పట్టింపు లేని ప్రభుత్వం
తెలంగాణకు నష్టం జరుగుతున్నా మొద్దు నిద్ర
చంద్రబాబు శిష్యుడు రేవంత్ తీరుతో నీళ్ల తరలింపు సులువైంది..
మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 : తెలంగాణ రాష్ట్ర సాగు నీరు, తాగు నీరు ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలుగుతుంటే కాంగ్రెస్ పార్టీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నదని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. బుధవారం తెలంగాణ భవన్ జరిగిన ప్రెస్‌మీట్‌లో హరీశ్ రావు మాట్లాడుతూ.. లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. వేసవిలో తాగునీటి సమస్య ఎదురయ్యే ప్రమాదం ఉందని, సోయి లేని ప్రభుత్వం అధికారంలోకి వొస్తే రాష్ట్రానికి ఎంతటి నష్టం జరుగుతుందో నేడు కళ్ల ముందు కనబడుతున్నదని అన్నారు.
సాగర్ కుడి కాల్వ నుంచి ఏపీ ప్రభుత్వం రోజు 10వేల క్యూసెక్కుల నీళ్లు తరలించుకుపోతుంటే, తెలంగాణ ప్రభుత్వం చేష్టలుడిగి చేతులు కట్టుకొని చూస్తోందని, నీళ్ల మంత్రి నీళ్లు నములుతున్నాడని ఎద్దేవా చేశారు. మూడు నెలలుగా నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి రోజుకు 10 వేల క్యూసెక్కులను ఏపీ తరలించుకుంటుంటే ముఖ్యమంత్రి, నీటి పారుదల శాఖ మంత్రి బెల్లం గొట్టిన రాళ్లలాగా చలనం లేకుండా పడి ఉన్నారు. కృష్ణా జలాల్లో ఏపీ తాత్కాలిక వాటా 512 టిఎంసీలు, కానీ ఇప్పటి వరకు 657 టీఎంసీలు తరలిస్తే మీ నోరు పెగలదా? అని నిలదీశారు. గడిచిన 25 రోజుల్లోనే 60 టిఎంసీలు తరలించారు. సీఆర్పీఎఫ్ బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆనాడు అసెంబ్లీలో తీర్మానం చేశాం. నాగార్జున సాగర్ ను తెలంగాణ ఆధీనంలోకి తీసుకోవాలని కోరాం. 2023 నవంబర్ 30న ఏ స్టేటస్ లో ఉందో, అదే స్టేటస్ ఉండాలని తీర్మానం చేశాం. ఏడాది నుంచి చేతుల్లోకి తీసుకోవడంలో కాంగ్రెస్ ఫెయిల్ అయింది. సీఆర్పీఎఫ్ బలగాల చేతిలో ఉన్న ప్రాజెక్టు నుంచి ఏపీ ఇష్టారాజ్యంగా నీళ్లు తరలిస్తోంది. చంద్రబాబును అడిగే ధైర్యం సీఎంకు లేదు. కేంద్రం ను అడిగే దమ్ము లేదు. ఈ ఏడాదికి కృష్ణాలో 1010 టీఎంసీల నీళ్లు వొచ్చాయి. తాత్కాలిక ఒప్పంద ప్రకారం అనుకున్నా ఏపీ 666 టీఎంసీలు రావాలి.
కానీ ఏపీ ఇప్పటికే 657 టిఎంసీలు వాడింది. ఏపీకి మిగిలిన హక్కు కేవలం 9 టీఎంసీలే
ఇవ్వాళ కూడా సాగర్ కుడి కాల్వలో 10వేల క్యుసెక్కులు పోతున్నాయి. తెలంగాణకు ఆ రేషియో ప్రకారం చూసిన 343 టీఎంసీల నీళ్లు తెలంగాణకు రావాలి. ఈరోజుకు తెలంగాణ వాడుకున్నది ఎంత అంటే 220 టీఎంసీ మాత్రమే. ఇంకా తెలంగాణకు 123 టీఎంసీలు రావాలి.123 మరియు 9 టీఎంసీలు కలిపితే 132టీఎంసీ. శ్రీశైలం, సాగర్ లో కలిసి ఉన్న నీళ్లు 100 టీఎంసీలు. ఈ వందలో ఏపీ తరలిస్తోంటే కాంగ్రెస్ గుడ్లు అప్పగించి చూస్తున్నది. ఏపీ నుంచి తెచ్చుకున్న మీ అడ్వైజర్, ఇంజినీర్లు ఏం చేస్తున్నారు. అని హరీష్ రావు ప్రశ్నించారు. నాగార్జున సాగర్ ఎండీడీఎల్ 510, ఈరోజు ఉన్నది 50 టీఎంసీలు. శ్రీశైలం ఎండీడీఎల్ 834, ఈరోజు ఉన్నది 50టీఎంసీలు.
రెండు కలిపి మొత్తం 100 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. ఉన్నయి తక్కువ తెలంగాణకు రావాల్సింది ఎక్కువ. ఇప్పటికైనా కళ్లు తెరవండి. యాసంగి పంటకు నీళ్లు ఇస్తామని కోట్లు పెట్టి పత్రికల్లో యాడ్స్ ఇచ్చారు. సాగర్ ఎడమ కాల్వ కింద నల్గొండలో లక్షా 45 వేల ఎకరాలు, సూర్యపేటలో 2లక్షల 35వేల ఎకరాలు, ఖమ్మంలో 2లక్షల పైగా ఎకరాలు, మొత్తంగా 6లక్షల 38వేల ఎకరాల్లో రైతులు పంటలు వేసుకున్నారు. నాలుగు తడుల నీళ్లు ఇస్తే గాని పంటలు పండవు. దాదాపు 30, 35 టీఎంసీల నీళ్లు కావాలి. ఏఎంఆర్ ఎస్‌ఎల్బీసీ కింద 2లక్షల 40వేల ఎకరాల్లో పంట వేశారు. ఈ పంటలకు కూడా మూడు నాలుగు తడుల నీళ్లు ఇవ్వాలి. ఖమ్మం, మహబూబాబాద్, నల్లగొండ, సూర్యపేట, హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ నాగార్జున సాగర్ పై ఆధారపడి ఉంది.
ఇప్పటికైనా కండ్లు తెరవండి. రైతుల పంటలు కాపాడాలంటే తక్షణం కేంద్రం మీద ఒత్తిడి తేవాలి. ఏపీ జల దోపిడీని తక్షణం అడ్డుకోవాలి. కేఆర్‌ఎంబీ ఆఫీస్ ముందు ధర్నా చేద్దాం పదండి. పోదాం పదా కేంద్ర జలశక్తి మంత్రి కార్యాలయం ముందు ధర్నా చేద్దాం. మీకు చేతగాకుంటే మీ వెంట మేమూ వొస్తాం. అఖిల పక్షాన్ని తీసుకెళ్లండి.. ముచ్చుమర్రి నుంచి తోడుతున్న నీళ్లను పోతిరెడ్డిపాడు ద్వారా తరలిస్తున్న నీటిని ఆపాలి. బీఆర్‌ఎస్ అధికారంలో ఉంటే ఈ పరిస్థితి వొచ్చేది కాదు. చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి ఇక్కడ అధికారంలో ఉండటంతో నీటి తరలింపు సులువు అయ్యింది. కాంగ్రెస్ కు సోయి లేదు, బిజేపికి పట్టి లేదు, రెండు పార్టీలు తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయి. కేంద్రంలో తనకున్న తిరుగులేని బలం వల్లనే చంద్రబాబు నాయుడు ఇష్టారీతిన జలదోపిడి చేస్తున్నాడు. కేంద్రం మంత్రిగా ఉండి కిషన్ రెడ్డి ఏం చేస్తున్నారు. మీకు బాధ్యత లేదా మీకు ఏపీ చేస్తున్న జలదోపిడీ కనబడటం లేదా కృష్ణా బోర్డు మీ పరిధిలోనే ఉన్నది. మీరు ఆర్డర్ వేస్తే ఏపీకి తరలిపోతున్న నీళ్లు ఆగవా? సికింద్రాబాద్ ప్రజలు కూడా తాగు నీటి సమస్య ఎదుర్కుంటారు. మీరు ఏపీ నీళ్లు తరలింపుపై రివ్యూ చేయండి. త్రిమెన్ కమిటీ ఎందుకు ఈ సారి సమావేశం కాలేదు. అని హరీష్ రావు నిలదీశారు. ప్రాజెక్టులకు అనుమతులు సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అవుతున్నది.
బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నపుడు చణాకా కొరటా, చిన్న కాళేశ్వరం, గూడెం ప్రాజెక్టు ఇలా అనేక ప్రాజెక్టులకు అనుమతులు తెచ్చాం. అనుమతులు కాదు కదా, చివరి దశలో ఉన్న ప్రాజెక్టుల అనుమతులను సాధించడం లేదు. డిపిఆర్ లు వాపస్ అవుతున్నయి. పాలమూరు ప్రాజెక్టు, వార్దా, కాళేశ్వరం మూడో టీఎంసీ డీపీఆర్ వెనక్కి వొచ్చింది. సీతమ్మ సాగర్ కు అన్ని అనుమతులు తెచ్చినం. చివరి అనుమతి రావాల్సి ఉంటే, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ రిజెక్ట్ చేసింది. ప్రాజెక్టులకు అనుమతులు తేరు, ఉన్న నీటి కేటాయింపులను సక్రమంగా వినియోగించరు. ఉద్దేశ్యపూర్వకంగా మేడిగడ్డను పండబెట్టారు. కాళేశ్వరం కూలి పోయిందని దొంగ ప్రచారం చేశారు. కాళేశ్వరంలో అనేక భాగాల ఉన్నయి. ఏడు బ్లాకుల్లో ఒక బ్లాకులో ఒక పిల్లర్ కుంగింది. దాన్ని రిపేర్ చేయకుండా చోద్యం చేస్తున్నారు. రైతులు నీళ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తున్నారు. కుట్రతో రిపేర్లు ఆలస్యం చేసి రైతుల నోట్లో మట్టి కొడుతున్నారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే సీఎం చోద్యం చూస్తున్నారని మాజీమంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.




