితే ఏ దేశ ప్రగతికైనా ప్రధానంగా ప్రజల జీవన ప్రమాణాలు, విద్య, వైద్యం, ఉపాధి వంటి వాటినే సూచికలుగా తీసుకుంటారు. పాలకులు కూడా వాటిని ఉన్నత స్థాయికి చేర్చే దిశగా పరిపాలన సాగిస్తేనే ఆ దేశం త్వరితగితిన అభివృద్ధి చెందుతుంది. మన దేశంలోనైతే నాయకులు, పార్టీలు ప్రజలు తమ కాళ్ల మీద నిలబడడానికి ఉపయోగపడే చర్యలకు అసలు పూనుకోరు. ఎందుకంటే వాళ్లు ఎప్పటికీ తమ చెప్పుచేతుల్లో ఉంటేనే తమ రాజకీయ ప్రయోజనాలు నెరవేరుతాయి. అదే ఒకసారి ప్రజలు స్వయం సమృద్ధిని, సాధికారతను సాధిస్తే ప్రశ్నించే అవకాశం ఉంది. దాంతో రాజకీయంగా తమ ఎదుగుదలకు అవరోధం ఏర్పడుతుంది. అందుకే ప్రజా ప్రయోజనాల కన్నా తమ స్వార్థ ప్రయోజనాలకే నాయకులనేవారు ప్రాధాన్యతనిస్తున్నారు. వారి దృష్టి కోణం కూడా అలాగే ఉంటుంది. అందుకే ఎన్నికల సమయంలో తాయిలాలతో ఎరవేసి వోటర్లను చేజిక్కించుకుంటున్నారు. అందుకు ఉదాహరణగా ప్రస్తుత పార్లమెంట్‌కు జరిగే సార్వత్రిక ఎన్నికల వేళ రెండు ప్రధాన పార్టీలు కాంగ్రెస్‌, ‌బీజేపీల మ్యానిఫెస్టోలను చూస్తే ఆ విషయం స్పష్టంగా ద్యోతకమవుతుంది. బీజేపీ  సంకల్ప్ ‌పత్ర పేరుతో విడుదల చేసిన 14 అంశాలతో కూడిన మ్యానిఫెస్టోలో ప్రధానంగా పేదలకు ఇంటింటికి పైప్‌ ‌ద్వారా గ్యాస్‌ ‌కనెక్షన్‌, ‌సూర్య ఘర్‌ ‌పథకం కింద ఉచితంగా విద్యుత్తు సరఫరా, ఇంటి పైకప్పు నుంచి సౌర విద్యుత్‌ ఉత్పత్తితో ఆదాయం, మూడు కోట్ల మంది మహిళలను లక్షాధికారులను చేయడం, మరో ఐదేళ్లపాటు 80 కోట్ల మందికి ఉచిత రేషన్‌.. ‌చిల్లర వర్తకులకు గ్యారెంటీ లేకుండా రూ.50 వేల రుణాలు..

ముద్ర పథకం రుణం 20 లక్షల రూపాయలకు పెంపు, 10 కోట్ల మంది రైతులకు పిఎం కిసాన్‌ ‌పథకం కొనసాగింపు, మూడు కోట్ల మంది మహిళలకు ఉచితంగా ఇల్లు నిర్మాణంమవంటి అంశాలే కనిపిస్తాయి కానీ ప్రజలకు ప్రభుత్వమే 100 శాతం ఉచితంగా నాణ్యమైన విద్యను అందించడం, ప్రభుత్వ వైద్య వ్యవస్థ ద్వారా ఉచిత వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవడం, ఉచితంగా వృత్తి విద్యలలో నైపుణ్యతను సాధించే విధంగా శిక్షణ అందివ్వడం, రైతులకు పండించిన పంటకు కనీస మద్దతు ధర అందజేయడం అనేటటువంటి అంశాల ప్రస్తావనే లేదు. ఇక కాంగ్రెస్‌ ‌పాంచ్‌ ‌న్యాయ్‌, ‌పచ్చీస్‌ ‌గ్యారంటీ పేరుతో ప్రకటించిన మ్యానిఫెస్టో కూడా ఇదే విధంగా ఉంది.

వాళ్లు ప్రకటించిన అంశాలలో ప్రధానంగా కులగణన, 30 లక్షల ఉద్యోగాల కల్పన, రైతుల రుణమాఫీకి కమిషన్‌, ‌పేద మహిళలలకు ఏడాదికి రూ. లక్ష ఆర్థిక సాయం వంటి అంశాలే తప్పితే ప్రజలు శాశ్వతంగా తమ కాళ్ల మీద తాము నిలబడే దిశగా చర్యల విషయమై ప్రస్తావనే లేదు. అయితే మత సామరస్యం, స్వేచ్ఛ, ప్రజాస్వామ్య పటిష్టత, రైతులు పండించే పండించే పంటకు ఎంఎస్‌పికి చట్టబద్ధత కల్పించడం వంటి అంశాలు కొంతమేర ప్రజలకు ఉపయోగపడే అంశాలుగా చెప్పుకోవచ్చు. ఏదేమైనా ప్రస్తుత పాలకుల ఆలోచనా ధోరణి ప్రజలకు ఏది కావాలన్నా తమను అడుక్కుని తీసుకునే విధంగా, తమ చెప్పుచేతుల్లో బానిసలుగా ఉండే విధంగా ఉంచాలన్న విధంగా ప్రమాదకరంగా మారింది. ప్రజల ఆలోచనా ధోరణి మారితే తప్ప ఈ విష వలయం నుంచి దేశం, తద్వారా ప్రజలు బయటపడే అవకాశం లేదు.
-వి.  రామ్మోహన్‌ ‌రావు
ప్రజాతంత్ర ప్రతినిధి

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *